– గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ
– సరికొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లేలా కార్యచరణ
– ఎన్నికల్లో విజయంపై ఎవరి దీమా వారిదే..
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో రాజకీయం రసవత్తరంగా మారింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తలపడుతున్నాయి. పక్కా కార్యాచరణతో విజయం సాధించాలని తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అభ్యర్థులు ఎవరనేది తేలిపోవడంతో మూడు పార్టీలు యుద్ధానికి సై అంటున్నాయి. గెలుపుపై ఎవరికి వారే దీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఇప్పటికే బస్తీబాట పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లిపోగా.. దానం నాగేందర్ గ్రేటర్‌లోని క్యాడర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ నియోజవర్గంలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులతో భేటీ అవుతున్నారు.
నవతెలంగాణ-సిటీబ్యూరో
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగురువేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీల్లోని కీలక నేతలను చేర్చుకుంటూ.. ఆ పార్టీలను బలహీనపర్చే పనిలో నిమగమయ్యారు. అంతేగాక ఎలాగైనా ఇక్కడ ప్రస్తుత ఎంపీ, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా పనిచేయాలని క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఖైరతాబాద్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌ను ఇక్కడి నుంచి బరిలోకి దింపారు. కాంగ్రెస్ హయాంలో దానం నాగేందర్ రెండుసార్లు మంత్రిగా, ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా సేవలందించిన అనుభవం ఎన్నికల్లో పార్టీ విజయానికి కలిసిసోచ్చే అంశంగా భావిస్తున్నారు. ఇదిలావుంటే ఇప్పటికే దానం అన్ని నియోజవర్గాల్లోని పాత, కొత్త క్యాడర్‌తో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంఐఎంతో కూడా మంచి సంబంధాలు కలిగివుండటం ఆయనకు మరో అడ్వాంటేజ్ అని చెబుతున్నారు. అంతేగాక ప్రస్తుత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆయనకు రానున్న ఎన్నికల్లో సహకారమందించినా ఆశ్చర్యపో నక్కర్లేదు. మాస్ లీడర్‌గా పేరున్న దానం నాగేందర్‌కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉండటంతో పాటు అదేస్థాయిలో వ్యతిరేకత కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎంపిక కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు లాభం చేస్తుందనేది వేచిచూడాలి.
కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన పద్మారావు..
సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎట్టకేలకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ తాజాగా ప్రకటించారు. సికింద్రాబాద్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మారావు గౌడ్.. కార్పొరేటర్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. సికింద్రాబాద్ ప్రజలకు ఆయన ‘పజ్జన్న’గా సుపరిచితులు. ఇదిలావుంటే సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో అంబర్‌పేట, ముషీరాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లుండగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి మినహా.. మిగతా ఆరు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలిచారు. వారిలో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ఇప్పుడు సికింద్రాబాద్ లోక్‌సభకు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. నగర పరిధిలో అంతా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉండటం ఈ ఎన్నికల్లో పద్మారావుకు కలిసొచ్చే అంశమే. కానీ ప్రస్తుత ఎమ్మెల్యేలు ఏ మేరకు పద్మారావుకు సహకరిస్తారోనని అప్పుడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సీఎం రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో ఎవరూ ఉంటారో.. ఎవరు ఉండరో.. తెలియని అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. మొత్తానికి ఒకటి రెండు రోజుల్లో సికింద్రాబాద్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తామని ఆదివారం పద్మారావు గౌడ్ నివాసంలో గ్రేటర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
బస్తీ బాటతో ప్రజల్లోకి బీజేపీ
అన్ని పార్టీల కంటే ముందుగానే సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి పేరు ఆ పార్టీ ప్రకటించింది. దీంతో ఆయన పార్టీ అగ్రనేతల ఆదేశాలతో సభలు, సమావేశాలతో సంబంధం లేకుండా బస్తీల్లో పర్యటనలు చేపడుతున్నారు. నిత్యం కాలనీల్లో పర్యటిస్తూ.. జనంతో మమేకమవుతున్నారు. ఇప్పటికే అంబర్‌పేట్, సనత్‌నగర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో మహిళలు, పుర ప్రముఖులు, కాలనీ పెద్దలు, అపార్ట్‌మెంట్ వాసులతో కలిసి అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చిస్తున్నారు. కానీ సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన ఈ ఐదేండ్లలో ఆ ప్రాంతవాసులు ఆశించిన స్థాయిలో ఆయన అభివృద్ధి చేయలేదనే చర్చ నడుస్తోంది. దాంతో బస్తీల్లో పర్యటనల సందర్భంగా ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడితే.. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేల అభివృద్ధి, రామప్ప, రామమందిరం దేవాలయాల గురించి మాట్లాడుతున్నారని చెబుతున్నారు.