– మధ్యప్రదేశ్‌లో హిందూత్వ శక్తుల అరాచకం
భోపాల్: ఇంగ్లీష్‌లో మాట్లాడాలని ఒక విద్యార్థికి సూచించినందుకు స్కూల్ ప్రిన్సిపాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన అరాచకం బిజెపి ప్రభుత్వ పాలనలోని మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ ఒత్తిడితో పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గుణ పట్టణంలోని వందన కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ కేథరిన్ వటోల్లీపై కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో బిఎన్‌ఎస్ సెక్షన్ 196, సెక్షన్ 229 కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన గురించి స్థానికులు, పాఠశాల సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం ఇటీవల విద్యార్థులతో అసెంబ్లీ నిర్వహించారు. నలుగురు హౌస్ కెప్టెన్లలో ఇద్దర్ని తమ నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించే విధంగా ప్రసంగించాలని ఉపాధ్యాయులు సూచించారు. ఒక విద్యార్థి హిందీలో తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. సిస్టర్ కేథరిన్ ఇంగ్లీష్‌లో ప్రసంగించాలని విద్యార్థికి తెలిపారు. ఇది పాఠశాలలో గతంలో ఇచ్చిన సూచనే. ఈ సూచనతో విద్యార్థి ప్రసంగించకుండా తమ తరగతికి వెళ్లిపోయాడు. ‘హిందీలో మాట్లాడినందుకు విద్యార్థుల నుంచి మైక్ లాక్కున్నారు’ అనే శీర్షికతో ఒక హిందీ పత్రిక వార్త వచ్చింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, హిందీని అవమానించారని ఎబివిపి కార్యకర్తలు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణలను పాఠశాల సీనియర్ సిబ్బంది ఒకరు ఖండించారు. ఇంగ్లీష్‌లో మాట్లాడాలని మాత్రమే చెప్పినట్లు వివరణ ఇచ్చారు. తమ సంస్థ ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తుందని చెప్పారు. నామమాత్రపు ఫీజులు, నాణ్యమైన విద్య కారణంగా అనేకమంది తల్లిదండ్రులు తమ పాఠశాలను ఎంచుకుంటారని తెలిపారు. ఈ వందన కాన్వెంట్ స్కూల్‌ను మహిళలే నిర్వహిస్తుంటారు. ఇటీవలే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నతస్థానాల్లో సేవలందిస్తున్నారు.