నిండుకుండలా ‘జలాశయాలు’

Filled 'reservoirs'– వేంసూరు మినహా 4 మండలాల్లో నిండిన చెరువులు
– అలుగు పారుతున్న బేతుపల్లి పెద్దచెరువు
– బేతుపల్లి సర్‌ప్లస్‌ 4,314 క్యూసెక్కులు దిగువకు
– ఎన్టీఆర్‌ కెనాల్‌కు 100క్యూసెక్కులు విడుదల
– పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్న లంకాసాగర్‌
– దిగువకు పారుతున్న సర్‌ప్లస్‌ 1,200 క్యూసెక్కులు
నవతెలంగాణ-సత్తుపల్లి
గత మూడు, నాలుగు రోజులుగా ఎడతెరిపీ లేకుండా కురుస్తున్న వర్షానికి సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో ఒక్క వేంసూరు మండలం మినహా మిగతా నాలుగు మండలాల్లోని జలాశ యాలన్నీ పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా తొణికిసలాడుతూ కళకళలాడుతున్నాయి. నియో జకవర్గంలోని ప్రధాన సాగునీటి జలవనరులైన పెనుబల్లి మండలంలోని లంకసాగర్‌, సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి పెద్దచెరువు పూర్తిస్థాయి నీటి మట్టాలకు చేరు కున్నాయి. లంకాసాగర్‌ నీటి సామర్థ్యం 65టీఎంసీ (664 ఎంసీఎఫ్‌టీ)లకు చేరకొని సర్‌ప్లస్‌ 1200క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి వెళుతోంది. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి పెద్దచెరువు నీటి సామర్థ్యం 17అడుగులకు గాను పూర్తి నీటి మట్టానికి చేరుకొని అలుగు (మత్తడి) పారుతోంది. పెద్దచెరువు సర్‌ప్లస్‌ 4,314 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి ప్రవహి స్తోంది. మరో 100క్యూసెక్కుల నీటిని ఎన్టీఆర్‌ కెనాల్‌ ద్వారా వేంసూరు, సత్తుపల్లి మండలంలోని చెరువులకు ఆక్విడెక్ట్‌ ద్వారా నీటిని విడుదల చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రెండు ప్రధాన జలవనరులతో పాటు మిగతా 381 చెరువుల్లో సత్తుపల్లి-78, పెనుబల్లి-108, కల్లూరు-83, తల్లాడ-31 చెరువులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకొని మత్తడిలు (అలుగు) పడగా వేంసూరు మండలంలో ఉన్న 83 చెరువుల్లో కొన్ని పూర్తిస్థాయి నీటి మట్టాలకు చేరుకోగా మరికొన్ని చేరువలో ఉన్నట్లు నీటి పారుదలశాఖ డీఈఈ సంపతి వెంకటేశ్వరరావు తెలిపారు. అధికారులతో కలిసి బేతుపల్లి పెద్దచెరువును పరిశీలించిన డాక్టర్‌ దయానంద్‌ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకొని జలకళతో నిండివున్న బేతుపల్లి పెద్దచెరువును రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయకుమార్‌, ఐబీ ఈఈ సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, డీఈఈ సంపతి వెంకటేశ్వరరావుతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. ముందు జాగ్రత్తలు తీసుకొని ఆస్తి, ప్రాణనష్టాలు జరక్కుండా చూడాలని దయానంద్‌ కోరారు. దయానంద్‌ వెంట కాంగ్రెస్‌ నాయకులు దొడ్డా శ్రీనివాసరావు, ఇమ్మనేని ప్రసాద్‌, కమల్‌పాషా, దోమ ఆనంద్‌ మట్టా చెన్నారావు పాల్గొన్నారు.