నవతెలంగాణ – మల్హర్ రావు
ఆరుగాలం శ్రమించి వరి పంటలను సాగు చేసిన రైతులకు ఏటా నష్టాలే మిగుతున్నాయి. అతి వృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోతూనే ఉన్నారు. చివరికి తెగుళ్లు సోకడంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది. మండలంలో సుమారు 10 వేల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు వ్యవసాయాధికారుల లెక్కలు చెబుతున్నాయి.వరి సాగు బాగానే ఉన్నప్పటికీ తెగుళ్లలతో రైతులు సతమతమవుతున్నారు. అగ్గి తెగుళ్లు సోకడంతో వరి ఎండి పోతుందని వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. వరి కోసలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాధికారులు వరి పొలాలు సందర్శించడం లేదని తాడిచెర్ల, కాపురం గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్య లు తెలియజేయాలని రైతులు కోరుతున్నారు.