‘చిత్ర’ విషాదాలు

'Chitra' tragediesమనిషికి అత్యవసరాలు తిండి, బట్ట, గూడుతో పాటు అనేకమైన వాటిని నాగరిక మానవుడు సమకూర్చు కున్నాడు. విద్య, వైద్యము, వినోదమూ సామాజిక జీవనంలో అవసరాలుగానే ఉన్నాయి. ఆదిమ మానవుని నుండీ వినోదం, కళ అభివృద్ధి చెంది ఒక సాంస్కృతిక సమూహాన్ని తయారుచేసింది. అందులో భాగంగా శాస్త్ర, సాంకేతిక పెరిగిన కళగా సినిమా మనముందున్నది. సినిమా ఇప్పుడు ఒక పరిశ్రమ. అంటే ఉత్పత్తి కేంద్రం. లాభాలు దాని లక్ష్యం. లాభాలే ఏకైక లక్ష్యమైన వ్యాపారంలో నైతికతను, సజీవకళను వెతుక్కోవడం వృథాప్రయాసే. ఈ మార్కెటు మాయా వ్యూహాల్లో కళ అనే ఎరకు చిక్కిన చేపపిల్లల్లా మారుతున్న సామాన్య ప్రజలు. ప్రజలు, నిత్యజీవన వెతల మోహరింపులో సమస్యల దిగ్బంధనంలో కొన్ని గంటలైనా వెసులుబాటును, వినోదాన్ని వెతుక్కునే స్థలం సినిమా. అలాంటి చిత్ర ప్రదర్శనలు సామూహిక వెర్రినీ ప్రేరేపిస్తున్నాయి. దోపిడీకి ద్వారాలు తెరుస్తున్నాయి. అంతేకాదు, పెంచుతున్న భ్రమల వ్యామోహంలో పడి సామాన్యులు ప్రాణాలనూ బలిపెట్టుకుంటున్నారు.
ఇప్పుడు సినిమా అంటే కథకాదు. కళకాదు. సంగీత సాహిత్యాలు కానేకాదు. నేరాలు, ఘోరాలు, వైపరీత్యాలు, విధ్వంసాలు, బూతులు, వికృతచేష్టలు, అంగ విన్యాసాలు, జుగుప్స కలిగించే కదలికలు మొత్తంగా ప్రేక్షకుల్లో అనాగరికున్నీ, క్రూరత్వాన్ని పాదుగొలిపే విచిత్రకళ. అరాచక వ్యాపారం. ఈ వ్యాపారాన్ని ప్రచారం చేయటం కోసం కోట్ల రూపాయలు వెచ్చించడం. సినిమా మొత్తం హీరో చుట్టూ తిప్పడం. హీరోలపై విపరీత మోజును పెంచడం. హైప్‌ను సృష్టించడం, కోట్లాది రూపాయల్ని కొల్లగొట్టడం ఇదీ చిత్రసీమగా మారిపోయింది. అన్ని వందల కోట్లు పెట్టుబడి ఎందుకు పెడుతున్నారు! భారీ బడ్జెట్‌ సినిమా అనీ, హాలీవుడ్‌ స్థాయిలో నిర్మించిన మూవీ అని, ఇది మన సమాజానికే గర్వకారణమైనట్టు ప్రచారం చేయటం, ఫ్యాన్స్‌ పేరుతో పూనకాలు తెప్పించడం వెనకాల కేవలం లాభాలను సొమ్ము చేసుకోవడమే దాగుందనేది మన అభిమాన జనసందోహానికి ఎలా అర్థం కావాలి. వాళ్లు చేసే ఈ వ్యాపారానికి మన ప్రభుత్వాలూ మద్దతుగా నిలవటం, ప్రజలవైపు నుండి ఆలోచించక పోవటం ఒక విషాదం. భారీ బడ్జెటుతో సినిమా తీశారు కనక బెనిఫిట్‌ షోల పేరుతో టికెట్ల ధరలు విపరీతంగా పెంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జీవోలే జారీ చేయడం చూస్తే చిత్ర విచిత్రంగా తోస్తుంది. ఒకేసారి రూ.800లు టికెటుపై పెంచుతారా! ప్రేక్షకులను దోపిడీ చేయడానికి ప్రభుత్వాలు ఎందుకు అనుమతినిచ్చాయి? అదేమయిన సమాజ శ్రేయస్సును, చైతన్యాన్ని, నీతిని బోధించే సినిమానా? ఎర్రచందనం దొంగ రవాణా చేసేవాళ్లను హీరోలుగా మార్చే పాయింట్‌ను తీసుకుని, ఇంకా బీభత్స కుళ్లురసాన్ని నింపిన సినిమాకు సమాజంలోని పిల్లలు, యువత,ప్రజలు బలికావాలా?
పుష్ప-2 సినిమా ప్రీమియర్‌ షో హైద్రాబాద్‌లో ఒక అభిమాని ప్రాణాన్ని బలితీసుకున్నది. సినిమా ప్రమో షన్‌లో భాగంగా హీరో అల్లుఅర్జున్‌ థియెటర్‌కు రావడం, జనం వెర్రిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీ తేజ్‌ పరిస్థితి కూడా విషమంగా ఉందని చెబుతున్నారు. ఏమీటీ దారుణం! పిల్లలూ పెద్దలు అనే తేడాలేకుండా, మొదటిరోజే సినిమా చూడాలనే పిచ్చి కోరికతో ప్రమాదంలో పడి పోవటాన్ని ప్రజలు గమనించి మేలుకోవాలి. అంతమంది జనం, అభిమానులు, సమీకరించబడుతున్నారనీ పోలీసు లకు తెలియదా! ఏ చిన్న న్యాయమైన కోర్కెను తెలపాలని గుమిగూడినా, విద్యార్థులను, యువకులను చెదరగొట్టి ప్రతాపం చూపే పోలీసులు వీటి జోలికి రాకపోవడం ఏమిటి! సంఘటన జరిగిన తర్వాత మృతికి కారకులపై చర్యలు తీసుకుంటామని ప్రకటన చేస్తున్నారు. బెనిఫిట్‌ షోలకు అనుమతులు ఇవ్వబోమని మంత్రులు చెబుతున్నారు. వందల కోట్ల వేటలో జరిగిన ప్రాణనష్టానికి పాతిక లక్షల పరిహారాన్ని చెల్లించి చేతులు దులుపుకుంటే సరిపోతుందా! ప్రేక్షకులు కూడా భ్రమల్లోంచి బయటపడాలి. నిజ జీవితానికి సినిమాలకు మధ్య దూరం బాగా పెరిగింది. హీరోలూ నిజమైన హీరోలు కాదనీ గుర్తెరగాలి.
ప్రయోజనాత్మక సినిమాలు తీయటంలో మన తెలుగు సినిమా వెనుకబడే ఉంది. మలయాళ, తమిళ సినిమాలను చూసైనా నేర్చుకోవాలి. చెత్త, కుళ్లు, అభూత కల్పనలు, తిరోగమన భావాల ప్రచారంతో తీసే సిని మాలు, వాటికి భారీ బడ్జెట్లు, ప్రచారార్భాటాలతో నానా హంగామాలు చేయడం తెలుగు చిత్రసీమకే చెల్లింది. ఇలాంటి వాటినుండి మన పిల్లలను, ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్యాలను, ఆలోచనలను చెడగొడుతున్నది పర్యావరణ కాలుష్యంతో పాటు, సాంస్కృతిక కాలుష్యమూ తోడవుతున్నదన్న వాస్తవాన్ని గమనించి అప్రమత్తమవ్వాలి.