– బేడీలు కూడా వేయని బెంగాల్ పోలీసులు
– 10 రోజుల కస్టడీ విధించిన కోర్టు
– గ్రామస్తుల సంబరాలు
కోల్‌కతా : అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో సందేశ్‌ఖలి కేసులో ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ నాయుకుడు షేక్ షాజహాన్‌ను బెంగాల్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో మినాఖాహ బ్లాక్‌లో గురవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న పోలీసులు బసిర్‌హత్ కోర్టులో హాజరుపరచగా, ది రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించింది. సందేశ్‌ఖలీలో హింసకు కారకుడైన ఈ ఘరానా నాయకుణ్ణి ఇన్ని రోజులు కాపాడుకొచ్చిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కంటి తుడుపు చర్యగా పార్టీ నుంచి ఆరేండ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సస్పెన్షన్‌ను చాలా మంది ఇప్పటికే ఎగతాళి చేయనారంభించారు. ఈ కేసును ప్రభుత్వం తన కనుసన్నల్లోని సీఐడీ దర్యాప్తునకు అప్పగించింది. సందేశ్‌ఖలి మహిళలపై లైంగికదాడి, దహనం, దోపిడీ, హత్యలు, భూములను అక్రమించుకోవడం వంటి తీవ్ర అభియోగాలతో 10కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ షాజహాన్ జోలికి పోవడానికి పోలీసులు సంకోచించారు. కారణం అతనికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దన్నుగా నిలవడమే. ప్రజా ఉద్యమాల నుంచి ఒత్తిడి, కోర్టు చీవాట్లు వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం అతడిని అరెస్టు చేయక తప్పలేదు. ఇందుకు 2 నెలల సమయం పట్టింది. గురువారం కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో పోలీసులు అతనికి ఎలాంటి సంకేళ్లు వేయలేదు. కనీసం పోలీసులు అతన్ని పట్టుకోనూ లేదు. దర్జాగా కోర్టు హల్లోకి షాజహన్ నడుచుకుంటూ వెళ్లాడు. షాజహాన్, కోబ్రా బృందంగా పిలవబడే సుమారు 70 మంది అతని మద్దతుదారులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తమ భూములు బలవంతంగా అక్రమించుకున్నారని సందేశ్‌ఖలిలో మహిళలు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. షాజహాన్‌పై నేరాభియోగాల తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. గురువారం మీడియా సమావేశంలో శాంతి భద్రతల ఏడీజీ సుప్రతిమ్ సర్కార్ మాట్లాడుతూ షాజహాన్‌పై ప్రస్తుతానికి కేవలం రెండు కేసులు మాత్రమే నమోదై ఉన్నాయని అన్నారు మిగిలిన కేసులన్నీ ‘ఫిర్యాదు దశ’లోనే ఉన్నాయని తెలిపారు.కాగా, షాజహాన్ అరెస్టు వార్తతో సందేశ్‌ఖలిలో గ్రామస్తులు సంబరాల్లో మునిగిపోయారు. మహిళలు వివిధ రంగులతో హోలీ అడగా, పురుషులు నృత్యాలు, చిన్నారులు బాణా సంచా కాల్చడం వంటి పనులతో తమ ఆనందం వ్యక్తం చేశారు. అయితే టీఎంసీ ప్రభుత్వం మాత్రం శాంతిభద్రతల పేరుతో సందేశ్‌ఖలి గ్రామంలో 144 సెక్షన్ విధించింది.