– ఆకాశ్ దీప్‌కు మూడు వికెట్లు
– రూట్ సెంచరీ – ఇంగ్లండ్ 302/7
రాంచీ: నాల్గోటెస్ట్‌లో టీమిండియా బౌలర్లు ఏడు వికెట్లు పడగొట్టగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ సెంచరీతో కదం తొక్కాడు. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆట చివరికి ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మన్ జో రూట్ సెంచరీ సాధించి అజేయంగా నిలవడం విశేషం. రూట్ కు ఇది కెరీర్ లో 31వ టెస్టు సెంచరీ. టీమిండియా కొత్త పేసర్ ఆకాశ్ దీప్ ధాటికి 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టును జో రూట్ ఆదుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ బెన్ ఫోక్స్ తో కలిసి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. బెన్ ఫోక్స్ 126 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఈ జోడీని సిరాజ్ విడదీశాడు. బెన్ ఫోక్స్ ను అవుట్ చేసిన సిరాజ్… ఆ తర్వాత టామ్ హార్ట్ లేను పెవిలియన్ చేర్చాడు. దాంతో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్న రూట్… ఓల్లీ రాబిన్సన్ తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రూట్ 106 పరుగులతోనూ, రాబిన్సన్ 31 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. రూట్ మొత్తం 223 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు కొట్టాడు. టీమిండియా బౌలర్లలో ఆకాశ్ దీప్ 3, సిరాజ్ 2, జడేజా 1, అశ్విన్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న ఆకాశ్ దీప్ మూడు వికెట్లతో ఇంగ్లండ్ టాపార్డర్ ను దెబ్బతీశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు జాక్ క్రాలే 42, బెన్ డకెట్ 11 పరుగులు చేశారు. ఓల్లీ పోప్ (0) డకౌట్ కాగా, జానీ బెయిర్ స్టో 38 పరుగులతో ఓ మోస్తరుగా రాణించాడు . కెప్టెన్ బెన్ స్టోక్స్ (3) నిరాశపరిచాడు.
స్కోర్‌బోర్డు…
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలే (బి)ఆకాశ్ దీప్ 42, డకెట్ (సి)ధృవ్ జురెల్ (బి)ఆకాశ్ దీప్ 11, పోప్ (ఎల్‌బి)ఆకాశ్ దీప్ 0, రూట్ (బ్యాటింగ్) 106, బెయిర్‌స్టో (ఎల్‌బి)అశ్విన్ 38, బెన్ స్టోక్స్ (ఎల్‌బి)జడేజా 3, ఫోక్స్ (సి)జడేజా (బి)సిరాజ్ 47, హార్ట్‌లీ (బి)సిరాజ్ 13, రాబిన్సన్ (బ్యాటింగ్) 31, అదనం 11. (90ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 302పరుగులు.
వికెట్ల పతనం:
1/47, 2/47, 3/57, 4/109, 5/112, 6/225, 7/245
బౌలింగ్:
సిరాజ్ 13-3-60-2, ఆకాశ్ దీప్ 17-0-70-3, జడేజా 27-7-56-1, అశ్విన్ 22-1-83-1, కుల్దీప్ 10-3-21-0, జైస్వాల్ 1-0-6-0
ఆకాశ్‌దీప్ అరంగేట్రం..
బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అరంగేట్రం టెస్టులో అంచనాలకు మించి రాణించాడు. ఇంగ్లండ్ టాపార్డర్‌ను కకావికలం చేసి తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు.
బుల్లెట్ లాంటి బంతులతో తొలి మూడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. బుమ్రా స్థానాన్ని భర్తీ చేస్తూ సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. రాంచీలో అతడి స్పెల్ చూసినవాళ్లంతా మరో ఫాస్ట్ బౌలర్ దొరికాడంటూ ఆకాశ్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు.