ఇంగ్లీషు సాహిత్యంలోనే 1936 లో మార్గరెట్ మిట్చెల్ రాసిన ‘గాన్ విత్ ది విండ్’ నవలకి గొప్ప పేరు ఉంది. దీన్ని సినిమాగా 1939లో తీసారు. ప్రపంచ సినిమాలోనే ఓ గొప్ప చిత్రంగా ఇది శాశ్వతంగా మిగిలిపోయింది. ఈ సినిమాలో రెట్ బట్లర్ పాత్రకు క్లార్క్ గాబెల్‌ను తీసుకోవడానికి రెండు సంవత్సరాలు ఆగారంటే ఎక్కడా రాజీ పడకుండా నటుల ఎంపిక ఎంత జాగ్రత్తగా జరిగిందో అర్ధం చెసుకోవచ్చు. ఇక స్కార్లెట్ పాత్రకు పద్నాలుగు వేల మంది స్త్రీలకు స్క్రీన్ టెస్ట్ చేసి చివరకు వివియన్‌లీ ని ఎంపిక చేశారు. ఎమ్.జీ.ఎమ్.తో కాంట్రాక్టులో ఉన్న క్లార్క్ గేబల్ కోసం ఆగి ఆ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుని ఈ సినిమా షూటింగ్ మొదలెట్టారట. అప్పట్లో అన్ని బాక్సాఫీసు రికార్డులను బద్దలు చేసిన ఈ చిత్రం ప్రపంచ సినిమాలోనే అతి పెద్ద సంచలనంగా నమోదయ్యింది. పైగా పదమూడు విభాగాలలో ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయి పది అవార్డులు గెలుచుకుని విజయఢంకా మోగించింది. నల్ల జాతీయురాలిగా స్కార్లెట్ ఇంట బానిసగా చేరి ఆమెను తల్లిగా చివరి దాకా కాచుకున్న మామీ పాత్రలో నటించిన హాటీ మెక్ డానియల్‌కు ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ లభించింది. అలా ఓ నల్లజాతీయురాలికి మొదటిసారి ఆస్కార్ సంపాదించి పెట్టిన చిత్రంగా ఇది రికార్డుకెక్కింది.
1861 వ సంవత్సరకాలంలో సినీ కథ మొదలవుతుంది. జార్జియాలో టారా అనే పత్తితోట యజమాని గెరాల్డ్ ఓ హారా కు ముగ్గురు కూతుర్లు. పెద్ద కూతురు స్కార్లెట్ ఓ హారా విశిష్టమైన వ్యక్తిత్వం గల స్త్రీ. ఆమె మహా పట్టుదల గలది. తన జీవితాన్ని తానే నిర్ణయించుకోవాలనుకునే స్త్రీ. పైగా ఆమె సమాజ విలువలకు పెద్దగా భయపడదు. తన జీవితం తన కనుసన్నలలో నడవాలన్నది ఆమె ఆశయం. టారా ఓ పెద్ద ఎస్టేట్. దాని పక్కన ట్వెల్వ్ ఓక్స్ అనే మరో ఎస్టేట్ ఉంది. దానికి విల్క్స్ కుటుంబం యజమానులు. ఆ కుటుంబంలోని పెద్ద కొడుకు ఆష్లే పట్ల ఆకర్షణ పెంచుకుంటుంది స్కార్లెట్. కాని ఆష్లే తన బంధువు మెలనీ హామిల్టన్ ను పెళ్ళి చెసుకోబోతున్నాడని స్కార్లెట్‌కు తెలుస్తుంది. స్కార్లెట్ అందం ఆ ఊరిలో ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. కాని తనను కోరుకునే యువకులను రెచ్చగొడుతూనే స్కార్లెట్ మాత్రం ఆష్లే నే కోరుకుంటుంది. ఆష్లే కి ఇది అర్ధం అవుతున్నా, మెలనీ తోనే తన జీవితం బావుంటుందని నిర్ణయించుకుంటాడు. ఆమెతో నిశ్చితార్ధం చేసుకునే రోజున స్కార్లెట్ అతనికి తన ప్రేమను తెలుపుతుంది. కాని ఆష్లే ఆమెను నిరాకరిస్తాడు. ధైర్యం చేసి స్త్రీలందరూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతన్ని ఒంటరిగా కలుసుకుని తన మనసులోని ప్రేమని తెలియపరుస్తుంది స్కార్లెట్. ఆ పార్టీకి వచ్చిన రెట్ బట్లర్ ఆ గదిలోనే ఉన్నట్లు వీరిద్దరూ గమనించరు. రెట్ ఆ క్షణంలోనే స్కార్లెట్‌కు ఆకర్షితుడవుతాడు. ఆ రోజుల్లో స్త్రీలెవరూ చూపించని ధైర్యాన్ని, ముక్కుసూటితనాన్ని ప్రదర్శించిన స్కార్లెట్ అతనికి నచ్చుతుంది. ఆమె ధైర్యానికి అభినందిస్తాడు ఆమెలోని నిజాయితీని గుర్తిస్తాడు. తనను కాదన్నందుకు ఆష్లే చెంప చెళ్ళుమనిపించిన స్కార్లెట్ దొంగ మర్యాదల చాటున దాక్కునే స్త్రీ కాదని అతనికి అనిపిస్తుంది. కాని రెట్ వైఖరి, ముక్కుసూటిగా సమాజంలోని ద్వంద్వాన్ని ఎదుర్కొనే అతని నైజం, డబ్బు పట్ల మర్యాదస్తుల పట్ల అతని నిర్లక్ష్యం కారణంగా రెట్ ని అందరూ ఎదుట గౌరవాన్ని ప్రకటిస్తూనే వెనుక విమర్శిస్తూ ఉంటారు. ఇది స్కార్లెట్ కి తెలుస్తుంది. అందుకునే అతన్ని ఆమె కూడా చులకనగానే చూస్తుంది.
ఆష్లే మెలనీ ఉంగరాలు మార్చుకున్నాక కోపంలో రగిలిపోతుంది స్కార్లెట్. ఆష్లే మనసులో అసూయను రగల్చాలనుకుంటుంది. అందుకని తనపై ఆసక్తి చూపుతున్న మెలనీ సోదరుడు చార్ల్స్ పెళ్ళి ప్రస్తావనను స్వీకరిస్తుంది. అప్పుడే అమెరికాలో సివిల్‌వార్ మొదలవుతుంది. యువకులందరూ ఉత్సాహంగా సైన్యంలో చేరడానికి సిద్దపడతారు. యుద్ధానికి చార్ల్స్, ఆష్లే కూడా వెళడానికి తయారవుతారు. చార్ల్స్‌ని యుద్దానికి వెళ్లబోయే ముందే తాను వివాహం చెసుకోదలిచానని చెబుతుంది స్కార్లెట్. చార్ల్స్ ను వివాహం చెసుకుంటున్నా ఆమె చూపంతా ఆష్లే పైనే ఉంటుంది. యుద్దానికి చార్ల్స్ వెళుతున్నాడన్న బాధ కన్నా ఆష్లేకి ఏం జరుగుతుందో అన్న బాధ ఆమెను తొలుస్తూ ఉంటుంది.
