– ఖమ్మంకు రఘురామ్‌రెడ్డి, కరీంనగర్‌కు వెలిచాల రాజేందర్‌రావు, హైదరాబాద్‌కు వలిఉల్లా సమీర్
– ప్రచారంలో వెనుకపట్టు…
– కాంగ్రెస్‌కు నష్టమంటున్న విశ్లేషకులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
లోక్‌సభ ఎన్నికల వేడిరాజుకుని వారాలు గడిచిన తర్వాత…కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించింది. కరీంనగర్ లోక్‌సభ స్థానానికి వెలిచాల రాజేందర్‌రావు, ఖమ్మానికి రామసాయం రాఘురామ్‌రెడ్డి, హైదరాబాద్‌కు మహమ్మద్ వలిఉల్లా సమీర్ అభ్యర్థిత్వాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ప్రకటించారు. వీటితోపాటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్స్ నియోజవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును అధిష్టానం ఖరారు చేసింది. త్వరలో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది.
హస్తం పార్టీ ఆ మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినా ఎందుకు ఆలస్యం జరిగిందనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతున్నది. దీంతో ఎన్నికల ప్రచారం చేయడంలోనూ వెనుకపట్టు పట్టామనే ఆందోళన నేతల్లో వ్యక్తమవుతున్నది. అభ్యర్థులను ప్రకటించకుండానే ఆ పార్టీ ఆయా స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయించడం గమనార్హం. దీంతో కాంగ్రెస్‌లో ఇంత గందరగోళ పరిస్థితులు ఎందుకు వచ్చాయనే చర్చ ఆసక్తి రేకిత్తిస్తోంది. 17 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సిన కాంగ్రెస్…ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాలకు చివరిదాకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆయా నియోజకవర్గాల నేతలు డీలాపడ్డారు. మిగతా నియోజకవర్గాల్లో ప్రచార హోరు ప్రారంభించిన కాంగ్రెస్ ఆ మూడు నియోజకవర్గాల క్యాడర్‌కు మాత్రం నిరుత్సాహాన్నే మిగిలించింది. అభ్యర్థులను ప్రకటించకపోయినా….గురువారం నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఆయా నియోజకవర్గాల్లో కొంత మంది ఆశావాహులు నామినేషన్లు వేశారు. హైదరాబాద్ నగర అభ్యర్థి వల్లీ ఉల్లా ఖాన్ సమీర్‌కు ఎలాంటి ఢోకా లేకపోయినా మిగతా రెండు నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా కొనసాగింది. ఖమ్మం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో అభ్యర్థిని ఖరారు చేయడం రాష్ట్ర నాయకత్వానికి కత్తిమీద సాములా మారింది. మా వాళ్లకు కావాలంటే, మా వాళ్లకు కావాలని వారు పట్టు పట్టడమే ఇందుకు ప్రధాన కారణమైంది. ఖమ్మం సునాయాసంగా గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ముగ్గురు ఉద్దండులు తమ వారి కోసం పట్టుపట్టారు. దీంతో అధిష్టానం కూడా మీరే తేల్చుకుని రావాలని షరతు పెట్టింది. చిలికి చిలికి గాలి వానలా మారిన ఈ తెగని పంచాయతీ చివరకు కర్నాటక డిప్యూటీసీఎం డీకే శివకుమార్ వద్దకు చేరింది. అప్పటి నుంచి రాఘురామ్‌రెడ్డి పేరు ప్రాచుర్యంలోకి వచ్చినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఆయన నామినేషన్ కార్యక్రమం మాత్రం సాధాసీదానే జరిగింది. ఆ జిల్లాకు చెందిన మంత్రులు కార్యక్రమానికి హాజరు కాకపోవడం గమనార్హం. కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్థి విషయంలోనూ స్థానిక పరిస్థితుల రీత్య ఆలస్యమైనట్టు తెలుస్తోంది. చివరకు వెలిచాల రాజేందర్ (వెలమ సామాజిక తరగతి) వైపు పార్టీ మొగ్గు చూపింది. ఈ రెండు నియోజవర్గాల్లో సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైందనే ప్రచారం కూడా ఉన్నది. ఖమ్మంలో కమ్మ సామాజిక తరగతికి కరీంనగర్‌లో వెలమ సామాజిక తరగతి ఇవ్వడం ద్వారా ఆయా వర్గాలను ఆకట్టుకోవచ్చు అనేది వ్యూహంగా కనిపిస్తున్నది. కానీ ఖమ్మం మాటలే ఉన్నా కరీంనగర్‌లో కచ్చితంగా వెలమ సామాజికతరగతులకు ఇవ్వడం ద్వారా బీఆర్‌ఎస్, బీజేపీని దెబ్బకొట్టొచ్చని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా…ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంలో ఆలస్యంతోపాటు నిర్లక్ష్యం కూడా జరిగిందనే విమర్శలున్నాయి.