– ముగిసిన స్క్రీనింగ్ కమిటీ భేటీ
– వాడివేడిగా చర్చ…వాగ్వాదం
– కేంద్ర స్క్రీనింగ్ కమిటీకి నివేదిక
– అభ్యర్థుల ఎంపికలో సునీల్ కనుగోలు నిర్ణయమే కీలకం!
– ఆశావహులకు నచ్చజెప్పిన తర్వాతే జాబితా విడుదల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీపీసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ భేటీ ముగిసింది. రెండు రోజులుగా అభ్యర్థులపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులపై తీవ్రమైన కసరత్తు చేసింది. కొన్నింటిపై ఏకాభిప్రాయం కుదిరినా…చాలా నియోజకవర్గాలకు ఎంపిక చేసే విషయంలో భిన్నాభిప్రాయాలొచ్చాయి. తమ అనుయాయుల పేర్లు చెప్పేందుకు నేతలు ఎక్కువ ఉత్సాహం చూపినట్టు తెలిసింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క మధ్య వాడివేడిగా చర్చ జరిగినట్టు తెలిసింది. అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో తేలకుండానే ఎంపీ అభ్యర్థుల విషయంలో లీకులు ఎందుకిస్తున్నారంటూ ఉత్తమ్ అనడం తీవ్ర చర్చకు దారితీసినట్టు తెలుస్తోంది. మధుయాస్కీగౌడ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇద్దరూ బీసీలకు ఎక్కువగా సీట్లు కేటాయించాలని పట్టుపట్టినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. సర్వేల ప్రాతిపదికన అభ్యర్థులను ఖరారు చేయడంతోపాటు సామాజికవర్గం, అత్యంత కీలకమైన ఆర్థికాంశాలపై కూడా చర్చోపచర్చలు జరిగాయి. అంచనా లేకుండా బలహీనమైన అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా అసలుకే మోసం వస్తుందని భావిస్తున్నారు. అభ్యర్థుల విషయంలో సునీల్ కనుగోలు నిర్ణయమే కీలకంగా మారనుందనే సంకేతాలు ఇచ్చారు. ఒక్కసారి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వెనక్కి తీసుకోలేమంటూనే, అనివార్యమైతే అభ్యర్థులను మార్చాల్సి రావచ్చు అని సునీల్ కనుగోలు సూచించినట్టు తెలిసింది. ఖమ్మంలో బలమైన అభ్యర్థులు పార్టీలో చేరినప్పటికీ వారికి టికెట్లు కేటాయింపు అంత సులువుగా తేలేట్టు లేదని తెలుస్తోంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన నేతలు కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందో, ఉండదో కూడా తేల్చాలని కోరినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. మీలో మీరు పంచాయతీ పెట్టుకోకుండా ముందు మీరు ఐక్యంగా ఉండాలంటూ స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ మురళీధర్ హెచ్చరించినట్టు తెలిసింది. కాంగ్రెస్‌లో టికెట్టు ఆశించి భంగపడిన వారు బీజేపీలో చేరే అవకాశం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అభ్యర్థులను ప్రకటించే ముందుకు వారి మధ్య సర్దుబాటు కుదుర్చాలని సూచించారు. ఎవరికి టికెటు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఉండాలనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని అందరూ అభిప్రాయపడ్డారు. స్క్రీనింగ్ కమిటీ తర్జనభర్జనల మధ్య దాదాపు 40 నుంచి 45 నియోజకవర్గాలకు ఒకే పేరు పంపించినట్టు తెలుస్తోంది. తదుపరి పరిశీలన తర్వాత సెప్టెంబర్‌లో ప్రకటించే అవకాశం ఉన్నది.
అభ్యర్థుల జాబితా విడుదల బాధ్యత అధిష్టానానిదే : ఠాక్రే
అభ్యర్థుల జాబితా దశలవారీగా విడుదల చేయాలా? లేదా ఒకేసారి విడుదల చేయాలా? అనే విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే వెల్లడించారు. స్క్రీనింగ్ కమిటీ అన్ని విషయాలను చర్చించిందన్నారు. టికెటు రాలేదని ఎవరూ బాధపడొద్దనీ, అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని ఆయన చెప్పారు.