రెట్ ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తాడు. ఉత్సాహంగా యుద్ధానికి వెళుతున్న వారిని చూసి వారు అమాయకులని బలిపశువులుగా మారుతున్నారని చెప్పి విమర్శిస్తాడు. అర్ధం పర్ధం లేని ఈ యుద్ధంలో ఇంత మంది దేశభక్తి పేరుతో బలికావడం మూర్ఖత్వం అని వాదిస్తాడు. అతన్ని దేశభక్తి లేనివానిగా అందరితో పాటు స్కార్లెట్ కూడా విమర్శిస్తుంది. యుద్ధంలో చార్ల్స్ చనిపోతాడు. స్కార్లెట్‌కు ఇదేమీ బాధ కలిగించదు. అసలు చార్ల్స్ పట్ల ఆమెకు ఏ భావమూ ఉండదు. కాని అందరి కోసం నల్ల దుస్తులు ధరించి వితంతు సాంప్రదాయాన్ని పాటిస్తుంది. తాను రంగు రంగు బట్టలు వేసుకోలేకపోతున్నానని బాధపడుతుంది. ఆమె తల్లి ఈ బాధను మరోలా అర్ధం చేసుకుని ఆమెను అట్లాంటాలో హామిల్టన్ ల ఇంటికి పంపిస్తుంది. స్కార్లెట్‌ను చిన్నతనం నుండి పెంచిన నల్ల జాతీ బానిస స్త్రీ మామీ పూర్తిగా అర్ధం చెసుకుంటుంది. ఆష్లే పట్ల స్కార్లెట్ ఉన్న ఆకర్షణ ఆమెకు తెలుసు. ఆమెను ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. స్కార్లెట్ సంతోషంగా హామిల్టన్‌ల ఇంటికి వెళ్లడానికి ఒప్పుకుంటుంది. ఆష్లే సంగతులు తెలుసుకోవచ్చని ఆమె ఆశ. దీన్ని మామీ ఖండిస్తుంది.
అట్లాంటాలో మెలనీ సైనికుని భార్యలతో కలిసి చారిటీ షోలు నిర్వహిస్తూ సైన్యానికి డబ్బు పంపిస్తూ ఉంటుంది. అలాంటి ఓ డాన్స్ పార్టీలో ఇతర స్త్రీలు తయారు చేసిన వస్తువులతో ఓ స్టాల్ పెడుతుంది స్కార్లెట్. అందరూ నాట్యం చేస్తూంటే తాను వితంతు దుస్తులలో లేని దు:ఖాన్ని ముఖాన పులుముకుని ఉండవలసి రావడంతో స్కార్లెట్ ఇబ్బంది పడుతుంది. ఆమెను ఆ పార్టీకి వచ్చిన రెట్ దూరం నుండి గమనిస్తాడు. అక్కడ తమకు నచ్చిన స్త్రీతో నత్యం చేయడానికి యువకులు డబ్బు చెల్లించి ఆనందించవచ్చని ఆ డబ్బు సైనికుల నిధికి వెళుతుందని నిర్వాహకులు ప్రతిపాదిస్తారు. పైగా అందరి దగ్గరా డబ్బు వస్తూలు చేస్తూ ఉంటారు. మెలనీ తన పెళ్ళి ఉంగరాన్ని సైనికుల నిధికి ఇస్తుంది. మెలనీ చాలా ఉదాత్తమైన ఆదర్శాలతో జీవించే స్త్రీ. ఆమెలో మంచితనం, ప్రేమ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఆమెను రెట్ మొదటిసారి చూసినప్పటి నుండి గౌరవిస్తాడు. తన పెళ్ళి ఉంగరాన్ని ఇచ్చేస్తున్న ఆమెలోని త్యాగాన్ని అతను మెచ్చుకుంటాడు. అక్కడే ఉన్న స్కార్లెట్ తన వేలి కున్న ఉంగరాన్ని కూడా ఇచ్చేస్తుంది. రెట్ మొహంలో ఆమెను అర్ధం చేసుకున్న చిరునవ్వు కనిపిస్తుంది. స్కార్లెట్ ఆ ఉంగరాన్ని, ఆ వివాహాన్ని పెద్దగా ఎప్పుడూ గౌరవించలేదని, కేవలం పంతం కోసమే ఆ వివాహం ఆమె చేసుకుందని రెట్‌కు తెలుసు. భర్త చనిపోయిన బాధ కన్నా వితంతువుగా మూలన కూర్చోవడం ఆమెను బాధిస్తుందని అతనికి మత్రమే అర్ధం అవుతుంది. అందుకే ఎక్కువ డబ్బు సైనికుల నిధికి ఇస్తూ దానికి బదులుగా స్కార్లెట్ తో తాను నాట్యం చేయాలనుకుంటున్నానని అతను చెప్తాడు. స్కార్లెట్ వితంతువుగా నలుపు ధరించి ఉందని దానికామె ఒప్పుకోదని నిర్వాహకులు చెప్పినపుడు నాట్యం చేయాలన్న ఉత్సాహంతో స్కార్లెట్ తాను ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంటున్నానని ముందుకు వస్తుంది. ఆశ్ఛర్యపోయి చూస్తున్న వద్ధ స్త్రీలతో మెలనీ అది స్కార్లెట్ త్యాగం అని సైనికుల నిధి కోసం ఆమె తన దు:ఖాన్ని మర్చి, సాయం చేస్తుందని చెప్తుంది. స్కార్లెట్ రెట్‌తో నాట్యం చేస్తూ చాలా రోజుల తరువాత ఆనందంగా గడుపుతుంది.
