– ముగిసిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం వచ్చిన వెయ్యి దరఖాస్తులను పరిశీలించేందుకు మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయ సేకరణ చేపట్టింది.ఇందుకోసం రెండు రోజులు గాంధీభవన్‌లో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ…బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన ఈ సమావేశమైంది. స్క్రీనింగ్ కమిటీ సభ్యులంతా హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తుది దశకు చేరుకుంది. నేడు తుది నివేదిక రూపొందించడం జరగనుంది. సాయంత్రం సీల్డ్ కవర్లో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీకి, స్క్రీనింగ్ కమిటీ నివేదికను అందించనుంది. ఇప్పటికే దాదాపు 30 మంది సభ్యుల పేర్లు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థులపైనా చర్చించింది. త్వరలోనే అన్ని నియో జకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ వెలువరించనున్నట్టు సమాచారం. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ దరఖాస్తులపై ఇప్పటి వరకు తాము చర్చించిన అంశాలను స్క్రీనింగ్ కమిటీ ముందుంచింది. అయినా స్క్రీనింగ్ కమిటీ ప్రత్యేకంగా పీఈసీ సభ్యులతో మరోసారి అభిప్రాయాలు తీసుకుంది.కమిటీకి వచ్చిన అభిప్రాయాలపై సమగ్రంగా చర్చించింది. తుదకు ప్రతి నియోజకవర్గం నుంచి మూడు పేర్లను ఖరారు చేసేందుకు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి అందించనుంది. సెప్టెంబర్ మూడోవారంలో కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ రెండోవారంలో రెండో జాబితా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది.