– పదోతరగతి విద్యార్థులకు అల్పాహారం
నవతెలంగాణ-ఖానాపూర్
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల ఆర్థిక సహకారంతో పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందజేస్తున్నారు. పదో తరగతి చదువుతున్న 126 మంది విద్యార్థులకు శనివారం నుంచి అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పాఠశాలలోనే ఉండి చదువుకుంటున్నారు. ఉదయం ఇంటి వద్ద నుంచి విద్యార్థులు ఏమీ తినకుండా రావడం గమనించిన ఉపాధ్యాయులు.. పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ఉదయం, సాయంత్రం పాఠశాలలోనే అల్పాహారం తయారు చేసి అందించాలని నిర్ణయించుకున్నారు. అందుకు కావాల్సిన నిధులను ప్రధానోపాధ్యాయులు ఇర్రి నరేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు బోనగిరి నరేందర్‌రావు, తొంటి శంకర్, కుర్ర శేఖర్, జాడి శ్రీనివాస్, వెన్నం అంజయ్య, కందూరి శ్రీనివాస్, పుప్పాల స్వప్న, మారుతి, గంగాధర్, రమేష్ భరించాలని నిర్ణయించుకొని అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయుల ప్రయత్నాన్ని స్థానికులు అభినందించారు.