మొదటి మహిళా విండ్‌సర్ఫర్‌

కాత్యా ఇడా కోయెల్హో… గోవాలో పుట్టి పెరిగిన ఈమె 2014లో యూత్‌ ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి, ఏకైక భారతీయ నావికురాలు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌కు మన దేశం నుండి రెండవ సారి ప్రాతినిధ్యం వహించబోతున్న సందర్భంగా ఆమె పరిచయం నేటి మానవిలో…
శారీరక పటుత్వం అవసరం
”నా తండ్రిని చూస్తూ పెరిగాను. తర్వాత కాలంలో ఆ అభిరుచినే వృత్తిగా మార్చుకున్నాను. విండ్‌సర్ఫింగ్‌ ఓ సాహస క్రీడ. సవాలుగా ఉంటుంది. మన చుట్టూ ఉండే పరికరాలను నిర్వహించడానికి చాలా బలం అవసరం. అందుకే ఈ క్రీడకు శారీరక పటుత్వం చాలా అవసరం. వీటితో పాటు వాతావరణం, సముద్ర నీటి పరిస్థితులపై మంచి అవగాహన ఉండాలి. క్రీడలో నైపుణ్యం ఉన్నంత మాత్రాన మనం గెలవేము. నైపుణ్యంతో పాటు మనకు సహకరించే పరికరాలు కూడా చాలా అవసరం” అని ఆమె చెప్పారు.
మెరిసే నీలి సముద్రంలో 11 ఏండ్ల కాత్యా మొదటిసారిగా విండ్‌సర్ఫ్‌ చేయాలని నిర్ణయించుకుంది. ఆ బోర్డ్‌పై నిలబడినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటు ఆమెలో భయం, ఉత్సాహం కలగలిసి ఉన్నాయి. ధృడమైన ఆత్మ విశ్వాసంతో ఒక స్తంభం లాంటిదాన్ని పట్టుకొని తాను చేరాల్సిన గమ్యంవైపు చూసింది. గాలులతో పోరాడటానికి తన కండరాల బలాన్ని పెంచుకుంది. తన పట్టును బిగించింది. గోవాలో విపరీతమైన ఎండ రోజున సర్ఫింగ్‌ పట్ల తనకెంత అభిరుచి వుందో నిరూపించుకుంది.
నీరు నా ఇల్లు
   ”ఆ క్షణంలో నన్ను నేనూ సముద్రంలో ఓ భాగంగా భావించాను. ఇది నా లక్ష్యాన్ని రూపొందించిన సంతోషకరమైన అనుభవం. నీటిలో నేను సౌకర్యంగా ఉన్నాను. అయితే మొదటిసారి విండ్‌సర్ఫ్‌ చేసినప్పుడు చాలా భయపడ్డాను. సర్ఫింగ్‌ ప్రారంభించిన కొత్తలో నాకు దగ్గరగా వచ్చిన జెల్లీ ఫిష్‌, డాల్ఫిన్‌లను చూసి కొంచెం భయపడ్డాను. అయితే ఇప్పుడు నీరు నా ఇల్లుగా మారింది” అని ఆమె చెప్పారు.
ప్రస్తుతం 23 ఏండ్ల కాత్యా 2014లో యూత్‌ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి, ఏకైక భారతీయ నావికురాలు. 2018లో ఆసియా క్రీడల్లో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2022లో థాయిలాండ్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ విండ్‌సర్ఫింగ్‌ కప్‌లో రెండవ స్థానాన్ని సంపాదించారు. ఈ ఏడాది సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు చైనాలోని హాంగ్‌జౌలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు.
లోతుగా మునిగిపోతుంది
కాత్యా ఊహతెలిసిన నాటి నుంచి సముద్రాన్ని ప్రేమిస్తూనే ఉంది. ఆమె తండ్రి డొనాల్డ్‌ కోయెల్హో మూడుసార్లు జాతీయ ఛాంపియన్‌. అలాగే అన్న డేన్‌ కోయెల్హో కూడా విండ్‌సర్ఫ్‌ క్రీడాకారుడు. తండ్రితో పాటు టోర్నమెంట్‌లు, ప్రాక్టీస్‌ సెషన్‌లకు క్రమం తప్పకుండా హాజరయ్యేది. ”ఎగిసి పడుతున్న అలల మధ్య నాన్న అప్రయత్నంగా ప్రయాణించిన విధానం ఆ క్రీడ పట్ల నాలో ఓ కొత్త ఆసక్తిని రేకెత్తించింది” అంటూ ఆమె గుర్తు చేసుకున్నారు. వేసవి సెలవుల్లో విండ్‌సర్ఫింగ్‌ని ఆమె ఎక్కువగా ఆస్వాదించేవారు.
ప్రతిరోజూ సాహసమే
ప్రతి ప్రదేశానికి దాని సొంత ప్రత్యేకమైన వాతావరణం, నీటి పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ఒక అథ్లెట్‌ తప్పనిసరిగా కొత్త వాతావరణాలకు అను గుణంగా ఉండగలరని ఆమె నొక్కి చెబు తున్నారు. దీని కోసం ఈవెంట్‌కు కొన్ని రోజుల ముందే పోటీ జరిగే ప్రదేశంలో ఆమె ప్రాక్టీస్‌ చేస్తారు. ”విండ్‌సర్ఫింగ్‌లో అన్ని రోజులు ఒకేలా ఉండవు. ప్రతిరోజూ మనకు సాహసం లాంటిదే. నేను క్రీడలో ఈ థ్రిల్‌ను కచ్చితంగా ఇష్టపడతాను” అంటున్నారు కాత్యా.
సవాళ్లు ఎదుర్కొంది
ఈ క్రీడను కొనసాగించడానికి ఆమె అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. 2018 ఆసియా క్రీడల సందర్భంగా యూనివర్సల్‌ జాయింట్‌ (పరికరంలో ఒక భాగం) విరిగిపోయింది. ఇది ఆమె బోర్డు నుండి పడిపోయింది. ఆ ప్రమాదంలో ఆమె రెండు మోకాళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి. కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. విండ్‌ ఫాయిలింగ్‌తో వేగంగా వెళ్ళడానికి గాలి దిశలో వేగాన్ని పెంచడానికి అథ్లెట్‌ మరింత కండరాల బరువును పెంచుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు ఆమె. కండరాల బరువును నిర్మించడానికి నిరంతర ప్రయత్నాలు, సమయం అవసరం. ఈ క్రీడలో మహిళల భాగస్వామ్యం లేకపోవడం ఆమెకు మరో సవాలు. దాంతో ఆమె చాలాసార్లు పురుషుల విభాగంలో పాల్గొనవలసి వచ్చింది. అయితే తాను ఆసియా గేమ్స్‌లో పాల్గొనడం వల్ల ఇతర మహిళలు కూడా ఈ క్రీడ పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుందని ఆమె అంటున్నారు.
ముందుకు సాగుతోంది
ఆసియా క్రీడలు సమీపిస్తున్న కొద్దీ కాత్యా తన సన్నాహాలు ముమ్మరం చేశారు. కండరాల బలాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తూ, వ్యాయామానికి, విండ్‌సర్ఫింగ్‌ ప్రాక్టీస్‌కు రెండు గంటల చొప్పున సమయం కేటాయిస్తున్నారు. గాలి బలంగా వీచే సమయంలో కూడా సర్ఫ్‌ చేయగల నైపుణ్యం సంపాదించడం తన లక్ష్యంగా పెట్టుకున్నారు. గోవాలో రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి కాత్యా శిక్షణ కోసం ఇటలీ వెళ్లింది. 2024లో పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో కూడా ఆమె పాల్గొంటున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌ ఆగస్టు 10 నుంచి 20 వరకు నెదర్లాండ్స్‌లో జరగాల్సి ఉంది. కొత్త సెయిల్‌ కూడా కొనుగోలు చేశారు. అయితే ఆసియా క్రీడల కోసం రూ. 10 నుంచి 12 లక్షల వరకు ఖర్చయ్యే పరికరాల కొనుగోలు కోసం తనకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. ”రాబోయే పోటీలలో నా ప్రదర్శనలతో దేశం గర్వపడేలా చేస్తాను. తద్వారా ఈ క్రీడలో మరింత మంది మహిళలకు అవకాశం కల్పించగలనని నేను ఆశిస్తున్నాను” అంటూ ఆమె తన మాటలు ముగించారు.