– రూ.3 లక్షలు అందజేసిన శాట్ చైర్మెన్ శివసేనారెడ్డి
హైదరాబాద్ : భారత వెటరన్ ఫుట్‌బాల్ ఆటగాడు, 1962 జకర్తా ఆసియా క్రీడల్లో భారత్‌కు బంగారు పతకం సాధించటంలో కీలక భూమిక వహించిన డిఎంకె అఫ్జల్‌కు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్) ఆర్థిక సహకారం అందించింది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అఫ్జల్ కొన్నాండ్లుగా మంచానికి పరిమితం అయ్యారు. అఫ్జల్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న శాట్ చైర్మన్ కే. శివసేనారెడ్డి రూ. 3 లక్షలను వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశారు. బుధవారం గోల్కొండలోని అఫ్జల్ నివాసానికి వెళ్లిన శివసేనారెడ్డి ఆర్థిక సహాయం అందజేసి భరోసా కల్పించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన తెలంగాణకు, దేశానికి వన్నె తీసుకొచ్చిన వెటరన్ క్రీడాకారులను ఆదుకునేందుకు శాట్ త్వరలోనే సమగ్ర విధానం తయారు చేస్తుందని శివసేనా రెడ్డి తెలిపారు. శాట్ వీసీ, ఎండీ సోనీ బాలాదేవి, మాజీ క్రీడాకారులు షబ్బీర్ అలీ, విక్టర్ అమల్‌రాజ్, పీఆర్‌వో సురేశ్ కాలేరు కార్యక్రమంలో పాల్గొన్నారు. క్లిష్ల పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అందించి, అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం, శాట్ చైర్మన్‌కు అఫ్జల్ కుటుంబ సభ్యులు కతజ్ఞతలు తెలిపారు.