
– అసౌకర్యానికి లోనవుతున్న రోగులపై పట్టింపు కరువు
– తీవ్ర ఆవేదనలో రోగులు
– ఆస్పత్రిపై నిత్యం పర్యవేక్షణ ఉండాలంటున్న ప్రజలు
– అభివృద్ధి కమిటీ ఏం చేస్తుందని సూటి ప్రశ్న
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
గత నెల 28 న ఉదయం 10 గంటలకు జ్వరం, వాంతులు ఎక్కువగా వస్తున్నాయని మల్లయ్య అనే ఓ వ్యక్తి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కి వచ్చాడు. వైద్యునితో చూయించుకున్నాకా అవసరమైన మందులు ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవటంతో బయట దుకాణంలో తెచ్చుకోవాలని వైద్యులు చీటి రాసిచ్చారు. మల్లయ్య సోదరుడు రూ.300 వెచ్చించి ప్రైవేటులో తీసుకొచ్చారు. అప్పటికే మల్లయ్యకు జ్వరం మరింత తీవ్రం కావడంతో ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో మందుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని చెప్పడానికి పై విషయం ఒక ఉదాహరణ మాత్రమే. నల్లగొండ జిల్లా ప్రజలకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రే పెద్దదిక్కు. ఇక్కడ తగిన వైద్యసేవలు అందుతాయన్న ఆశతో వస్తున్న రోగులకు వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. ఓ వైపు వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతుండగా.. మరోవైపు రోగులకు అవసరమైన మందులు మందుల కొరత పట్టిపీడిస్తోది. దీంతో వైద్యులు ప్రైవేటుగా తెచ్చుకోవాలని చీటి రాసిస్తున్నారు. విధిలేక వందల రూపాయలు వెచ్చించి మందులు తెచ్చుకుంటున్నారు. ఎందుకు అందుబాటులో లేవని ఎవరైనా ప్రశ్నిస్తే… అవేమి తమకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. స్టోర్లో నిల్వను బట్టి మందులను అందుబాటులో ఉంచాల్సిన అధికారులు తమకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా రోగులు, వారి సహాయకులు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. అసలే వ్యాధుల కాలం కావడంతో ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువైంది. ఈ సమయంలో జ్వరానికి సంబంధించిన మందులు కూడా లేకపోవడంతో రోగుల బాధ వర్ణానతీతంగా మారింది.
అందుబాటులో లేనివి..
విషద్రావణం తాగిన వారు, వాంతులు, విరేచనాలు, శరీరంలో యాసిడ్లు ఎక్కువైన వారికి, తీవ్ర జ్వరాల బారిన పడిన రోగులకు తగిన మందుల కొరత ఉన్నట్లు కొందరు వైద్యులే చెప్పడం గమనార్హం. అత్యవసర చికిత్సా విభాగంలో చేరే ఎక్కువ శాతం మంది వినియోగించే సోడియం వాలీ యేట్, లెవిప్రిల్, ప్యాంటాప్, డాక్సీ సెక్లిన్, ఐవీ మెట్రోజిల్ ఫ్లూయిడ్స్, అమాక్సిక్లావ్ తో పాటు సర్జికల్ స్పిరిట్, ఇవే కాకుండా సాధారణ జ్వరానికి అవసరమ్యే పారాసిటమాల్, పాన్ టాప్ ప్రోజోల్, డైక్లోఫెనాక్ టాబ్లెట్, డైక్లో ఫెనాక్ ఇంజక్షన్, ఓ ఆర్ ఎస్ పౌడర్, ఆండ్రం, అదేవిధంగా సర్జికల్ కు సంబంధించి ప్రధానంగా ఉపయోగపడే సిరంజీలు అందుబాటులో లేవు. 2 సిసి, 5 సిసి,10 సిసి సిరంజీలు, సిక్స్ అండ్ ఆఫ్ గ్లౌజులు, ఎగ్జామినేషన్ గ్లౌజులు, ఇవేవీ కూడా అందుబాటులో లేవు.
సూపరిండెంట్.. మెడికల్ స్టోర్ నిర్వాహకుల సమన్వయ లోపం..
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్, మెడికల్ స్టోర్ నిర్వాహకుల సమన్వయ లోపంతో వివిధ ఆరోగ్య సమస్యలతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వచ్చే ప్రజలు ఆరోగ్య సేవలు పొందుటలో ఇబ్బందులు ఎదురుకోవలసిన దుస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఏ మందులు అందుబాటులో ఉన్నాయో, ఎ మందులు అందుబాటులో లేవో ప్రజలకు మందులను ఇచ్చే స్టోర్ల దగ్గర విధిగా ప్రదర్శించాలి. ఇక్కడ అలా జరగడం లేదు. బయటి మెడికల్ షాప్ లతో డాక్టర్లు బేరసారాలు కుదుర్చుకొని పేషెంట్లకు ఇవ్వాల్సిన మందులు అందుబాటులో లేనివి రాసి పేదవారి జేబులు ఖాళీ చేస్తూ, మెడికల్ షాపుల యాజమాన్యాల జేబులు నింపుతూ, ఆర్థిక లావాదేవుల చేసుకుంటున్నారని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు విషయాన్ని వైద్యుల వద్ద ప్రస్తావించిన పట్టి పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు తప్ప వారిలో మార్పు రావడంలేదని పేర్కొంటున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు కావలసిన మందులను అందుబాటులో ఉంచే విధంగా చూడటమే కాకుండా, మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
జాడ లేని అభివృద్ధి కమిటీ..!
ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన సేవలందించేందుకు ఉద్దేశించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ జాడ లేకుండా పోయింది. కమిటీ ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. కమిటీ సమావేశంలో ఆస్పత్రిలో లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సి ఉన్నా పట్టింపులు కొరవడ్డాయి. జిల్లా కలెక్టర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్, డిసిహెచ్ఎస్, డిఎంహెచ్ఓ, శాసనసభ్యులతో పాటు వివిధ వర్గాల సభ్యులు ఉంటారు. వీరి సూచనలు, సలహాలు పాటించి రోగులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాల్సి ఉంది.
పేరుకే పెద్ద ఆస్పత్రి: దాసు (నల్లగొండ)
పేరుకే పెద్ద ఆస్పత్రి తప్ప కనీస వసులు లేవు. కలెక్టర్ ఎన్నిసార్లు సీరియస్ గా చెప్పినా కలెక్టర్ మాట కూడా వినటం లేదు. ఇక్కడ మందులు అందుబాటులో లేవు. డాక్టర్లు సరిగా స్పందించరు. అందుబాటులో ఉండరు. సమయానికి రారు. అధికారుల దగ్గరికి వెళితే మందులు ఉన్నాయని చెబుతారు. రోగులకు మాత్రం డాక్టర్లు మందులను రాసినప్పుడు అవి మెడికల్ స్టోర్ లో మాత్రం దొరకడం లేదు. బయట తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నాలాంటి పేదవాళ్లకు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఏం న్యాయం జరుగుతున్నట్టు.
అందుబాటులోకి రాని సూపరిండెంట్..
మందుల కొరత విషయమై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ ను నవతెలంగాణ ఫోన్లో సంప్రదించగా ఫోన్ స్విచ్ ఆఫ్ గా వచ్చింది.
మందులు అన్ని అందుబాటులో ఉన్నాయి: డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి (డిసిఎస్ ఆర్ఎమ్ఓ )
ప్రభుత్వాసుపత్రిలో రోగులకు కావలసిన మందులు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి కొరత లేదు.