సుభాషిణీ అలీపై ఎఫ్‌ఐఆర్‌

– మణిపూర్‌ డీజీపీకి ఎన్‌సీపీసీఆర్‌ ఆదేశం
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణీ అలీ, మేఘాలయకు చెందిన తరుణ్‌ భారతీయ, తమిళనాడుకు చెందిన ఎం.కమాలుద్దీన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) మణిపూర్‌ డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు ఓ లేఖ రాసింది. మణిపూర్‌లో మే 4న ఇద్దరు యువతులను నగంగా ఊరేగించిన ఘటనలో పాల్గొన్న ఓ మైనర్‌ ఫొటోను సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌ చేశారన్న ఆరోపణపై వీరిపై కేసు నమోదు చేయాలని ఆ లేఖలో డీజీపీ రాజీవ్‌ సింగ్‌ను ఆదేశించింది. పధ్నాలుగు సంవత్సరాల బాలుడి గుర్తింపును బయటపెట్టారంటూ ఈ ముగ్గురిపై తనకు ఫిర్యాదు అందిందని ఆ లేఖలో వివరించింది. మైనర్‌ బాలుడి ఫొటోను బహిర్గతం చేయడం మానసిక క్షోభకు కారణమైందని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని ఎన్‌సీపీసీఆర్‌ తెలిపింది. ‘ఈ ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. సుభాషిణీ అలీ పెట్టిన పోస్ట్‌ బాలుడి భద్రతకు ముప్పు కలిగిస్తోంది. తాను ఒక మైనర్‌ ఫొటోను పెడుతున్నానన్న విషయాన్ని మాజీ ఎంపీ అయిన సుభాషిణీ అలీ గుర్తించి ఉండాల్సింది. అదీకాక బాలుడు ఈ దారుణానికి పాల్పడలేదు. సంఘటన జరిగిన సమయంలో అతను ఆ జిల్లాలోనే లేడు’ అని ఆ లేఖలో ఎన్‌సీపీసీఆర్‌ ఛైర్‌పర్సన్‌ ప్రియాంక్‌ కానూంగో వివరించారు. వీరు ముగ్గురూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21, బాల న్యాయ చట్టంలోని సెక్షన్‌ 75, సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్‌ 66-ఈతో పాటు చట్టంలోని ఇతర నిబంధనలను ఉల్లంఘించారని ప్రాథమిక ఆధారాలు లభించినందున ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆమె ఆదేశించారు.