– వరుసగా నాలుగో రోజు భానుడి ప్రతాపం
– 10 జిల్లాల్లో 46 డిగ్రీలకు చేరిన ఉషోగ్రతలుణ
– అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. గతంలో ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణ్రోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి భగభగలకు, వడగాలులకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46 డిగ్రీల ఉష్ణ్గోగ్రతలు నమోదయ్యాయి. మరో 4 రోజుల్లో 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మండుటెండలకు తోడు ఉక్కపోత ఎక్కువవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలెర్ట్, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్‌లు కొనసాగుతున్నాయి. ఎండలు మండుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధిక ఉష్ణ్రోగ్రతతో ఏర్పడిన అల్పపీడనంతో ఈనెల 6,7 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.