ప్రజా సమస్యలపై పోరాడేది ఎర్రజెండానే..

Fighting on public issues is a red flag.– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి
– కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహరణపై మండిపాటు 
– ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వాలు అమలు చేయాలని హెచ్చరిక 
– హామీలను విస్మరిస్తే ప్రజా పోరాటాలు నిర్మిస్తామని సూచన 
నవతెలంగాణ – బెజ్జంకి
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేది ఎర్రజెండా నేనని..పోరాటాలతోనే ప్రజలకు హక్కులు సిద్ధించాయని సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఐ(ఎం)3వ మండల మహాసభకు ఆమదాల మల్లారెడ్డి ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు.ప్రజలకు పాలకులు ఇచ్చిన హామీల అమలుకు రాబోయే రోజుల్లో బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామన్నారు.ఎన్నికలకు ముందు ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ వైఫల్యం చెందారని అసహనం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం నత్తనడకన కొనుగోళ్లు చేయడం,అంక్షలతో కోతలు విధించడం రైతులను మోసం చేయడమేనని సూచించారు. కేంద్రంలోని బీజేపీ మతోన్మాదంతో ప్రజల మధ్య చిచ్చు రేపుతోందని..లౌకిక వాదానికి,దేశ ప్రయోజనాలకు విఘాతమేనని హెచ్చరించారు. ఒకే దేశం..ఒకే ఎన్నిక విధానం రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను,ప్రజాస్వామ్యంపై దాడికి ఊతం పోసి ధ్వంసం చేయడమేనన్నారు. కార్పొరేట్ సంస్థలకనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలను హరిస్తూ పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతోందని కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని సూచించారు. పోరాటాలతో సాధించుకున్న కార్మికుల చట్టాలను పరిరక్షించుకోవాల్సిన అవశ్యకత ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేటీకరణ, మతోన్మాద,సరళీకృత ఆర్థిక విధానాలు,ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయకుండా ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను చిత్తశుద్ధితో పూర్తిగా అమలు చేయాలని సూచించారు.లేని పక్షంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ(ఎం)పార్టీ ఆధ్వర్యంలో బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు.జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాళ్ల బండి శశిధర్,మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్,జిల్లా కమిటీ సభ్యులు దాసరి ప్రశాంత్,బొమ్మిడి సాయికృష్ణ,సంగ ఎల్లయ్య, బోనగిరి లింగం,బండి చంద్రయ్య,మద్ది మల్లేశం, బోనగిరి ప్రభాకర్,దుగ్యాని తిరుపతి,సత్తయ్య రాజలింగం తదితరులు పాల్గొన్నారు.