అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సారథ్యంలోని బ్లూ ఆరిజిన్ ప్రైవేట్ సంస్థ ఔత్సాహికులను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ఏడో హ్యూమన్ ఫ్లైట్ న్యూ షెపర్డ్-25 వ్యోమనౌక మే 19వ తేదీ అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ లాంచ్ సైట్ నుంచి అంతరిక్షంలోకి బయలుదేరింది. 11 నిమిషాలకుపైగా అంతరిక్షంలో విహరించి, క్షేమంగా వెనక్కి తిరిగివచ్చింది. ఈ రాకెట్‌లో ప్రయాణించిన ఆరుగురిలో గోపీ తోటకూర ఒకడు.
అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన తొలి భారత స్పేస్ టూరిస్టుగా ఘనత సాధించాడు గోపీ తోటకూర. 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ మొట్టమొదటిసారి అంతరిక్ష ప్రయాణం చేశాడు. ఆ తరువాత 40 ఏండ్లకు అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డు సష్టించాడు మన తెలుగు తేజం. మొత్తం 11 నిమిషాల పాటు సాగిన ఈ యాత్ర.. ధ్వని కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించారు. కర్మన్ లైన్‌ను దాటి కొన్ని నిమిషాల పాటు భారరహిత స్థితిని అనుభవించారు.
మూడు పదుల వయసులోనే
మూడు పదుల వయసు దాటకముందే భారతీయ విమానాలు, విదేశీ జెట్‌లు, వైద్య విమానాలను వేల గంటలు నడిపిన ఘనతను సాధించాడు. విమానాలే కాకుండా సీప్లేన్, హాట్‌ఎయిర్ బెలూన్ పైలట్‌గా గోపీచంద్‌కు గుర్తింపు ఉంది. గోపీ తోటకూర ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. పర్వతారోహకుడిగా దక్షిణాఫ్రికాలోని కిలిమంజారోను అధిరోహించడం అతని చాలా ఇష్టమైన పని. ప్రిజర్వ్ లైఫ్ కార్పొరేషన్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా సేవలందించాడు. పైలట్‌గా శిక్షణ పొందిన గోపీ… ఇంటర్నేషనల్ మెడికల్ జెట్ పైలట్‌గా పని చేస్తున్నారు. గోపీకి సాహసాలంటే ప్రాణం. ఇటీవలే టాంజానియాలోని అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్ కిలిమంజారోను అధిరోహించారు.
అందివచ్చిన అవకాశం
అవకాశాలు అందరికీ రావు. కఠోర శ్రమ, కార్యదీక్ష, పట్టుదల కలిగిన వారిని అవకాశాలు వెతుకుంటూ వస్తాయి. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారు చాలా కొద్దిమందే ఉంటారు. అలా చేయగల్గిన వారే విజయం సాధిస్తారు. తమ లక్ష్యాన్ని సాధిస్తారు. బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా ఇప్పటిదాకా 31 మంది స్పేస్ టూరిస్టులు అంతరిక్ష ప్రయాణం చేశారు. భూవాతావరణం, ఔటర్‌స్పేస్ సరిహద్దు రేఖ అయిన కర్మాన్ లైన్ పైభాగం వరకు వీరి ప్రయాణం సాగింది. అంతరిక్షాన్ని తాకి వచ్చారు. భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్లలో కర్మాన్ లైన్ ఉంటుంది.
ఆ ఆరుగురు ఎవరంటే
తాజా యాత్రలో గోపీచంద్‌తోపాటు వెంచర్ క్యాపిటలిస్ట్ మేసన్ ఏంజెల్, ఫ్రాన్స్ పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహస యాత్రికురాలు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ పాల్గొన్నారు. డ్వైట్ 1961లో అంతరిక్షయానానికి ఎంపికైన తొలి ఆఫ్రో అమెరికన్ వ్యోమగామి. వివిధ కారణాల వల్ల ఆయనకు రోదసిలోకి వెళ్లే అవకాశం రాలేదు. ఇప్పుడు 90 ఏండ్ల వయసులో ఆ కల నెరవేరింది. రోదసియాత్ర చేసిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు.
కుటుంబం
భారతదేశ తొలి స్పేస్ టూరిస్టు గోపీచంద్ తోటకూర విజయవాడ వాసి. మూడు పదుల వయసు దాటకముందే భారతీయ విమానాలు, విదేశీ జెట్‌లు, వైద్య విమానాలను వేల గంటలు నడిపిన ఘనతను ఆయన సాధించాడు. విమానాలే కాకుండా సీప్లేన్, హాట్‌ఎయిర్ బెలూన్ పైలట్‌గా గోపీచంద్‌కు గుర్తింపు ఉంది. నగర శివారు పోరంకిలోని వందడుగుల రోడ్డులో ఆయన నానమ్మ తాతయ్యలు స్వర్ణలత, భూమయ్య ఉంటున్నారు. తండ్రి విజయకుమార్, తల్లి పద్మజలకు గోపీచంద్‌తోపాటు మరో కుమారుడు మేఘశ్యామ్ ఉన్నారు. 1993లో పుట్టిన గోపీచంద్ విశాఖలోని టింఫనీ, దిల్లీలోని సంస్కతి, బాలభారతి ఎయిర్‌ఫోర్స్ పాఠశాలలు, హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌జ్యోతిలో చదువుకున్నారు. బెంగళూరులోని సరళాబిర్లా కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. అనంతరం అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఉత్తమ విద్యాసంస్థ ఎంబ్రీరిడిల్ ఏరోనాటికల్ విశ్వవిద్యాలయంలో ఏరోనాటికల్ సైన్స్‌లో డిగ్రీ చేశాడు. అక్కడే కమర్షియల్ పైలట్‌గా శిక్షణ తీసుకుని లైసెన్సు పొందాడు. ఆ తర్వాత యూకేలోని ఎమిరేట్స్, కొవెంట్రీ విశ్వవిద్యాలయాలలో ఏవియేషన్‌లో ఎంబీఏ చేశాడు. బిజినెస్ జెట్స్, మెడికల్ ఫ్లెట్స్‌ను దేశ విదేశాల్లో నడిపాడు. ప్రస్తుతం అమెరికా కేంద్రంగా ప్రిజర్వ్ లైఫ్ కార్పొరేషన్ పేరుతో అన్ని సౌకర్యాలతో కూడిన వెల్‌నెస్ రిసార్టును నిర్వహిస్తున్నాడు. బ్లూ ఆరిజిన్ అధికారికంగా ప్రకటించే వరకు అంతరిక్షంలోకి వెళ్తున్నట్టు తన కుటుంబానికి అతడు తెలియజేయలేదు.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417