రావల్పిండి: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్-అల్-హసన్ జరిమానాకు గురయ్యాడు. రావల్పిండి టెస్టులో అతడు ఐసిసి నియమావళిని ఉల్లంఘించడంతో మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పడింది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్ ఐదోరోజు ఆటలో భాగంగా షకీబ్ బంతిని పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ పైకి విసిరాడు. ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మ్యాచ్ రిఫరీ ఐసిసికి ఫిర్యాదు చేశాడు. రావల్పిండి టెస్టులో బంగ్లాదేశ్ విజయానికి ఆరు వికెట్లు అవసరమైన దశలో షకీబ్ బంతి అందుకున్నాడు. అప్పటికీ పాక్ స్కోర్ 103-4. ఆ సమయంలో క్రీజులో మహ్మద్ రిజ్వాన్(18), నాన్ స్ట్రయికింగ్‌లో అబ్దుల్లా(37) ఉన్నారు. ఇక రనప్ పూర్తి చేసి షకీబ్ బంతిని విసిరేందుకు సిద్ధమయ్యాడు. అయితే బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేని పక్కకు జరిగాడు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన షకీబ్ బంతిని రిజ్వాన్ తల మీదుగా వికెట్ కీపర్ వైపు విసిరాడు. ఊహించని పరిణామంతో షాక్ తిన్న అంపైర్ ఇదేంటీ.. ఏం చేస్తున్నావ్ అంటూ షకీబ్ తీరును తప్పు పట్టాడు. అంతేకాదు ఆ బంతిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. మ్యాచ్ అనంతరం షకీబ్ దురుసు ప్రవర్తనను ఐసీసీ దష్టికి తీసుకెళ్లాడు. షకీబ్ వీడియో పరిశీలించిన ఐసీసీ క్రమశిక్షణ కమిటీ అతడు నియమాలను ఉల్లంఘించినట్టు తేల్చింది. అందుకు శిక్షగా అతడికి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది.