టాటానగర్‌ పరుపుల గోదాంలో అగ్నిప్రమాదం

టాటానగర్‌ పరుపుల గోదాంలో అగ్నిప్రమాదం– అత్తాపూర్‌లో ప్యాకింగ్‌ కవర్ల గోదాంలోనూ..
– రెండు ప్రమాదాల్లో ఆస్తి నష్టం
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలోని టాటానగర్‌లో గల పరుపుల గోదాంలో సోమవారం అగ్నిప్రమాదం సంబంధించింది. ఈ ఘటనలో స్వల్ప ఆస్తి నష్టం వాటిల్లింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, స్థానికులు, ఫైర్‌ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన యాఖత్‌.. టాటానగర్‌లో పరుపుల గోదాం నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో గోదాంలో మంటలు వచ్చాయి. గమనించిన కార్మికులు వెంటనే బయటకి పరుగెత్తుకొని వచ్చారు. వారు వెంటనే యజమానికి, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. క్షణాల్లో మంటలు కంపెనీ మొత్తం వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది రెండు ఫైర్‌ ఇంజన్ల సాయంతో సుమారు నాలుగు గంటలు కష్టపడి మంటలను పూర్తిగా అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అత్తాపూర్‌లో మరో ప్రమాదం
అత్తాపూర్‌లోని ప్లాస్టిక్‌ కవర్‌ ప్యాకింగ్‌ గోదాంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గమనించిన కార్మికులు గోదాంలో నుంచి బయటికి వచ్చి, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది ఐదు గంటల పాటు కష్టపడి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.