– ఐదు ద్విచక్ర వాహనాలు దగ్ధం
నవతెలంగాణ-మలక్‌పేట్
హైదరాబాద్ మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడ పార్కింగ్ చేసిన ఐదు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. వివరాల్లోకెళ్తే.. శుక్రవారం సాయంత్రం మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద నిలుపుదల చేసిన బైక్‌లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో అక్కడున్న వారు పరుగులు పెట్టారు. ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మలక్‌పేట మెట్రో పిల్లర్ నెంబర్ 1409 వద్ద ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. కేసు నమోదుపై దర్యాప్తు చేస్తున్నట్టు చాదర్‌ఘాట్ ఎస్‌ఐ రాజు తెలిపారు. అయితే, స్థానికంగా పెట్రోల్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దొంగతనం చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.