తొలిరోజు 35 ఓవర్లే!

35 overlays on the first day!– వెలుతురు లేమి, వర్షంతో సాగని ఆట
– బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 107/3
– భారత్‌, బంగ్లాదేశ్‌ రెండో టెస్టు
ఊహించినట్టుగానే కాన్పూర్‌ టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. రాత్రి కురిసిన వర్షంతో ఉదయం టాస్‌ గంట ఆలస్యం కాగా.. మధ్యాహ్నం కారు మబ్బులతో వెలుతురు లేమి, ఆపై భారీ వర్షంతో తొలి రోజు ఆట సాగలేదు. రెండు సెషన్లలో 35 ఓవర్ల సాధ్యపడగా.. బంగ్లాదేశ్‌ 107 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. నేడు ఉదయం ఆట 30 నిమిషాల ముందుగానే ఆరంభం కానుంది.
నవతెలంగాణ-కాన్పూర్‌
వెలుతురు లేమి, భారీ వర్షంతో భారత్‌, బంగ్లాదేశ్‌ కాన్పూర్‌ టెస్టు తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 107/3 పరుగులు చేసింది. మోమినుల్‌ హాక్‌ (40 నాటౌట్‌, 81 బంతుల్లో 7 ఫోర్లు) అజేయ ఇన్నింగ్స్‌తో మెప్పించగా.. షాద్‌మాన్‌ ఇస్లాం (24, 36 బంతుల్లో 4 ఫోర్లు), నజ్ముల్‌ శాంటో (31, 57 బంతుల్లో 6 ఫోర్లు) మంచి ఆరంభాలను దక్కించు కున్నారు. జాకిర్‌ హసన్‌ (0) డకౌట్‌ కాగా.. ముష్ఫీ కర్‌ రహీమ్‌ (6 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో యువ పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ (2/34), రవిచంద్రన్‌ అశ్విన్‌ (1/22) వికెట్లు పడగొట్టారు. తొలి రోజు 55 ఓవర్ల ఆట నష్టపోగా.. నేడు మ్యాచ్‌ ఓ అర గంట ముందుగానే షురూ కానుంది.
ఆకాశ్‌ డబుల్‌ స్ట్రోక్‌
యువ పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ అదరగొట్టాడు. పేస్‌కు అనుకూలించే పరిస్థితుల్లో బుమ్రా, సిరాజ్‌ కొత్త బంతితో దాడి చేసినా బంగ్లాదేశ్‌ వికెట్‌ కోల్పోలేదు. ఆకాశ్‌ దీప్‌ బంతి అందుకోగా.. భారత్‌కు బ్రేక్‌ అందించాడు. ఓపెనర్‌ జాకిర్‌ హసన్‌ (0)ను స్లిప్స్‌లో డకౌట్‌గా సాగనంపాడు. యశస్వి జైస్వాల్‌ సూపర్‌ క్యాచ్‌తో జాకిర్‌ హసన్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. మరో ఓపెనర్‌ షాద్‌మాన్‌ ఇస్లాం (24) సైతం ఆకాశ్‌ దీప్‌ ఉచ్చులో పడ్డాడు. కండ్లుచెదిరే బంతితో ఇస్లాంను ఎల్బీడబ్ల్యూగా ఆకాశ్‌ అవుట్‌ చేశాడు. 26/0తో ఉన్న బంగ్లాదేశ్‌ ఆకాశ్‌ దెబ్బకు 29/2తో ఒత్తిడిలో పడింది. ఇస్లాం నాలుగు ఫోర్లతో మెరిసినా.. ఎంతోసేపు వికెట్‌ కాపాడుకోలేదు. కెప్టెన్‌ నజ్ముల్‌ శాంటో (31), మోమినుల్‌ హాక్‌ (40 నాటౌట్‌) మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నిర్మించారు. 51 పరుగులతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ మాయ ముంగిట నజ్ముల్‌ బోల్తా కొట్టాడు. దీంతో బంగ్లాదేశ్‌ 30 ఓవర్లలోపే మూడో వికెట్‌ కోల్పోయింది. లంచ్‌ విరామ సమయానికి 26 ఓవర్లలో 74/2తో నిలిచిన బంగ్లాదేశ్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో 107/3 పరుగులు చేసింది. లంచ్‌ తర్వాత తొలుత వెలుతురు లేమితో ఆట నిలిచిపోగా.. ఆ తర్వాత కుండపోత వర్షంతో అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేశారు.
భిన్న వ్యూహం
కాన్పూర్‌ పిచ్‌ను భారత్‌, బంగ్లాదేశ్‌ విరుద్ధంగా అర్థం చేసుకున్నాయి. మేఘావృత వాతావరణంలో నల్ల మట్టి పిచ్‌పై భారత్‌ ముగ్గురు పేసర్లను తుది జట్టులోకి తీసుకోగా.. బంగ్లాదేశ్‌ ముగ్గురు స్పిన్నర్లను ఎంచుకుంది. టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. బంగ్లాదేశ్‌ టాస్‌ నెగ్గితే బ్యాటింగ్‌ ఎంచుకునేందుకు సిద్ధపడింది. నల్లమట్టి పిచ్‌ స్పిన్‌కు అనుకూలం, కానీ మూడు రోజుల పాటు వర్షం సూచనలతో భారత్‌ ముగ్గురు సీమర్లకు ఓటేసింది.
బంగ్లా అభిమానిపై దాడి?
బంగ్లాదేశ్‌ వీరాభిమాని ‘టైగర్‌ రూబీ’పై కాన్పూర్‌లో దాడి జరిగిందని తెలుస్తోంది. మ్యాచ్‌ ఆరంభం కాగానే రూబీని కొందరు దురభిమానులు దూషించటం మొదలెట్టారని సమాచారం. వెన్ను, ఉదర భాగంలో కొట్టారని రూబీ పోలీసులకు తెలిపినా.. దాడికి సంబంధించిన దృశ్యాలు ఎక్కడా కనిపించలేదు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న రూబీని పోలీసులు తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
నేడూ భారీ వర్షం
కాన్పూర్‌ టెస్టును వరుణుడు వీడే చాన్స్‌ కనిపించటం లేదు. శనివారం ఉదయం నుంచే ఇక్కడ భారీ వర్షం సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో నేడు కూడా పూర్తి ఆట సాధ్యపడే అవకాశం లేదు. ఆదివారం సైతం వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు లేవు. తొలి మూడు రోజుల ఆటకు వర్షం ఆటంకం అనివార్యంగా కనిపిస్తోంది.
స్కోరు వివరాలు
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: జాకిర్‌ హసన్‌ (సి) యశస్వి (బి) ఆకాశ్‌ దీప్‌ 0, షాద్‌మాన్‌ ఇస్లాం (ఎల్బీ) ఆకాశ్‌ దీప్‌ 24, మోమినుల్‌ హాక్‌ నాటౌట్‌ 40, నజ్ముల్‌ శాంటో (ఎల్బీ) అశ్విన్‌ 31, ముష్ఫీకర్‌ రహీమ్‌ నాటౌట్‌ 6, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (35 ఓవర్లలో 3 వికెట్లకు) 107.
వికెట్ల పతనం: 1-26, 2-29, 3-80.
బౌలింగ్‌: జశ్‌ప్రీత్‌ బుమ్రా 9-4-19-0, మహ్మద్‌ సిరాజ్‌ 7-0-27-0, రవిచంద్రన్‌ అశ్విన్‌ 9-0-22-1, ఆకాశ్‌ దీప్‌ 10-4-34-2.