ఫైరింజన్‌ సిద్ధం చేస్తున్న కాంగ్రెస్‌

Firenjan is preparing Congress– జానారెడ్డి ఆధ్వర్యంలో ఫోర్మెన్‌ కమిటీ… అసంతృప్తిని చల్లార్చడమే లక్ష్యం
– నెలాఖరులోగా అభ్యర్థుల జాబితా
– 18న తుదిమెరుగులు దిద్దనున్న స్క్రీనింగ్‌ కమిటీ
– కొంత మంది అభ్యర్థులకు మౌఖిక ఆదేశాలు
– ముహుర్తం చూసుకుని రంగంలోకి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత జరగనున్న పరిణామాలను అంచనా వేస్తున్నది. అందుకనుగుణంగా పావులు కదుపుతున్నది. నేతల అసంతృప్తిని బుజ్జగించేందుకు ఫైరింజన్‌ను (బుజ్జగింపుల కమిటీ) సిద్ధం చేస్తున్నది. పదేండ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు ‘డూ ఆర్‌ డై’ అన్న రీతిలో ఉన్నాయి. మొత్తంగా టికెట్‌ దక్కని నేతల నుంచి తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడే అవకాశం ఉంది. దీనిని చల్లార్చేందుకు పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కే జానారెడ్డి ఆధ్వర్యంలో ఫోర్మెన్‌ కమిటీని నియమించింది. తెలంగాణ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సయోధ్య కోసం హైకమాండ్‌ ఆయనకు ట్రబుల్‌ షూటర్‌గా కీలక బాధ్యతలు అప్పగించింది. జానారెడ్డితోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, దీపాదాస్‌ మున్షి, మీనాక్షి నటరాజన్‌లతో ఈ కమిటీని నియమించి.. అభ్యర్థుల ప్రకటన తర్వాత అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను అప్పగించి నట్టు తెలుస్తోంది. బుధవారం గాంధీభవన్‌లో జానారెడ్డి అధ్యక్షతన సమావేశమై అసంతప్తులు ఉన్న నియోజకవర్గాలపై కమిటీ సమీక్ష నిర్వహించినట్టు సమాచారం. ఇప్పటికే అభ్యర్థుల జాబితా మీడియా లో చక్కర్లు కొడుతుండటంతో అసంతృప్తులు గాంధీభవన్‌ ముందు నిరసనలకు దిగుతున్నారు. తుది జాబితా ప్రకటించిన వెంటనే గాంధీభవన్‌పైకి భారీగా దండెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆశా వహుల నుంచి వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని వడపోయగా, నియోజక వర్గానికి ముగ్గురు చొప్పున జాబితాలో మిగిలారు. మరికొన్ని చోట్ల ఒకటే పేరు ఖరారు చేసినట్టు తెలిసింది. అలాంటి పేర్లు 60 నుంచి 75 వరకు ఉంటాయని తెలుస్తోంది. ఇవి కాకుండా కొన్ని చోట్ల ఒకే నియోజకవర్గంలో పలువురు సమర్థవంతమైన నాయకులు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరికి టికెటు ఇచ్చినా మరొకరు అలకబూనే ప్రమాదముంది. వారంతా ధర్నాలు, నిరసనలు, ముట్టడులు, ఆందోళనలు చేసే అవకాశం ఉన్నది. 2018లోనూ గాంధీభవన్‌లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ఈసారి కూడా అలాంటి పరిస్థితులే తలెత్తే అవకాశముండటంతో ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈనెల 18న అభ్యర్థుల జాబితాకు తుది మెరుగులు దిద్దేందుకు స్క్రీనింగ్‌ కమిటీ భేటీ కానుంది. అనంతరం ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలించనుంది. ఆ తర్వాత అక్టోబర్‌ నెలాఖరు లోగా ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అధిష్టానం భావిస్తోంది. జాబితా ఆలస్యమవుతున్న నేపథ్యంలో కొంత మంది అభ్యర్థులకు ప్రచారం చేసు కోవాలంటూ మౌఖిక ఆదేశాలు అందినట్టు తెలిసింది. వారంతా ప్రచారానికి ముహుర్తాలు చూసుకుంటు న్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా అనివార్యమైతే కొన్ని మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని అధి ష్టానం చెబుతున్నట్టు సమాచారం. ఓ బలమైన అభ్యర్థి కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశం ఉంటే పార్టీ ఆదేశం మేరకు తప్పుకుని గెలిచే అభ్యర్థికి ఛాన్స్‌ ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. కల్వకుర్తి నియోజక వర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారా యణరెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో అక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఆయన రాకను మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి కూడా అంగీకరిం చడంతో కథ సుఖాంతమైంది. అన్ని చోట్ల అలాగే ఉండే అవకాశం లేదు.అందుకే నివారణో పాయంగా కాంగ్రెస్‌ హైకమాండ్‌ జానారెడ్డిని రంగంలోకి దించిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.