సినీ విశ్లేషకులు మెచ్చిన చిత్రం

సినీ విశ్లేషకులు మెచ్చిన చిత్రం‘కసబ్లాంకా’ యుద్ధ నేపధ్యంలో 1942లో నిర్మించిన ఓ ముక్కోణపు ప్రేమ కథా చిత్రం. హాలివుడ్‌ నిర్మించిన చిత్రాలలో ఓ క్లాసిక్‌గా ఎందరో సినీ విమర్శకులు ప్రస్తావించిన ఈ సినిమా ‘ఎవ్రీబడీ కమ్స్‌ టూ రిక్స్‌’ అనే ఓ స్టేజీ డ్రామా ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఈ సినిమా కొన్ని దశాబ్దాల తరువాత కూడా ప్రేక్షకులను అదే స్థాయిలో అలరిస్తుందని అప్పట్లో ఈ సినిమాలో నటించిన వారెవ్వరూ అనుకోలేదు. కాని ఇంగ్లీషు భాషలో సినిమాలు చూసే అందరూ ఈ సినిమాను ఇష్టపడి చూస్తారు. దానికి కారణం సినిమా కథ, కథనం, ఇందులో ప్రస్తావించిన విలువలు. ముఖ్యంగా మానవ సంబంధాల నడుమ చూపించిన గౌరవం. ముఖ్య పాత్రలలో నటించిన నటుల కెరీర్లలో ఈ సినిమా ఓ గొప్ప క్రెడిట్‌గా నిలిచిపోయింది.

కాసబ్లాంకా ఆఫ్రికా ఖండంలో మొరొక్కో ప్రాంతంలోని ఓ ప్రఖ్యాత నగరం. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో ఈ నగరం యూరోప్‌ ప్రాంతం నుండి వలస వచ్చిన శరణార్దులతో నిండి పోయింది. అమెరికా పారిపోవాలనుకునే ఈ శరణార్దులు ఆ దేశం వెళ్ళడానికి కావల్సిన వీసాల కోసం ఈ నగరంలో ఉండి ప్రయత్నించేవారు. విషి ఫ్రాన్స్‌ క్రింద ఉన్న ఈ నగరంపై జర్మన్ల పట్టు అప్పట్లో లేదు. అందుకని రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇతర దేశాల నుండి శరణార్ధులు ఈ నగరానికి పెద్ద సంఖ్యలో చేరేవాళ్లు.
అమెరికా నుండి వలస వచ్చిన రిక్‌ బ్లైన్‌ కసబ్లాంకా నగరంలో రాత్రి పూట ఓ బార్‌, జూద గృహం నడుపుతూ ఉంటాడు. ఆ యుద్ధ వాతావరణంలో కూడా తన లాభం తప్ప అతను ఎవరి పక్షం తీసుకుని మాట్లాడకపోవడం, ఏ ఒక్క దేశానికి ప్రతినిధిగానో సానుభూతిపరుడిగానో ఉండకపోవడంతో అతనికి అన్ని దేశాలవారు మిత్రులుగా ఉంటారు. ఆ బార్‌కి అందరూ వచ్చి వెళుతూ ఉంటారు. అక్కడే కొందరు వ్యాపారులను కలిసి వారడిగిన డబ్బు ఇచ్చి తమ వీసాలు కొనుక్కుంటూ ఉంటారు. చాలా సంగతులు తెలిసినా తనకు పట్టనట్లు మౌనంగా ఉండిపోయే రిక్‌ యూథోఫియాకు ఆయుధాలు అందించాడని, స్పానిష్‌ సివిల్‌ యుద్ధంలో తన పాత్ర పోషించాడని, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తన వంతుగా ఒకప్పుడు పని చేశాడని కెప్టన్‌ లుయూ రనాల్ట్‌కు తెలుసు. ఇప్పుడు అతను ఎందుకు తటస్థంతా ఉండిపోయాడో మాత్రం లూయీకి అంతుపట్టదు. ఇతను ఆ నగరంలో పెద్ద పోలీసు అధికారి. రిక్‌ బార్‌కు ఫ్రెంచ్‌ అధికారులు, నాజీ జర్మనీ సైనికాధికారులు కూడా వస్తుంటారు.
రిక్‌ బార్‌లో అతని మిత్రుడు సామ్‌ పియానో వాయిస్తూ ఉంటాడు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంటుంది. సామ్‌ని ఎక్కువ జీతంతో మరో వ్యక్తి ఉద్యోగంలోకి తీసుకుంటానంటే కూడా సామ్‌ ఆ బార్‌ విడిచి వెళ్లడు. అతని జీవితం రిక్‌తో పెనవేసుకుని ఉంటుంది. ఆ బార్‌కు తరచుగా వచ్చే ఉగార్తె అనే ఒక బ్రోకర్‌, ఇద్దరు జర్మన్‌ కొరియర్లను హత్య చేసి వారి దగ్గర ఉన్న ట్రాన్సిట్‌ పేపర్లను చేజిక్కించుకుంటాడు. ఈ పేపర్లతో జర్మన్ల ఆధీనంలో ఉన్న యూరప్‌ గుండా పోర్చుగల్‌ దేశం వరకు నిరభ్యంతరంగా వెళ్లవచ్చు. ఈ పేపర్లను ఉగార్గో ఎవరికో అమ్మాలనే ఉద్దేశంతో సంపాదిస్తాడు. కాని ఈ పేపర్లను ఎవరో దొంగలించారని జర్మన్‌ అధికారులకు తెలియడంతో వాళ్లు కసబ్లాంకా చేరుకుంటారు. ఉగార్తె ఆ కాగితాలను దాచిపెట్టమని రిక్‌ కు ఇస్తాడు. రిక్‌ వాటిని సామ్‌ పియానోలో దాచి పెడతాడు.
లూయీ ఉగార్తెను జర్మన్‌ కొరియర్లను హత్య చేసినందుకు అరెస్టు చేస్తాడు. ఆ కాగితాలు ఎవరికిచ్చాడో చెప్పకుండానే పోలీస్‌ కస్టడీలో ఉగార్తె మరణిస్తాడు. ఆ బార్‌కు ఓ రాత్రి కొత్తగా ఓ జంట వస్తారు. విక్టర్‌ లాజ్లో చెకోస్లోవాక్‌ ప్రతిఘటనకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి. జర్మన్ల నుండి తప్పించుకుని తన భార్యతో సహా ఎన్నో దేశాల నడుమ ప్రయాణిస్తూ కసబ్లాంకా చేరుకుంటాడు. ఉగార్తె నుండి ఆ ట్రాన్సిట్‌ పేపర్లను కొనుక్కునే ప్రయత్నంలో ఉన్నది అతనే. కాని అతను చనిపోవడంతో విక్టర్‌ దంపతుల దార్లు మూసుకుపోతాయి.
ఇల్సా విక్టర్‌ భార్యగా ఇక్కడ పరిచయం అవుతుంది. ఆ బార్‌లోకి రాగానే ఆమె పియానో వాయిస్తున్న సామ్‌ను గుర్తు పడుతుంది. తనకు చాలా ఇష్టం అయిన ”ఆస్‌ టైం గోస్‌ బై” అనే పాట పాడమని సామ్‌ను అడుగుతుంది. సామ్‌ కూడా ఇల్సాను గుర్తుపడతాడు. ఆ పాట పాడనని అంటాడు. కాని ఆమె బలవంతం చేయడంతో తప్పక ఆ పాట పాడతాడు. లోపల ఎక్కడో ఉన్న రిక్‌ ఆ పాట విని కోపంగా సామ్‌ దగ్గరకు వచ్చి, తాను ఎప్పుడూ పాడవద్దన్న ఆ పాట అతనెందుకు పాడుతున్నాడని గట్టిగా అడుగుతాడు. సామ్‌ దగ్గర కూర్చున్న ఇల్సాను చూసి ఆశ్చర్యపోతాడు.
విక్టర్‌ ఎంత గొప్ప నాయకుడో రిక్‌ విని ఉన్నాడు. తన ప్రేయసి ఇల్సాని అతనితో చూసి రిక్‌కు తన గతం గుర్తుకు వస్తుంది. పారిస్‌లో ఆమెతో స్నేహం, ఆమెతో కలిసి గడిపిన సమయం అతనికి గుర్తుకొచ్చి బాధపెడుతుంది. స్నేహం చేస్తున్నపుడు తమ గతం ప్రస్తావించుకోవద్దని వారిద్దరూ అనుకుంటారు. కాని ఆ సమయంలోనే తన జీవితంలో మరో వ్యక్తి కొనాళ్లు ఉన్నాడని ఇల్సా చెబుతుంది. ప్రేమలో మునిగి ఉన్న ఆ ఇద్దరూ జర్మన్లు పారిస్‌ను ఆక్రమిస్తున్నారని తెలిసి అక్కడి నుండి సురక్షితమైన చోటుకు పారిపోదామని నిశ్చయించుకుంటారు. ట్రైన్‌ దగ్గరకు తాను వస్తానని అంటుంది ఇల్సా. కాని ఆమె అక్కడకు రాకపోగా తాను రిక్‌తో కలిసి ఉండలేనని, తనను మర్చిపొమ్మని సామ్‌తో ఓ ఉత్తరం ఇచ్చి పంపిస్తుంది. ఆఖరి సమయంలో, విరిగిన మనసుతో, కారుతున్న కన్నీళ్ళతో ఆ ట్రైన్‌ ఎక్కి చివరకు కసబ్లాంకా చేరతాడు రిక్‌.
ఇల్సా రిక్‌ను ఒంటరిగా కలిసి తన గతం చెప్పబోతుంది. కాని అతని కళ్లల్లో తన పట్ల అసహ్యం చూసి తిరిగి వెళ్లిపోతుంది. విక్టర్‌ ట్రాన్సిట్‌ పేపర్ల కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఓ వ్యాపారి తాను ఒక్కరిని మాత్రమే ఆ నగరం దాటించగలనని చెబుతాడు. అందుకని విక్టర్‌ ఇల్సాను అక్కడి నుండి పంపుదాం అనుకుంటాడు. ఇల్సా విక్టర్ని వదిలి తాను ఒక్కత్తే వెళ్లనని అంటుంది. ఎన్నో దేశాల గుండా ప్రయాణిస్తూ ఏ సమయంలోనూ తనను వదలిపెట్టని విక్టర్‌ను తాను ఇప్పుడు ఒంటరిని చేసి తప్పించుకుపోలేనని బదులిస్తుంది. అప్పుడు ఆ వ్యాపారి రిక్‌ దగ్గర ట్రాన్సిట్‌ పేపర్లు ఉండవచ్చని ప్రయత్నించమని విక్టర్‌ కు చెబుతాడు.
విక్టర్‌ రిక్‌ దగ్గరకు వచ్చి ఆ పేపర్లు ఇచ్చి తాము ఆ నగరం వదిలి వెళ్లడానికి సహాయం చేయమని అడుగుతాడు. దానికి చాలా డబ్బు ఇస్తాననీ చెబుతాడు. కాని రిక్‌ తాను విక్టర్‌కు సహాయం చేయనంటాడు. కారణం అడిగిన విక్టర్‌తో అతని భార్యను అడిగి తెలుసుకొమ్మని ఉక్రోషంగా బదులిస్తాడు. విక్టర్‌కు విషయం అర్ధం అవుతుంది. పారిస్‌లో ఇల్సాతో రిక్‌కి పరిచయం ఏర్పడి ఉంటుందని అతను గ్రహిస్తాడు. ఇల్సాతో ఈ విషయం చెబుతూ తాను ఆమె జీవితంలో లేని సమయంలో ఆమె ఒంటరితనాన్ని తాను అర్ధం చేసుకోగలనని, దాని వల్ల ఆమెపై తన ప్రేమ తగ్గదని బదులిస్తాడు.
రాత్రి విక్టర్‌ ఓ రహస్య మీటింగ్‌కు వెళ్ళిన తరువాత ఇల్సా రిక్‌ ఇంటికి వెళ్ళి అతన్ని కలుసుకుంటుంది. విక్టర్‌ తన చిన్ననాటి ప్రేమ అని, అతని ఆదర్శాలపై గౌరవంతో తాను అతన్ని రిక్‌ పరిచయం అవక ముందే వివాహం చేసుకున్నానని చెబుతుంది. అతన్ని జర్మన్లు కాన్సన్ట్రేషన్‌ కాంప్‌లో బంధించారని, తరువాత అతని మరణ వార్త తనకు చేరిందని చెబుతుంది. అ సమయంలో తాను రిక్‌తో స్నేహం చేశానని, కాని అప్పుడు అతన్ని నిజంగానే మనస్పూర్తిగా ప్రేమించానని చెబుతుంది. రిక్‌తో పారిపోదాం అనుకున్న రోజే విక్టర్‌ బతికే ఉన్నడని, ఆరోగ్యం పాడయి రహస్యంగా జీవిస్తున్నాడని ఆమెకు తెలుస్తుంది. విక్టర్‌ పట్ల తన కర్త్యవ్యం గుర్తుకు వచ్చి ఆమె రిక్‌తో వెళ్లకుండా తిరిగి విక్టర్‌ను చేరుతుంది. ఇదంతా చెప్పి, విక్టర్‌ ఆ ఊరు దాటడం అవసరమని, ఆ ట్రాన్సిట్‌ కాగితాలు తనకు ఇమ్మని రిక్‌ని అడుగుతుంది ఇల్సా. రిక్‌ ఇవ్వనంటే అతన్ని తుపాకితో చంపుతానని బెదిరిస్తుంది కాని ఆ పని చేయలేకపోతుంది. తాను రిక్‌ను మర్చిపోలేకపోతున్నానని, అతనితోనే కలిసి ఉంటానని ఒప్పుకుంటుంది. అతనిపై తనకు ఇంకా ప్రేమ ఉందని ఈ ద్వంద్వంతో తాను జీవించలేనని అతనితో అక్కడే ఉండిపోవడానికి అంగీకరిస్తుంది. తానేమీ నిర్ణయించుకోలేకపోతున్నానని, తమ భవిష్యత్తు రిక్‌కే అప్పగిస్తానని, అతన్నే నిర్ణయించమని అడుగుతుంది.
రహస్య మీటంగ్‌లో గాయపడి విక్టర్‌ రిక్‌ బార్‌ కే చేరతాడు. అతన్ని పై నుంచి చూసిన రిక్‌ తన పనివాడితో ఇల్సాను ఆమె ఉంటున్న హోటల్‌కు పంపిస్తాడు. తాను విక్టర్‌ను పోలీసులకు పట్టిస్తానని లూయికి చెప్పి ట్రాన్సిట్‌ పేపర్లను విక్టర్‌కు ఇస్తున్నప్పుడు లూయి అతన్ని అరెస్ట్‌ చేయవచ్చని, తాను ఇల్సాతో ఆ ఊరి వదిలి పారిపోతానని చెబుతాడు. లూయీ అతని మాటలు నమ్ముతాడు. కాని రిక్‌ లూయిని ఏమార్చి విమానాశ్రయానికి విక్టర్‌, ఇల్సాలను రప్పించి వారిద్దరిని కలిసి ప్లేన్‌ ఎక్కమని చెబుతాడు. ఇల్సా ఆశ్చర్యపోతుంది. తాను రిక్‌తో అక్కడే ఉంటానని అంటుంది. కాని రిక్‌ ఆమెతో అది తప్పని, ఆమె చిన్నప్పటి నుండి కొన్ని ఆదర్శాలతో బతికిందని, దాని కోసమే విక్టర్‌ని ఆమె ఎన్నుకుందని గుర్తు చేస్తాడు. ఇప్పుడు రిక్‌పై తనకున్న ప్రేమ ఆమెను విక్టర్‌తో వెళ్ళకుండా ఆపినా ఏదో ఒక నాడు దానికి ఆమె బాధపడే రోజు వస్తుందని, అది తనకిష్టం లేదని చెబుతాడు. పస్తుత వాతావరణంలో తమ వ్యక్తిగత ప్రేమల కన్న మించిన ఆదర్శాలతో జీవించడమే తమ కర్తవ్యమని, అది విక్టర్‌తో ఆమె కలిసి ఉండడంతోనే సాధ్యపడుతుందని చెబుతాడు. ఇల్సా విక్టర్‌ తో విమానం ఎక్కుతుంది. వారిని ఆపడానికి వచ్చిన జర్మన్‌ జనరల్‌ను రిక్‌ కాల్చేస్తాడు. అతని శవాన్ని అక్కడి నుండి తొలగించి లూయి రిక్‌ ను కాపాడతాడు. తమ మధ్య ఓ గొప్ప స్నేహం మొదలయిందని రిక్‌ లూయీతో అంటుండగా సినిమా ముగుస్తుంది.
ఇందులో పాత్రల చిత్రణ వారి వ్యక్తిత్వాలను చూపించిన పద్ధతి చాలా బావుంటుంది. అదే ఈ సినిమాకు బలం. రిక్‌ పాత్రనే తీసుకుంటే అతను పైకి ఏది పట్టని వ్యాపారస్తుడిలా కనిపిస్తాడు. కాని తనకు తోచినట్లుగా శరణార్దులకు సహాయం చేసే సంఘటనలు కూడా గమనిస్తాం. తెల్లజాతీయుడైన రిక్‌ నల్లజాతీయుడైన సామ్‌ను అంతరంగ మిత్రుడిగా స్వీకరిస్తాడు. పారిస్‌ నుండి పారిపోతూ సామ్‌ ను తనతో పాటు తీసుకొస్తాడు. లూయీ ఓ నవవధువు శరీరాన్ని కోరుతూ దానికి ప్రతిఫలంగా ఆ జంట దేశం దాటడానికి వారికి ట్రాన్సిట్‌ పేపర్లు ఇస్తాననే వంకతో ఆ అమ్మాయిని లొంగ దీసుకుంటున్నాడని రిక్‌కు తెలుస్తుంది. ఆమె భర్త తన జూద గృహంలో ఉన్నాడని, ఆ పేపర్లు కొనడానికి కావలసిన డబ్బు కోసం జూదం ఆడుతున్నాడని తెలిసి అతనికి ఆ ఆటలో సహాయం చేసి డబ్బు గెలుచుకునేలా చెస్తాడు. ఆ డబ్బుతో వాళ్ళు ఆ పేపర్లు సంపాదించుకుంటారు. అతని బార్‌లో జర్మన్లు తమ జాతీయ గీతం పాడుతుంటే, అక్కడే ఉన్న విక్టర్‌ ఫ్రెంచ్‌ గీతాన్ని వాయించమని సంగీతకారులను అడిగితే, రిక్‌ మౌనంగా దానికి ఆమోదం తెలుపుతాడు. ఆ బార్లో అందరూ కలిసి ఫ్రాన్స్‌ గీతం కన్నీళ్ళతో పాడుతున్నప్పుడు వారి దేశభక్తిని ఆస్వాదిస్తాడు. దానికి ఫలితంగా లూయీ జర్మన్‌ జనరల్‌ ఆజ్ఞతో రిక్‌ బార్‌ను కొన్ని వారాలకు మూసి వేస్తాడు. ఆ సమయంలో కూడా తన దగ్గర పని చేసేవారందరికీ జీతాలను ఇస్తానని, వారు భయపడవలసిన అవసరం లేదని ప్రకటిస్తాడు రిక్‌.
ఎల్సా ను ముందు తన బార్‌ లో చూసి ఆమె డబ్బు కోసం తనను వదిలి మరొకనితో చేరిందని ఆమెను అనుమానిస్తాడు. కాని ఆమె పట్ల ప్రేమను తగ్గించుకోలేకపోతాడు. ఆమె గతం తెలిసిన తరువాత ఆమె విక్టర్‌ గురించి తనకు చెప్పకపోవడంలో మోసం కాదు రాజకీయ కారణాలు ఉన్నాయని అర్ధమయ్యాక ఎల్సాను గౌరవిస్తాడు. ఆమె తనను నిజంగానే ప్రేమించిందని తెలిసి ఆమె తనతో ఉండిపోవడానికి సిద్దపడినప్పుడు ఈ నిర్ణయం ఏదో ఓ రోజు ఆమెను పశ్చాత్తాపంలోకి నెట్టేస్తుందని, ఆమె ఆదర్శాలకు విక్టర్‌ దగ్గర ఉండడమే ఆమె మనస్సుకు మంచిదని అర్దం అయి తన ప్రేమను త్యాగం చేస్తాడు. అతని ప్రేమ లూయీ లాంటి స్వార్ధపరుడిలో సైతం మార్పు తెస్తుంది. ప్రస్తుతం తమ ఇద్దరి ప్రేమ కన్నా ఆశయ సాధన ముఖ్యమని నమ్మి విక్టర్‌ పట్ల తన గౌరవాన్ని ప్రకటిస్తాడు. విక్టర్‌ ఇల్సాను ఒక్కత్తిని ఆ దేశం దాటించి సురక్షితమైన చోటకు చేర్చాలని ప్రయత్నించడం వెనుక ఉన్న అతని నిస్వార్ధ ప్రేమను గుర్తిస్తాడు. పైగా విక్టర్‌కు తమ గతం తెలిసినా అర్ధం చేసుకున్న విధానానికి, ఇల్సాపై అతనికున్న నమ్మకానికి రిక్‌ తలవంచుతాడు. విక్టర్‌లోని గొప్ప మానవీయ కోణం అర్దమయ్యాక ఇల్సా అతని వద్దే సురక్షితంగా ఉంటుందని నమ్ముతాడు.
విక్టర్‌ ఓ ఆశయం కోసం జర్మన్లకు విరుద్దంగా యుద్ధం చేస్తున్న యోధుడు. ఇల్సా పట్ల అతని ప్రేమలో నిజాయితీ ఉంది. ఆమె కోసం అతను ఎన్నిసార్లో ప్రమాదాలతో యుద్ధం చేస్తాడు. తన కన్నా ఆమె సురక్షితంగా ఉండడం ముఖ్యం అని నమ్ముతాడు. రిక్‌ ఇల్సాల మధ్య ఓ ప్రేమ కథ ఉందని తెలిసినా అతను దాన్ని పట్టించుకుని అహం చూపడు. ఇల్సా తనను వదిలేస్తుందేమో అని భయపడడు. ఆమెపై అధికారంతో ప్రవర్తించడు. ఆమె క్షేమం కోసం మాత్రమే ఆలోచిస్తాడు. రిక్‌ పై కోపం పెంచుకోడు. ఇల్సా గతంతో తనకు పని లేదని, ఆమె ఎటువంటి స్థితిలో తోడు కోరుకుందో తాను అర్ధం చేసుకోగలనని చెప్పి ఇల్సా తన దగ్గర తల దించుకునే పరిస్థితి రాకుండా ప్రవర్తిస్తాడు. జర్మన్లు రిక్‌ బార్‌ లో తమ జాతీయ గీతాలాపనతో అహం ప్రదర్శిస్తే అప్పటికప్పుడు అక్కడ ఫ్రెంచ్‌ వారందరినీ ఒకటి చేసి తన నాయకత్య లక్షణాలను ప్రదర్శిస్తాడు. రిక్‌తో తాను మాట్లాడుతున్నప్పుడు పైన అతని ఇంట్లో ఇల్సా ఉందని రిక్‌ చెప్పినప్పుడు కూడా ఆమెపై అనుమాన పడడు. ఆమె తనతో రావాలని బలవంత పెట్టడు. ఆమెను రిక్‌తో వదిలి తాను ప్లేన్‌ వెళ్లి ఎక్కేస్తాడు. రిక్‌తో మాట్లాడిన తరువాత ఇల్సా అతన్ని చేరుకుంటుంది. ఆమెపై తనకున్న కోపాన్ని ప్రేమగా మార్చుకుని ప్రశాంతంగా రిక్‌ వెనుతిరిగి వెళ్లడానికి విక్టర్‌ వ్యక్తిత్వం ప్రధాన కారణం.
ఇల్సా ఇద్దరు పురుషుల మధ్య ప్రేమతో నలిగిపోయిన స్త్రీ. ఆమె ఇద్దరినీ ప్రేమిస్తుంది. వారి కోసం తపన పడుతుంది. తాను ఎవరితో ఉండాలో అర్ధం కాక నలిగిపోతుంది. విక్టర్‌కు తన అవసరం ఉందని తెలిసి రిక్‌ని వదిలి వెళ్లిపోతుంది. అది అతనికి ముందే చెబితే అతను నగరం దాటడని, జర్మన్ల చేతికి చిక్కుతాడని భయపడి అతనికి తన నిర్ణయం చెప్పకుండా అతని మనసులో మోసగత్తెలా మిగిలిపోతుంది. అతను ఆ రాత్రి ఆ నగరం వదలాలంటె తాను వెంట రావట్లేదన్న విషయం అతనికి తెలియకూడదని జాగ్రత్తపడుతుంది. కసబ్లాంకాలో అతని ఒంటరి జీవితం చూసాక అతని కోసం అక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకుంటుంది. ఒంటరిగా ఆ నగరాన్ని దాటి వెళ్లే అవకాశం వచ్చినా విక్టర్‌ను ఒంటరిగా వదలడానికి ఆమె సిద్దపడదు. తన స్వార్ధాన్ని చూసుసునే వ్యక్తిత్వం ఆమెది కాదు. అందుకే ఆ ఇద్దరు ప్రేమికుల మధ్య ఆమె నలిగిపోతుంది. చివరకు రిక్‌ ఆలోచనకు తలవంచుతుంది. ప్రేమ కన్నా ఆదర్శాల పట్ల తన కర్త్యవ్యం నిర్వర్తించాలని నిశ్చయించుకుంటుంది. ఆ ఆదర్శాలతో నిండిన విక్టర్‌ సాహచర్యంలోనే తాను ప్రశాంతంగా జీవించగలదని రిక్‌ చెప్పినప్పుడు అతని నిర్ణయాన్ని ఒప్పుకుంటుంది.
సామ్‌ రిక్‌ కు మంచి మిత్రుడు. ఇల్సాతో రిక్‌ గతం తెల్సిన వాడు. అనునిత్యం రిక్‌ను కనిపెట్టుకుని ఉండే మంచి వ్యక్తి. ఆ బార్‌లో పని చేసే పనివాళ్ల నుండి అందరూ విపరీత పరిస్థితులలో అసమాన్యమైన ప్రేమను, మానవత్వాన్ని ప్రదర్శించి ఆశ్చర్యపరుస్తారు. జూద గహంలో పనిచేసే వాళ్లలో ప్రజల పట్ల ప్రేమ, డబ్బు పట్ల నిర్లక్ష్యం, డబ్బు కన్నా మానవత్వం ముఖ్యమనే వాళ్ళలోని నమ్మకం ఈ సినిమాను ప్రేక్షకుల మనసుకు దగ్గర చేస్తుంది. చివరకు కథ మొత్తం తెలిసిన లూయి రిక్‌ చేతిలో హత్యకు గురయిన జర్మన్‌ జనరల్‌ గురించి బైటకు చెప్పకుండా రిక్‌ను రక్షించడం, అతని అంతరంగ మిత్రుడిగా మారడం మనలను కదిలిస్తుంది. స్వార్ధాన్ని మంచితనంతో రూపు మాపవచ్చనే ఆలోచనతో ఈ సినిమా ముగుస్తుంది.
సినిమాలో సాం పాడే ”ఆస్‌ టైం గోస్‌ బై” పాటకు ఈ చిత్రంతో విశేష ఆదరణ లభించింది. రిక్‌ ఇల్సాను కిడ్‌ అని సంబోధిస్తూ మాట్లాడే డైలాగ్‌ సినీ ప్రేమికులందరికీ గుర్తుండి పోతుంది. ఈ సినిమాలో ముగ్గురు నటులు తప్ప మిగతా ఎవరూ అమెరికన్లు కాదన్నది మరో విశేషం. పైగా వీరిలో ఎక్కువ శాతం శరణార్దులు. రిక్‌ పాత్రలో హంఫ్రె బొగార్ట్‌, ఇస్లా పాత్రలో ఇంగ్రిడ్‌ బర్గ్మెన్‌, విక్టర్‌ పాత్రలో పాల్‌ హెన్రిడ్‌ అత్యుత్తమ నటనను ప్రదర్శించారు.
కసబ్లాంకా చిత్రానికి ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ లభించింది. సినిమా దర్శకత్వానికి మైఖెల్‌ కర్తిజ్‌, స్క్రీన్‌ ప్లే కు జూలియస్‌ ఎప్స్టిన్‌, ఫిలిప్‌ ఎప్స్టిన్‌, హవార్డ్‌ కోచ్‌ లు అకాడమీ అవార్డు అందుకున్నారు. పటిష్టమైన స్క్రీన్‌ ప్లే సినిమాకు ఎంత అవసరమో, కథనానికి ఎంత బలమో తెలియాలంటే ఈ సినిమా తప్పకుండా చూడాలి. ఈ సినిమా ప్రేక్షకులను ఇంతగా అలరిస్తుందని అప్పట్లో ఎవరూ అనుకోకపోయినా నేటికీ ఆస్కార్‌ చిత్రాల లిస్ట్‌లో ప్రేక్షకులు ఇష్టపడి మరీ మరీ చూడాలనుకునే మంచి చిత్రం ‘కాసబ్లాంకా’.

– పి.జ్యోతి,
98853 84740