దేశంలో మొదటిసారి గ్రీన్‌ ప్రాపర్టీ షో

– హైదరాబాద్‌లో జులై 28 నుంచి 30 వరకు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలోనే మొదటిసారిగా గ్రీన్‌ ప్రాపర్టీ షోను హైదరాబాద్‌ ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండిస్టియల్‌ ఇండిస్టీ (సీఐఐ) అనుబంధ విభాగం ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) హైదరాబాద్‌ చాప్టర్‌ కో చైర్మెన్‌ శ్రీనివాసమూర్తి, సీఐఐ-ఐజీబీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.ఎస్‌.వెంకటగిరి, ఐజీబీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం.ఆనంద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరిత భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టేలా కొనుగోలుదారులకు అవగాహన కల్పించడం, ఆ దిశగా ప్రేరేపించడం తమ షో లక్ష్యమని తెలిపారు. ఈ ప్రదర్శనలో నిర్మాణ ఉత్పత్తులు, సేవలు, గ్రీన్‌ రెసిడెన్షియల్‌ ప్రాపర్టీలను చూడవచ్చని చెప్పారు. ప్రదర్శన డెవలపర్లు, పర్యావరణ అవగాహన కలిగిన కొనుగోలుదారుల మధ్య సంబంధాలను మరింత పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఐఐ తెలంగాణ చైర్మెన్‌ సి.శేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సచివాలయ ప్రాంగణం, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం తదితర నిర్మాణాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు.