మణిపూర్‌లోని మోరేలో కొనసాగుతున్న కాల్పులు

మణిపూర్‌లోని మోరేలో కొనసాగుతున్న కాల్పులు– ఇండ్లను వదిలిన 200 మందికి పైగా గ్రామస్తులు
న్యూఢిల్లీ : జాతి హింస తెచ్చిన పరిస్థితులు ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ను ఏదో రకంగా అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల సరిహద్దు పట్టణం మోరేలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. సోమవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య వరుసగా రెండో రోజూ ఎదురుకా ల్పులు జరిగాయి. కాల్పుల మార్పిడి మరోసారి ఉద్రిక్తతలను పెంచింది. కలహాలతో దెబ్బతిన్న రాష్ట్రంలోని ప్రజలలో భయాందోళనలకు కారణమైంది. మయన్మార్‌ సరిహద్దు వెంబడి ఉన్న మోరే, భద్రతా బలగాలపై, ముఖ్యంగా మణిపూర్‌ పోలీసు కమాండోలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన వరుస దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నారు. తుపాకీ కాల్పులు తొలుత ఆదివారం ఆలస్యంగా చెలరేగాయి. సోమవారం ఉదయం, మధ్యాహ్నం తిరిగి ప్రారంభమయ్యాయి. కాగా, మోరెలో కొనసాగుతున్న కాల్పులు ఇక్కడి గ్రామస్థులు తమ ఇండ్లను ఖాళీ చేయటానికి దారితీశాయి. అనేక ప్రదేశాలలో కాల్పులు జరిగినట్టు పలు వార్తలు వస్తున్నాయి. ”న్యూ మోరే, లాంగ్కిచోరు, జియోన్‌ వెంగ్‌లోని మూడు చోట్ల సోమవారం కాల్పులు జరిగాయి. మిలిటెంట్లు భద్రతా బలగాలుగా నటిస్తూ నాతో సహా కుకి గ్రామాలపై కాల్పులు జరిపారు. కాల్పులు ప్రారంభం కాగానే దాదాపు 200 మంది గ్రామస్తులు ఇండ్ల నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం పట్టణంలోని మరో ప్రాంతంలో ఉన్న భవనంలో ఉంటున్నాం. కాల్పులు ఆగిపోయాయని మాకు తెలిసింది. అయితే ఎదురుకాల్పుల్లో చిక్కుకోవటం ఇష్టం లేదు కాబట్టి మేము తిరిగి రావడం లేదు” అని మోరే యొక్క హిల్‌ ట్రైబల్‌ కౌన్సిల్‌ యూనిట్‌ 8 (న్యూ మోరే) చైర్మెన్‌ కె.మిన్లున్‌ టౌతాంగ్‌ అన్నారు.