కెనడాలో పలు చోట్ల కార్చిచ్చులు

 సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపులు
మాంట్రియల్‌ : కెనడాలో నార్తరన్‌ క్యుబెక్‌ ప్రావిన్స్‌లో ఉత్తర, వాయవ్య ప్రాంతాల్లో పలు చోట్ల కార్చిచ్చులు సంభవించాయి. కార్చిచ్చు నివారణా సంస్థ అందచేసిన వివరాల ప్రకారం, ప్రావిన్స్‌లో మంగళవారం 150కి పైగా కార్చిచ్చులు సంభవించాయి. వీటిలో 110 సంఘటనల్లో పరిస్థితులు అదుపు తప్పాయని అధికారులు తెలిపారు. ఈ దావానలం నుంచి వస్తున్న దట్టమైన నల్లని పొగ అమెరికా ఈశాన్య ప్రాంతం, తూర్పు కెనడాల్లోని భాగాలను కమ్మేసింది. దీంతో కమిలిపోయిన వాసనలు ఆ ప్రాంతంలో విపరీతంగా వున్నాయి. పైగా ఆకాశమంతా నారింజరంగు వర్ణాన్ని సంతరించుకోవడంతో అక్కడి ప్రజలను ఇళ్ళలోంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. క్యుబెక్‌లో వందలాది దావానలం ఘటనల ప్రభావం సుదూరంగా వున్న న్యూయార్క్‌ నగరాన్ని, న్యూ ఇంగ్లండ్‌ను తాకింది. ప్రజల గొంతుల్లో మంట మొదలైంది. దీంతో ప్రావిన్స్‌లో మారుమూల ప్రాంతమైన క్యుబెక్‌ పట్టణాన్ని ఖాళీ చేయించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. గంటగంటకూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని ప్రధాని ఫ్రాంకోయిస్‌ లీగల్డ్‌ విలేకర్లకు తెలిపారు. క్యుబెక్‌లో పరిస్థితిని చూసినట్లైతే చాలా ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు వున్నాయన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. అసలు చెట్లే లేని చోట మొదటగా మంటలు ఆరంభమయ్యాయని నగర మేయర్‌ గే లాఫ్రెనిర్‌ తెలిపారు. పలు కమ్యూనిటీలు, పలు ప్రాంతాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయని, క్లోవా గ్రామమైతే పూర్తిగా దగ్దం కావడం మినహా మరో మార్గం లేదని ప్రధాని లీగల్డ్‌ తెలిపారు. అయితే తగ్గిన ఉష్ణ్రోగ్రతలు, గాలి దిశ మారడం, నెమ్మదిగా పొగ తగ్గడంతో పరిస్థితి కాస్త మెరుగైందని చెప్పారు.
ఈ సమయంలో వర్షాలు పడాలని కోరుకోవడం లేదని, దానివల్ల మంటలతో పోరు మరింత కష్టమవుతుందని చెప్పారు.