16 వరకు అఫిడవిట్లు దాఖలు చేయండి

– కాళేశ్వరం న్యాయ కమిషన్‌ ఆదేశం
– 14 మంది పంపుహౌజ్‌ ఇంజినీర్ల విచారణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మూడు బ్యారేజీలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ తదుపరి కార్యాచరణకు సమాయత్తమవుతున్నది. సాగునీటి పారుదల, అభివృద్ధి శాఖ ఇంజినీర్లతోపాటు నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి ఇప్పటికే వచ్చిన అఫిడవిట్లను అధ్యయనం చేసే పనిలో కమిషన్‌ నిమగ మైంది. అనంతరం అందులోని ఆయా అంశాల ఆధారంగా నోటీసులు జారీచేసి సాక్ష్యాలు నమోదు చేయనున్నారు. ఆ తర్వాతే బహిరంగ విచారణ ప్రక్రియకు శ్రీకారం చుడతారు. విచారణ ప్రక్రియలో భాగంగా సోమవారం పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందు పంపుహౌజ్‌ నిర్మాణ సంస్థలకు చెందిన 14 మంది ఇంజినీర్లు, అధికారులు హాజరయ్యారు. సంబంధీకుల నుంచి అవసరమైన వివరాలు, సమాచారం అడిగి తీసుకున్నారు. వారిని కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. అఫిడవిట్ల దాఖలుకు ఈనెల 16వ తేదీ వరకు గడువిచ్చారు. పంపుహౌజుల నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా కమిషన్‌ ముందుకు వచ్చారు. ఇదిలావుండగా కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో ఇచ్చిన నివేదికను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) ఈ కమిషన్‌కు అధికారికంగా సమర్పించింది. నివేదికను పరిశీలించిన తర్వాత కాగ్‌ అధికారులను పిలిచి పూర్తి వివరాలను విచారించే ఆలోచనలో ఘోష్‌ కమిషన్‌ ఉన్నట్టు సమాచారం. కమిషన్‌కు సహాయకారిగా ఉండేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా మూడు బ్యారేజీలకు సంబంధించి తమ అధ్యయన నివేదికను కమిషన్‌కు అందజేసింది. తుది నివేదిక ఇవ్వాలని ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ, విజిలెన్స్‌ విభాగాన్ని కమిషన్‌ మరోసారి ఆదేశించింది. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కమిషన్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. సర్కారు దగ్గర ఉన్న సమాచారంతోపాటు ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కమిషన్‌ సర్కారును కోరింది. పంపుహౌజ్‌ ఇంజినీర్లతో సుదీర్ఘంగా విచారించినట్టు తెలిసింది. పంపుహౌజుల మునక, కారణాలు, పునరుద్ధరణ, ప్రస్తుత పరిస్థితి, అయిన ఖర్చు తదితర అంశాల పై స్పష్టత కోరినట్టు తెలిసింది. ఈమేరకు అందరూ ఈనెల 16లోగా అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించింది.