ఏదైనా ఒక పని మంచిదా? కాదా? అని బేరీజు వేయాల్సి వచ్చినప్పుడు అది అత్యధిక మందికి మేలు చేస్తే మంచిదని చెబుతుంటారు పెద్దలు. ఆ రకంగా చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర విత్తమంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ మనదేశంలో అసంఖ్యాకంగా ఉన్న కార్మికులు, కష్టజీవులు, కర్షకులు, పేదలకు ఉపయోగపడేదిగా లేదని పెదవి విరుస్తున్నారు ఆర్థిక విశ్లేషకులు. పద్దులోని కేటాయింపులను బట్టి ఇది ఫక్తు ఎన్నికలు జరగబోయే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్‌కు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉందే తప్ప మొత్తం దేశానికి, తెలంగాణకు ఎంతమాత్రమూ ప్రయోజనకరంగా లేదన్నది నిర్వివాదాంశం. అంకెల గారడీ, కాకిలెక్కలు అని సాధారణంగా విమర్శలు చేయకుండా లోతుగా పరిశీలిస్తే ఈ బడ్జెట్ ఎవరికోసమనేది తేలుతుంది. జాతీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ)ని పెంచాలన్న సదుద్దేశంలో పన్ను మినహాయింపు లిచ్చామంటూ మంత్రి సూత్రీకరించారు. కానీ జీడీపీ పెరగాలంటే పన్ను మినహాయింపు లివ్వటం కాదు.. దేశంలో అట్టడుగునున్న కార్మికుల కనీస వేతన స్థాయి పెరగాలి, అసంఘటిత రంగ కార్మికుల వేతనాలు, వృత్తిదారులు, రైతుల ఆదాయాలు పెరిగేందుకు చర్యలు చేపట్టాలన్న మౌలిక సూత్రాన్ని కేంద్రం విస్మరించటం దాని ఆర్థిక విధానాలకు నిదర్శనం. ఈ సూత్రానికి విరుద్ధంగా కార్పొరేట్, ప్రయివేటు పెట్టు బడులను ఇంకా ప్రోత్సహించటం ద్వారా సంపన్నులు మరింత సంపన్నులుగా, శతకోటీశ్వరులు మరింత శత కోటీశ్వరులుగా మారేందుకు సర్కారు ఊతమిస్తోంది. గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తూ అంతో ఇంతో వారి పొట్ట నింపుతున్న ‘నరేగా’కు ఎక్కువ నిధులు కేటాయించాలన్న డిమాండ్లను పట్టించుకోకుండా కేవలం రూ.86 వేల కోట్లే ఇచ్చి చేతులు దులుపుకోవటం పేదల పట్ల మోడీ సర్కార్‌కు ఉన్న చిత్తశుద్ధికి ప్రత్యక్ష ఉదాహరణ. దేశ స్వయం సమృద్ధిలో ఇప్పటి వరకూ కీలక పాత్ర పోషించిన ఇన్సూరెన్స్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నూటికి నూరు శాతం ఆహ్వానించటం ద్వారా ఆ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్‌కు ధారాదత్తం చేశారు. ఆర్థిక మాంద్యం గురించి సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో దాన్నుంచి గట్టెక్కేందుకు తీసుకోవా ల్సిన విధానపరమైన నిర్ణయాలను ఆర్థిక మంత్రి విస్మరించారు. అడ్డూఅదుపు లేకుండా పెరుగు తున్న ధరలను నియంత్రించేందుకు కేంద్రం నిర్దిష్ట చర్యలను ప్రకటించకపోవటంతో పేదలు, మధ్యతరగతిపై మరిన్ని భారాలు పడనున్నాయి.
ఇక మన రాష్ట్రానికి ఈ బడ్జెట్‌ను అన్వయించి చూసుకుంటే… ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణకు దక్కింది గుండుసున్నా. వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల కోసం రూ. 1.63 లక్షల కోట్ల సాయం చేయాలంటూ రేవంత్ సర్కారు… కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. వాటిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా వెక్కిరించటం ‘బడేభారు’కే చెల్లింది. వెనుకబడిన జిల్లాలు, ప్రాంతాలకు ఇచ్చే నిధులను ఆరేండ్ల నుంచి తొక్కిపట్టిన కేంద్రం… ఈసారి కూడా వాటికి కేటాయింపులు చేయకుండా ‘సారీ’ చెప్పింది. తన ప్రసంగాల్లో ప్రతీసారి ‘మిత్రోన్…’ అంటూ సంబోధించే ప్రధాని మోడీ, తెలంగాణను మాత్రం తన మిత్రుల జాబితాలో చేర్చుకోలేదు. అందుకే కాబోలు… పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు రూ.15 వేల కోట్ల సాయం ప్రకటించి, తెలంగాణకు ‘గాడిద గుడ్డు’ను ఇచ్చారు. తెలంగాణ కంటే ముందు ఏర్పడిన రాష్ట్రాలను పరిశీలిస్తే…వాటికి సంబంధించిన ఏ ఒక్క విభజన హామీలను నెరవేర్చలేదంటూ సీపీఐ(ఎం) ఏనాడో హెచ్చరించింది. అదే కత ఇప్పుడు మన రాష్ట్రం విషయంలో నిజమైంది. విభజన హామీల్లో ఏ ఒక్కదాన్నీ అమలు చేయని కేంద్రం… ఇప్పుడు వాటిని పూర్తిగా అటకెక్కించింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదాపై బడ్జెట్‌లో ఒక్కటంటే ఒక్క ముక్క లేకపోవటం గమనార్హం. కాకపోతే ఈ పద్దులో మోడీ సర్కార్… అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణకు కూడా ‘ఓ బంపర్ ఆఫర్’ ఇచ్చింది. విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తే ఎఫ్‌ఆర్‌బీఎమ్ చట్టం కింద మరో 0.5 శాతం అప్పులిస్తామంటూ రాష్ట్రాలకు ఆశపెట్టారు. ఈ ఆశకు మనం అర్రులు చాస్తే గతంలో వినిపించిన ‘మోటార్లకు మీటర్లు’ అనే పదాన్ని మళ్లీ వినాల్సి వస్తుంది. అదే జరిగితే తెలంగాణ వ్యవసాయం కుదేలవుతుంది. తన రాజకీయ ప్రయోజనాలరీత్యా అయినా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇలాంటి విద్యుత్ సంస్కరణలను అమలు చేయబోమని ప్రకటించింది. అందువల్ల అత్యంత ప్రమాదకరమైన కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను నేటి కాంగ్రెస్ సర్కారు సైతం నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి. రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయని కేంద్ర బడ్జెట్‌పై సీపీఐ(ఎం) ఇప్పటికే నిరసనలు చేపట్టింది. అధికార కాంగ్రెస్ గళమెత్తి, ఆందోళనలకు పిలుపునివ్వటం హర్షణీయం. అయితే ఇక్కడితో ఆగిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం తన పోరాటాన్ని హస్తిన దాకా కొనసాగించాలి. అన్ని పార్టీలనూ కలుపుకుని ఢిల్లీని ‘ఢ’ కొట్టాలి.