– ఇతర శాఖల్లోకి బదిలీ అయినా ఐదు నెలలుగా జీతాల్లేవ్..
– ఎన్నికలకు ముందు ఆగమైన పూర్వపు గ్రామ రెవెన్యూ సహాయకులు
– ప్రమోషన్ల పేరుతో 200కి.మీ. దూరంలో ఉద్యోగాలు
– ఐడీ నెంబర్లు లేవ్.. ఆపై అదనపు బాధ్యతలతో వెట్టిచాకిరీ
– అసలు జీతమే అరకొర.. అదీ రాక అప్పులపాలు
– కొత్త సర్కారు అయినా కొలిక్కి తేవాలని డిమాండ్
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి ఏండ్లుగా వారిని ఆగం చేసిన గత సర్కారు సరిగ్గా ఎన్నికలకు ముందు ఇతర శాఖల్లోకి బదిలీ చేసింది. సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి మరీ ఆగస్టు 10న జీవో నెంబర్ 81, 85 ద్వారా ప్రమోషన్ ఇచ్చినా ప్రభుత్వం గుర్తింపు నెంబర్ ఇవ్వలేదు. ఇంతలో ఎన్నికల కోడ్ రావడం కొత్తగా కాంగ్రెస్ సర్కారు కొలువుదీరడం వంటి పరిణామాల మధ్య ఐదు నెలల కాలం గడింది. ఇచ్చిన ప్రమోషన్ ఉమ్మడి జిల్లా పరిధిలోగాకుండా ఇతర జిల్లాలో రావడం, అక్కడికి వెళ్లి కొలువులో చేరినా ఐదు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబం గడవక అప్పులపాలవుతున్నారు.
రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ సర్కారు తొలి రోజుల్లోనే వీఆర్‌ఏల గౌరవవేతనాన్ని రూ.6వేల నుంచి రూ.10500కు పెచింది. ఏండ్లుగా అదే కొలువులో ఉన్న వారికి ప్రమోషన్లు కల్పిస్తామని స్వయంగా గత సీఎం కేసీఆర్ 2016, 2020లో హామీలూ ఇచ్చారు. అయితే, రెవెన్యూశాఖను సమగ్ర ప్రక్షాళన చేసి భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ‘ధరణి’ పోర్టల్‌ను తీసుకొచ్చిన గత సర్కారు 2020లో కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. భూ రికార్డుల విషయంలో వీఆర్‌వో, వీఆర్‌ఏల అవసరం లేదని ఆ పోస్టులను రద్దు చేసింది. వీఆర్‌ఓలను ఇతర శాఖల్లోకి బదిలీ చేసింది. ఆ సమయంలో తమ కొలువుల సంగతి తేల్చాలని వీఆర్‌ఏలు సుమారు మూన్నెళ్లపాటు ఆందోళన చేయగా, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న కేటీఆర్ స్పందించి వీఆర్‌ఏల ప్రతి నిధులతో చర్చించి పరిష్కారం చూపారు. ఇతర శాఖల్లో సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి ఆగస్టు 10న జీవో నెంబర్ 81, 85 ద్వారా పూర్వపు వీఆర్‌ఏలకు ఉద్యో గోన్నతి కల్పించారు. కొందరిని రెవెన్యూలోనే ఉంచి, మిగిలిన వారిని ఎడ్యుకేషన్, వైద్యం, నీటిపారుదల, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మున్సి పల్, పంచాయతీరాజ్ వంటి శాఖల్లో వారి విద్యార్హతలు, వయసును బట్టి ఆఫీసు సబార్డినేటర్, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెం ట్లుగా బదిలీ చేశారు.
