మణిపూర్‌లో మళ్లీ కాల్పులు

– 10మంది తీవ్రవాదులు మృతి
ఇంఫాల్‌: మణిపూర్‌లోని జిరిబమ్‌ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10మంది తీవ్రవాదులు మరణించారని అధికారులు తెలిపారు. భారీగా చోటు చేసుకున్న పరస్పర కాల్పుల్లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది కూడా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా వుండడంతో అస్సాంలోని సిల్చార్‌ మెడికల్‌ కాలేజీకి తరలించారు. సిఆర్‌పిఎఫ్‌ పోస్ట్‌పై దాడి జరిగిన నేపథ్యంలో ప్రతీకారంగా జరిపిన కాల్పుల్లో వీరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. బోరోబెక్రా సబ్‌ డివిజన్‌లో జకురాడార్‌ కరాంగ్‌ వద్ద ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. మారు వేషాల్లో అత్యాధునిక ఆయుధాలు ధరించిన మిలిటెంట్లు జకుర్దార్‌, బోరోబెక్రా పోలీసు స్టేషన్‌ వద్ద గల సీఆర్‌పీఎఫ్‌ పోస్టుపై దాడి చేశారని మణిపూర్‌ పోలీసులు తెలిపారు. ఆ దాడిని సీఆర్‌పీఎఫ్‌ , పోలీసులు సమర్ధవంతంగా తిప్పి కొట్టాయన్నారు. 40 నుండి 45నిముషాల పాటు హోరాహోరీగా సాగిన కాల్పులతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పారు. కాల్పులు నిలిచిపోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, పది మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయుధాలు, మందుగుండును కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. క్రిమినల్‌ కేసును నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అస్సాం రైఫిల్స్‌, సిఆర్‌పిఎఫ్‌, సివిల్‌ పోలీసులతో కూడిన బృందాలు ఆ ఏరియా చుట్టుపక్కల ఆపరేషన్స్‌ మొదలు పెట్టాయని, సాయుధ తీవ్రవాదులను ఏరివేసే కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. అంతకుముందు శాంతి భద్రతల భయంతో జిరిబమ్‌లో నిషేధాజ్ఞలు విధించారు. కాగా, గ్రామ వలంటీర్లను చంపినందుకు పొరుగున గల చురాచాంద్‌పూర్‌ జిల్లాలోని పౌరసమాజ గ్రూపు కుకీ-జో కౌన్సిల్‌ బంద్‌కు పిలుపిచ్చింది.