– ఆరుగురి పరిస్థితి విషమం
– పైప్ నుంచి గ్యాస్ లీక్‌తో ఎగిసిన మంటలు
– సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
– మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశం
– ఉత్తరప్రదేశ్‌కి చెందిన వలస కార్మికులుగా గుర్తింపు
నవతెలంగాణ-శంషాబాద్
బేకరీ కిచెన్‌లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ పైప్ లీకై అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు కాగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్‌లో గురువారం జరిగింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గగన్ పహాడ్ పారిశ్రామికవాడలో నిర్వహిస్తున్న కరాచీ బేకరీ ఫ్యాక్టరీలో ఎప్పటిలాగే ఉదయం 10:30 గంటల సమయంలో ఆహార పదార్థాలను తయారుచేస్తున్న క్రమంలో బయట ఆవరణలో ఉన్న పైపుల నుంచి సరఫరా అయ్యే గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దాంతో అక్కడే వంట చేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ఆ సమయంలో 18మంది పనిలో ఉండగా.. వారిలో 15మంది గాయపడ్డారు. వీరందరినీ శంషాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న వారిని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ ఏసీపీ రామ్‌చందర్రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే శంషాబాద్‌లోని ట్రైడెంట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను రంగారెడ్డి జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓ పరామర్శించారు. ఘటనకు గల కారణాలకు బాధితులను అడిగి తెలుసుకున్నారు. శంషాబాద్ లేబర్ ఆఫీసర్ వాల్యనాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారనే విషయం తమకు తెలియదని చెప్పారు. గాయపడిన వారిలో.. బలరాం, సుభాన్ ప్రజాపతి, అదితి కుమార్, సందీప్ ప్రజాపతి, దీపక్ శుక్ల, అమ్రేష్ కుమార్, ముఖేష్ కుమార్, దారేష్ సింగ్, సోను, కమల్ కిషన్, ప్రమోద్‌కుమార్, సుజిత్, సందీప్ కుమార్, సన్నీ, ప్రదీప్‌లకు మంటలు అంటుకొని గాయాలయ్యాయి. వీరంతా ఉత్తరప్రదేశ్‌కి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
కరాచీ బేకరీ గోడౌన్‌లో గురువారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంపౖౖె సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సను అందచేయాలని సంబంధిత ఆధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులున్నారని తెలిపారు. గాయపడ్డ వారిలో 8 మందిని కంచన్ బాగ్ డీఆర్డీఓ ఆస్పత్రికి తరలించారనీ, వారికి మెరుగైన వైద్య సదుపాయాలూ అందచేయాలంటూ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని సీఎం ఆదేశించారు.