ఎన్నికల విధులకు హాజరుకాకుంటే ఎఫ్‌ఐఆర్‌

ఎన్నికల విధులకు హాజరుకాకుంటే ఎఫ్‌ఐఆర్‌– జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రోస్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్‌ హాల్‌లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రిటర్నింగ్‌ అధికారులతో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 23,500 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి పీఓ, ఏపీవోలు 1700 మంది, మైక్రో అబ్జర్వర్లు 120 మంది, ఇతర పోలింగ్‌ సిబ్బంది రెండు వేల మంది శిక్షణకు హాజరు కాలేదన్నారు. వారిలో అనారోగ్యంతో బాధపడేవారు, గర్భిణులను మినహాయించి మిగిలిన వారికి రెండు సార్లు నోటీసులు ఇచ్చామన్నారు. త్వరలో వారిపై ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేయడంతోపాటు ఇతర చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానాలతోపాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తుచేశారు.