– ఎన్నికల బాండ్ల వివరాలు అందించిన ఎస్‌బీఐ
– ధ్రువీకరించిన ఈసీ
– బీజేపీకి చేరిన వాస్తవ వివరాలు బహిర్గతమవుతాయా..!
న్యూఢిల్లీ : 2019 నుంచి తన వద్ద కొనుగోలు చేసిన, నగదుగా మార్చుకున్న ఎన్నికల బాండ్ల సమాచారాన్ని ఎస్‌బీఐ మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. ఎస్‌బీఐ నుంచి సమాచారం అందిందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఎన్నికల కమిషన్ ధ్రువీకరించింది. ఎన్నికల బాండ్ల వివరాలు అందించేందుకు జూన్ 30వ తేదీ వరకూ గడువు ఇవ్వాలంటూ ఎస్‌బీఐ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఆ సమాచారాన్ని మంగళవారం సాయంత్రానికి ఎన్నికల కమిషన్‌కు అందజేయాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది. ఎస్‌బీఐ నుంచి అందిన వివరాలను ఈ నెల 15వ తేదీన వెబ్‌సైట్‌లో ప్రజలకు బహిర్గతం చేయాలని ఎన్నికల కమిషన్‌కు కూడా ఆదేశాలు జారీ చేసింది. కాగా తమకు అందిన సమాచారం ‘ముడి’ ఫార్మట్‌లో ఉన్నదని, దానిని గడువు లోగా అప్‌లోడ్ చేయడం సవాలుతో కూడుకున్న పనేనని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని గత నెల 15వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను ఈ నెల 6వ తేదీ లోగా ఈసీకి అందజేయాలని ఎస్‌బీఐని ఆదేశించింది.