– మతోన్మాద బీజేపీని ఓడించండి
– సీపీఐ(ఎం) అభ్యర్థి ఎమ్‌డి.జహంగీర్‌ను గెలిపించండి : రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-చౌటుప్పల్
ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించి.. నిత్యం పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడే సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి.జహంగీర్‌ను గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఎండి.జహంగీర్‌ను గెలిపించాలని కోరుతూ రోడ్డుషో నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో వీరయ్య మాట్లాడారు. మతోన్మాద, నియంతృత్వ, ప్రజా వ్యతిరేక బీజేపీని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం మతం, కులం పేరుతో ఓట్ల రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం, రోజు కూలి అందించడంలో విఫలమైందని, రోజుకు రూ.178 కూలి సరిపోతుందని చెప్పడం దుర్మార్గమని అన్నారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. రైతులే కూలీలుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరిచిందన్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే కార్మికులు, రైతులు, ప్రజల మధ్య కూడా చిచ్చుపెడ్తారని అన్నారు.
అభివృద్ధి శూన్యం
సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి.జహంగీర్
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు సార్లు కాంగ్రెస్, ఒకసారి బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచినా అభివృద్ధి చేయలేదని సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి.జహంగీర్ అన్నారు. ఈ ప్రాంతానికి ఎన్ని నిధులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి మారిన బూర నర్సయ్యగౌడ్ ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండి ఎన్ని నిధులు తెచ్చి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. సొంత ఆస్తులు పెంచుకున్నారని విమర్శించారు. వైద్యసంస్థలను పెంచుకోవడమే పనిగా పెట్టుకున్నారు తప్ప ప్రజలకు సేవ చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రజల కోసం ఎక్కడ ధర్నాలు చేశారు, ఎప్పుడైనా జైళ్లకు పోయారా అని ప్రశ్నించారు. ప్రజల వెన్నంటి ఉండి పనిచేస్తున్న తనను గెలిపిస్తే ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు తెస్తానని అన్నారు. గోదావరి జలాలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. పిలాయిపల్లి కాల్వ సాధన కోసం 130 రోజులు దీక్షలు చేపట్టామన్నారు. సీపీఐ(ఎం) పోరాటాల ఫలితంగానే ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాల్వలు సాధించామన్నారు. పార్లమెంట్‌కు దద్దమ్మలు ఎన్నికవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాట నాయకులను గెలిపించి ఆయుధం ఇవ్వాలని కోరారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, నాయకులు ఎమ్‌డి.పాషా, బండారు నర్సింహా, నందిపాటి మనోహర్, అవ్వారు రామేశ్వరి, ఆ పార్టీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, వైస్‌చైర్మెన్ బత్తుల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.