– అవసరమైతే ఆయనకు శిక్షణనిప్పించండి…
– డిప్యూటీ సీఎంకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భాష గురించి మాట్లాడేముందు సీఎం రేవంత్‌రెడ్డి వాడే భాష గురించి చర్చిస్తే బావుంటుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద… డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సూచించారు. అవసరమైతే రేవంత్‌కు… ఏఐసీసీ పెద్దలతో భాషపై శిక్షణనిప్పించాలని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం కూడా ఆయనకు ట్రైనింగ్ ఇవ్వొచ్చని వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివేకానంద మాట్లాడుతూ… సీఎం, మంత్రులు సత్యదూరమైన మాటలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వ్యక్తిగత దూషణ భాషణలకు దిగుతున్నారని గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా రేవంత్ నీచంగా, ఘోరంగా మాట్లాడుతున్నారని వాపోయారు. అందువల్ల ముందుగా ఆయన తన భాషను మార్చుకుంటే అందరూ స్వాగతిస్తారని అన్నారు. అలాంటి మంచి సంప్రదాయాన్ని నెలకొల్పాలంటూ సీఎంకు సూచించారు. ఆరు గ్యారెంటీలను పక్కకుబెట్టిన కాంగ్రెస్ నేతలు, మంత్రులు… ఫోన్ ట్యాపింగ్ విషయాలను ముందుకు తెస్తున్నారని విమర్శించారు. సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే, వారికి ధైర్యం చెప్పలేని సీఎం, మంత్రులు తప్పించుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఏప్రిల్ కూడా రాకముందే హైదరాబాద్‌లో నీటి ఎద్దడి ప్రారంభమైందని వివేకానంద ఆందోళన వ్యక్తం చేశారు.