ఆద్యంతం ఫ్రెష్‌లుక్‌తో ఉండే సినిమా

ఆద్యంతం ఫ్రెష్‌లుక్‌తో ఉండే సినిమాసూర్య తేజ హీరోగా పరిచయం అవుతూ నటిస్తున్న చిత్రం ‘భరతనాట్యం’. ‘దొరసాని’ ఫేమ్‌ కెవిఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్‌ ఫిలింస్‌ పతాకంపై పాయల్‌ సరాఫ్‌ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. వేసవి కానుకగా ఈనెల 5న విడుదలకు కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు కెవిఆర్‌ మహేంద్ర మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
‘నేను చేసిన ‘దొరసాని’ ఆర్గానిక్‌ పీరియాడిక్‌ పొయిటిక్‌ లవ్‌ స్టొరీ. ఖచ్చితంగా కొన్నింటికి కట్టుబడే ఆ సినిమా చేయాలి. ఈ సినిమాకి ఆ బౌండరీలు లేవు. ప్రేక్షకుడికి వినోదం పంచడానికి ఏ అంశాలు కావాలో అలాంటి అన్ని ఎలిమెంట్స్‌ ఇందులో కుదిరాయి.
ఇది ఒక హీరో, హీరోయిన్‌ కథలా ఉండదు. వైవా హర్ష, హర్ష వర్ధన్‌, అజరు ఘోష్‌, టెంపర్‌ వంశీ వీళ్ళంతా గత చిత్రాలకు భిన్నమైన పాత్రలు చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత నటీనటుల కోసం కొత్త తరహా పాత్రల్ని రాస్తారు. వైవా హర్ష చెలరేగిపోయాడు. అజరు ఘోష్‌ సినిమా స్కేల్‌ని పెంచారు.
సలీం ఫేక్‌ లాంటి పాత్రని ఊహించలేం. కొత్తరకం పాత్రలతో సినిమాకి ఒక ఫ్రెష్‌ లుక్‌ వచ్చింది. సినిమా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. కొత్త హీరో, హీరోయిన్‌తో చేసినట్లు ఎక్కడా అనిపించదు. చాలా పెద్ద డ్రామా ఉంటుంది. మంచి కాన్ఫ్లిక్ట్‌ వుంటుంది.
పాత్రలకు ఎదురైన పరిస్థితులు ప్రేక్షకులని నవ్విస్తాయి. డార్క్‌ కామెడీ హిలేరియస్‌గా ఉంది. అన్ని పాత్రలు ఉన్నప్పటికీ వాటి లక్ష్యం ఒకటే వుంటుంది. చక్రంలో ఇరుసు చుట్టూ తిరిగినట్లు ఆ లక్ష్యం చుట్టూనే తిరుగుతాయి.
కథలు చెబుతూ దర్శకుడు కావాలని కలలు గంటూ ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఓ సహాయ దర్శకుడు.. ఒక విచిత్రమైన పరిస్థితిలో పడి అది క్రైమ్‌ వరల్డ్‌కి దారితీసి ఆ డేంజర్‌ మూమెంట్‌ నుంచి ఎలా బయటపడ్డాడనేది లైన్‌. హీరో సూర్య తేజ అద్భుతంగా నటించాడు.
‘భరతనాట్యం’లాంటి ఎలిమెంట్‌తో ఇప్పటివరకూ సినిమా రాలేదు. ఇలాంటి ఎలిమెంట్‌తో ఇదివరకూ కథ రాలేదు. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది.