ప్రపంచంలో ఎన్నో వ్యాధులకు మందులొచ్చినా ఎయిడ్స్ మహమ్మారికి మాత్రం ఇంకా మందు కనుక్కోలేదు. ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా పెద్దగా మార్పు కనిపించడం లేదు. ప్రపంచంలో ఎన్ని రోగాలొచ్చినా.. ఎన్ని వైరస్ లు వచ్చినా ప్రతి రోగానికి మందులు ఉన్నాయి. రెండేళ్లక్రితం వచ్చిన కరోనా మహమ్మారికి సైతం విరుగుడు కనిపెట్టాం. అయితే ఇప్పటికీ మందు లేని మహమ్మారుల్లో ఎయిడ్స్ ఒకటి.
2020లో జరిగిన అధ్యయనాల ప్రకారం హెచ్‌ఐవీ రోగుల్లో 40 శాతం మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. కొందరు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. ఈ ఎయిడ్స్ మహమ్మారి అంతమొందించే మందు కోసం దాదాపు 35 ఏళ్లుగా లోతైన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ హ్యూమన్ ఇమ్యునో వైరస్ హెచ్‌ఐవిని మాత్రం చంపలేకపోతున్నారు. వైరస్ పెరుగుదలను అడ్డుకునేందుకు మాత్రమే మందులున్నాయి. అందువల్ల ఎయిడ్స్ ఒకసారి వస్తే ఇక అది పూర్తిగా నయం కాదు. కానీ దాన్ని మందులతో నియంత్రిస్తూ ఎక్కువ కాలం మనిషి జీవించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇందుకు కొండంత మనోధైర్యం మన మనసులో నింపుకోవాలి.
మనోశక్తితో…
నాకు ఎయిడ్స్ సోకింది అని తెలియగానే చాలా మంది కుంగిపోతారు. ఇక జీవితం ముగిసిపోయినట్లే అని భావిస్తారు. కానీ హెచ్‌ఐవి అనే వైరస్ ను అదుపులో ఉంచవచ్చు. ఒకవేళ అనుకోకుండా ఎయిడ్స్ సోకినా చాలా సంవత్సరాలు జీవించేందుకు అవకాశాలున్నాయి. దానికోసం పాజిటివ్ దక్పథంతో ఆలోచించాలి. ఈ వ్యాధి నన్ను ఏమీ చెయ్యలేదు అనే ఆలోచనా విధానాన్ని సబ్ కాన్సియాస్ మైండ్ కు సూచనలు ఇచ్చుకోవాలి. నేను ఏదైనా సాధించగలను అని బలంగా మదిలో అనుకోవాలి. అసలు వ్యాధి గురించి ఆలోచించకుండా జీవితంలో ఆనందంగా ఎలా జీవించాలి అనే దానిపై దృష్టిపెడితే మన మనసులోని కణాల్లో ఉత్తేజం పెరిగి హెచ్‌ఐవి తో పోరాడే మనోశక్తి వస్తుంది. ఇందుకోసం ఎయిడ్స్ బాధితులకు అందరం అండగా నిలవాల్సిన అవసరం ఉంది.
గుర్తుంచుకోండి, కట్టుబడి ఉండండి
ఎయిడ్స్ బాధితుల్లో ధైర్యం నింపేందుకు, ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపుతున్నారు. హెచ్‌ఐవి తో పోరాటంలో ఎంతవరకు ముందడుగులు పడ్డాయో ప్రపంచ శాస్త్రవేత్తలు సూచనలు, స్వచ్ఛంద సంస్థలు నివేదికలను అందిస్తాయి. ఎయిడ్స్ పై వివిధ రకాలైన అవగాహనా కార్యక్రమాలు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు నిర్వహిస్తాయి. ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, అది రాకుండా ఎలా జాగ్రత్త పడాలి, వస్తే ఎలా పోరాడాలో వివిధ చైతన్య కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఇందుకోసం ఈ సంవత్సరం ‘గుర్తుంచుకోండి, కట్టుబడి ఉండండి’ (రిమెంబర్ అండ్ కమిట్ ) అనే థీమ్ ద్వారా అవగాహన కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
అవగాహన అప్రమత్తత ముఖ్యం
పెళ్ళికి ముందు లైంగిక సంపర్కానికి దూరంగా ఉండడం, జీవిత భాగస్వామితో నమ్మకమైన దాంపత్య జీవితం కలిగి ఉండడం హెచ్.ఐ.వి నివారణలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ప్రస్తుతం ఎయిడ్స్ ను సమూలంగా నియంత్రించే మందుగానీ, టీకా గానీ మార్కెట్‌లోకి ఇంకా రాలేదు. సురక్షితం కాని లైంగిక సంబంధాలను కొనసాగించొద్దు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ సిరంజీలు, నీడిళ్లను వాడాలి. రక్త మార్పిడి చేసేటప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. స్టెరిలైజ్డ్ నీడిల్స్ మాత్రమే ఉపయోగించాలి. ప్రభుత్వ ఆమోదిత బ్లడ్‌బ్యాంక్ (రక్తనిధి)నుంచి పొందిన రక్తాన్ని మాత్రమే ఉపయోగించాలి. గర్భిణులు విధిగా హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవాలి. సైకోథెరపీ ద్వారా సెక్స్ వ్యసనపరులను ఊబి లోంచి బయటికి తీసుకురావడం సాధ్యమే. అందరిలోనూ అవగాహన పెంచుదాం. ఎయిడ్స్ లేని సమాజాన్ని సష్టిద్దాం.
– డా|| అట్ల శ్రీనివాస్ రెడ్డి, 9703935321