– ట్యాంకులో చెలరేగిన మంటలు
– తప్పిన పెను ప్రమాదం
– బంక్ పక్కనే రైల్వే స్టేషన్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్/మెహిదీపట్నం
హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. పెట్రోలియం ట్యాంకు నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు పరుగులు తీశారు. వివరాల్లోకెళ్తే.. నాంపల్లిలోని ఏక్‌మినార్ కూడలి వద్ద బుధవారం హెచ్‌పీ పెట్రోల్ బంకులో ఆయిల్ నింపడానికి హిందూస్థాన్ పెట్రోలియం ట్యాంకర్ వచ్చింది. ఆ సమయంలో ట్యాంకర్ మూత నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డు వైపుకు మళ్లించాడు. స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అంతకుముందు బంక్ సిబ్బంది ఫైర్ గ్యాస్ ఉపయోగించినా మంటలు అదుపులోకి రాలేదు. నాంపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెట్రోల్ బంక్ సమీపంలోనే రైల్వేస్టేషన్ ఉంది. బంక్‌కు మంటలు వ్యాపించి ఉంటే భారీ ప్రమాదం సంభవించి ఉండేది.