రాజరాజేశ్వర కాటన్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

– సుమారు రూ.60 లక్షల పత్తి దగ్ధం
నవతెలంగాణ- ములుగు

ములుగు జిల్లా ములుగు మండలం జాకారం సమీపంలోని శ్రీ రాజరాజేశ్వర కాటన్‌ ఇండిస్టీలో ఎయిర్‌ కంప్రెషర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ఎగిసిపడి సుమారు రూ.60 లక్షల విలువచేసే పత్తి కాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇండిస్టీ యజమానులు, సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు జిన్నింగ్‌ మిల్లు నడుస్తున్న క్రమంలో మిల్లులోని ఎయిర్‌ కంప్రెషర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ వచ్చి మంటలు ఎగసిపడ్డాయి. ఆ మంటలు పత్తిపై పడి అంటుకొని పొగ రావడంతో యజమానులు అప్రమత్తమయ్యారు. అప్పటికే మిల్లులో సుమారు రూ.2 కోట్ల విలువైన పత్తి నిలువ చేసి ఉంది. యజమానులు, సిబ్బంది అప్రమత్తమై మిల్లులో ఏర్పాటుచేసిన ఫైర్‌ సేఫ్టీ సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ వెంటనే ములుగు, పరకాల, నర్సంపేట ఫైర్‌ స్టేషన్లకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్‌ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాంతో సుమారు రూ.1.40 కోట్ల విలువగల పత్తిని కాపాడుకోగలిగామని ఇండిస్టీ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ కూకట్ల సత్యనారాయణ తెలిపారు. మిల్లులోని ఫైర్‌ సేఫ్టీ, ఫైర్‌ ఇంజన్లు సకాలంలో అందకుంటే ఇంకా భారీ నష్టం జరిగేదని యజమానులు తెలిపారు.