ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ

 Filling 2 lakh jobs within a year– హామీని నిలబెట్టుకుంటాం
– తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగ సమస్యే కారణం
– పదేండ్ల పాటు ఈ అంశాన్ని పట్టించుకోని బీఆర్‌ఎస్‌ సర్కార్‌
– నర్సుల నియామకాలపై హరీశ్‌వి అర్థం లేని మాటలు
– కేసీఆర్‌ సాబ్‌..ముందు మీ అల్లుడికి బుద్ధి చెప్పండి
– స్టాఫ్‌ నర్సులకు నియామకపత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి
– నిరుద్యోగుల కలల సాకారంలో ఇది తొలి అడుగు : డిప్యుటీ సీఎం భట్టి
 Filling 2 lakh jobs within a yearనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 6,956 మంది నర్సింగ్‌ ఆఫీసర్ల (స్టాఫ్‌ నర్సులు)కు నియామక పత్రాలను సీఎం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలను చేపడతామని తెలిపారు. త్వరలో 15 వేల పోలీసు ఖాళీలను భర్తీ చేయడంతో పాటు వైద్యారోగ్యశాఖలో ఖాళీగా ఉన్న ఐదు వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే టీయస్‌పీఎస్సీ ప్రక్షాళన దిశగా కొత్త చైర్మెన్‌, సభ్యులను నియమించినట్టు తెలిపారు. నర్సింగ్‌ ఆఫీసర్ల నియామకాలు ఏడాది కాలంగా ఆలస్యమవుతున్న విషయం తన దృష్టికి రాగానే సమీక్ష నిర్వహించి నియామక పత్రాల అందజేతకు ఆదేశించినట్టు వివరించారు.
నిరుద్యోగ సమస్యే తెలంగాణ ఉద్యమానికి కారణమనీ, అయితే ఆ సమస్యను గత పదేండ్ల పాటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని రేవంత్‌ ఈ సందర్భంగా విమర్శించారు. నిరుద్యోగుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడితే పదేండ్లు వారి ఆకాంక్షలను నెరవేర్చకుండా కేసీఆర్‌ తన కుటుంబంలోరి వారి ఉద్యోగాల కల్పనపైన్నే ధ్యాస పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ ఎంపీగా కల్వకుంట్ల కవిత ఓడిపోతే బాధపడిన కేసీఆర్‌, ఆమెకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారని గుర్తుచేశారు. అదే తీరుగా రాష్ట్ర ప్రజల పట్ల వ్యవహరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకునిగా నూతనంగా నియమితులైన నర్సింగ్‌ ఆఫీసర్లను ఆశీర్వదించాలనీ, లేకపోతే ఆ హౌదాకు కూడా కేసీఆర్‌ సరిపోడని ఎద్దేవా చేశారు. నూతనంగా నియమితులైన నర్సులను చూసి ఫాంహౌజ్‌లో ఉన్న వారు కుళ్లుకున్నా సరే… ప్రజలను సంతోషపెట్టేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు శాపనార్థాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదని ఎద్దేవా చేశారు. అవాకులు, చెవాకులు పేలడం మాని, పేదోళ్ల కండ్లల్లో ఆనందం చూడాలని సూచించారు. స్టాఫ్‌ నర్సులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్టు మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శిస్తున్నారని చెప్పారు. అందువల్ల కేసీఆర్‌ ముందు తన అల్లునికి బుద్ధి చెబితే మంచిదని సూచించారు. ఆరోగ్య తెలంగాణలో నర్సుల పాత్ర కీలకమని ఆయన అభినందనలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సార్థకత వచ్చిన రోజుగా బుధవారం నిలిచిందని తెలిపారు. నిరుద్యోగుల కలల సాకారంలో ఇది తొలి అడుగని చెప్పారు. రాష్ట్ర అవసరాలు, అప్పులు, చిధ్రమైన ఆర్థిక వ్యవస్థ నడుమ దాదాపు రూ.500 కోట్ల భారం పడుతున్నా సరే, నర్సుల పోస్టుల భర్తీకి తమ సర్కారు ముందుకొచ్చిందని చెప్పారు. వైద్యారోగ్యశాఖలో ఖాళీగా ఉన్న మరో 5 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలనీ, ఆప్రజల కలలు నెరవేర్చడం కోసం సమిష్టిగా ప్రయత్నిస్తామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ మాట నిలెబట్టుకుంటుందని హామినిచ్చారు.వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ప్రజలకు విద్య, వైద్యం, సంక్షేమం ముఖ్యమనీ, ఆ దిశగా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలిపారు. జన్మించిన తర్వాత మరణించే వరకు ప్రజలకు సేవలందించేది నర్సులని కొనియాడారు. ప్రతీ ఏడాది రాష్ట్రంలో 20 వేల మంది నర్సింగ్‌ విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. పేపర్‌ లీకులు, కోర్టు కేసుల్లేకుండా, రోస్టర్‌ విధానాన్ని పాటించి నర్సింగ్‌ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, శాసనసభ్యులు మందుల శామ్యూల్‌, నాగరాజు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ, వేణుగోపాల్‌, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టీనా చొంగ్తూ, ఆర్‌.వీ.కర్ణన్‌, ఇతర ఉన్నతాధికారులు నూతనంగా నియమితులైన నర్సింగ్‌ ఆఫీసర్లకు శుభాకాంక్షలు తెలిపారు.