– సీఆర్పీఎఫ్ జవాన్ మృతి, మరో జవాన్‌కు తీవ్ర గాయాలు
– పలువురు మావోయిస్టులకు గాయాలు
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు చత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెద్రే సీఆర్పీఎఫ్ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపే లోపే సీఆర్పీఎఫ్ 165 బెటాలియన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మావోయిస్టుల బులెట్‌కు మృతిచెందారు. రాము అనే మరో సీఆర్పీఎఫ్ జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన రామును హెలికాప్టర్ ద్వారా రాయపూర్ పంపించి మెరుగైన వైద్యం అందించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఆత్మ రక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో కొంతమంది మావోయిస్టులు సైతం గాయపడినట్టు పోలీసులు ధృవీకరించారు. వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్ మృతికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించి తన సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే సుక్మా జిల్లా ధర్మంపేట సీఆర్పీఎఫ్ క్యాంపు సమీపంలో మందుపాతర పేల్చి హల్‌చల్ సృష్టించారు.