ఐడీ నెంబర్ లేదు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో సుమారు 3200 మందికిపైగానే వీఆర్‌ఏలు ఉండేవారు. జిల్లాల పునర్విభజనతో కొందరు ఉమ్మడి జిల్లా పరిధి దాటి ఇతర జిల్లాల్లోకి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లాలో 565, సిరిసిల్లలోని 465, జగిత్యాలలో 470, పెద్దపల్లి జిల్లాలోని 460 మంది మిగిలిపోయారు. అయితే వీరందరికీ ప్రమోషన్ ఇచ్చి ఇతర శాఖల్లోకి బదిలీ చేసిన గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లా పరిధి దాటి ఇతర జిల్లాలకు పంపించింది. అందులోనూ కరీంనగర్ జిల్లా వారికి నిర్మల్, హన్మకొండ, వరంగల్, సిరిసిల్ల జిల్లా వారికి కామా రెడ్డి, నిజామాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. కొందరికైతే భద్రాద్రి కొత్త గూడెంకూ వెళ్లాల్సి వచ్చింది. ప్రమోషన్ దూర జిల్లాల్లో వచ్చినా వెళ్లేందుకు సిద్ధమైన పూర్వపు వీఆర్‌ఏలకు ప్రభుత్వం గుర్తింపు నెంబర్లు ఇవ్వలేదు. దీంతో ఐడి నెంబర్లు లేక జీతాలు రాని పరిస్థితి నెలకొంది. గతంలో నెలానెలా వచ్చే రూ.10500 అరకొర జీతంలో కుటుంబాన్ని నెట్టుకొస్తే.. కొత్తగా వచ్చిన ప్రమోషన్‌లో ఐదు నెలలుగా జీతాలు రాక అవస్థలు పడుతున్నారు. ఉద్యోగం వచ్చిన జిల్లాలకు మారి కొందరు, రోజువారీగా కొలువు కోసం ప్రయాణం చేస్తూ మరికొందరు కుటుంబాన్ని పోషించలేక అప్పులపాలవు తున్నారు. ఇక 60ఏండ్లు పైబడిన వారి కుటుంబాల్లో వారసులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీ అటెకక్కడంతో సుమారు 500మందికిపైగా అటు ప్రమోషనూ, ఇటు ఉద్యోగమూ లేక వీధినపడ్డారు.
200 కిలో.మీ. దూరంలో ఉద్యోగం…
కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం మన్నెపల్లికి చెందిన జయశ్రీ అదే గ్రామంలో వీఆర్‌ఏగా పని చేసేవారు. ప్రస్తుతం ప్రమోషన్ మీద ప్రభుత్వం వార్డు ఆఫీసర్‌గా 200కిలోమీటర్ల దూరంలోని నిర్మల్ మున్సిపాలిటీకి బదిలీ చేసింది. నుస్తులాపూర్‌కు చెందిన మరో వీఆర్‌ఏ వనిత సైతం అదే మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్‌గా చేరారు. కరీంనగర్‌కు చెందిన అవినాశ్, మానకొండూర్‌కు చెందిన జెట్టి శ్రీనివాస్ సైతం నిర్మల్, హన్మకొండ జిల్లాలోని రెవెన్యూశాఖలో రికార్డు అసిస్టెంట్లుగా వెళ్లారు. ఊరుగాని ఊరు.. అందులోనూ వంద నుంచి 200కిలోమీటర్ల దూరంలో ప్రమోషన్ మీద ఉద్యోగ మిచ్చినా.. ఐడి నెంబర్ లేక వచ్చే అరకొర జీతమూ ఐదు నెలలుగా రాక అప్పులపాలవుతున్నామని వారు ‘నవతెలంగాణ’తో వాపోయారు.
వెంటనే గుర్తింపు సంఖ్య కేటాయించాలి
తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి, విద్యార్హతలను బట్టి వివిధ శాఖలకు బదిలీ జరిగి ఐదు నెలలు పూర్తి కావస్తున్నా.. నేటికీ గుర్తింపు సంఖ్య కేటాయించ లేదు. దీనికితోడు జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇకనైనా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని తమ సమస్యకు పరిష్కారం చూపాలి.
కిన్నెర కొమురయ్య, వీఆర్‌ఏల జేఏసీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి
జీతాలు రాక అప్పులపాలవుతున్నం
ఐదు నెలలుగా జీతాలు రావడం లేదు. ఎంప్లాయీ ఐడి ఇచ్చి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడం లేదు. గతంలో వచ్చిన జీతంతోనైనా కొంత పూటగడిచేది. ఇప్పుడు ప్రమోషన్లు ఇచ్చినా.. కొత్త జీతమెంతో చెప్పకుండా ఐదు నెలలుగా వేతనాలు అందక అప్పులపాలవుతున్నాం.
సంపత్ (పూర్వపు వీఆర్‌ఏ), తిమ్మాపూర్ ఎంఆర్‌ఓ ఆఫీసు