ఆ పార్టీ తరువాత రెట్ డబ్బు కట్టి మెలనీ పెళ్ళి ఉంగరాన్ని విడిపించి ఆమె త్యాగం ప్రస్తుతం అవసరం లేదంటూ దాన్ని తిరిగి ఆమెకు పంపిస్తాడు. దానితో పాటు స్కార్లెట్ ఉంగరమూ ఉంటుంది. మెలనీ పై గౌరవం స్కార్లెట్‌ని పూర్తిగా అర్ధం చేసుకున్న రెట్ చమత్కారం ఆ ఊంగరాలతో పాటు అతను రాసిన ఉత్తరంలో కనిపిస్తాయి.
తరువాత రెట్ మరోసారి స్కార్లెట్‌ను కలిసి అందమైన టోపి బహుకరిస్తాడు. అది తీసుకుని చిన్నపిల్లలా మురిసిపోవడాన్ని చూసి ఆనందిస్తాడు. ఆమెలోని పసి మనసుని ఇష్టపడతాడు. యుద్ధం గురించి చెపుతున్నప్పుడు స్కార్లెట్ ఆష్లే గురించి అడుగుతుంది. ఇంకా నువ్వు ఆ పిచ్చిలోనించి బైట పడలేదా అని కోపంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెళుతూ ఆష్లే పెన్సిల్వేనియాలో సురక్షితంగానే ఉన్నాడని ఆమెకు చెప్తాడు. యుద్ధంలో ఎందరో యువకులు మరణిస్తారు. మరణించిన వారిలో ఆష్లే పేరు లేనందుకు మెలనీతో పాటు స్కార్లెట్ కూడా సంతోషిస్తుంది. ఆష్లే సురక్షితంగా ఊండాలని భార్యగా తాను పడే తపనకన్నా ఎక్కువగా స్కార్లెట్ ప్రదర్శించే ఆందోళనను మెలనీ ఆమె మంచితనంగా అర్దం చేసుకుంటుంది. అంత ప్రేమ చూపుతున్నందుకు ఆమె స్కార్లెట్ కు దగ్గరవుతుంది. యుద్ధంలో గాయపడిన సైనికులకు సేవ చెయడానికి హస్పిటల్‌లో పని చేస్తూ ఉంటారు మెలనీ స్కార్లెట్‌లు. యుద్ధ సమయంలో వ్యాపారం చేసి ఇంకా డబ్బు సంపాదిస్తాడు రెట్. ఓ సారి మార్కెట్‌లో స్కార్లెట్‌కు కనిపించి ఇంత మంది మరణం మూర్ఖత్వం అని మరోసారి యుద్దంలోని మూర్ఖత్వాన్ని ప్రస్తావిస్తాడు. స్కార్లెట్ అతని నిజాయితీని ద్వేషిస్తుంది. తానూ అతని లాంటి స్త్రీనేనని, సమాజంలోని మూసలో తానూ ఇమడనని ఆమె మర్చిపోతుంది. తనలాగే ఆలోచించే రెట్ ను ఆమె ద్వేషిస్తుంది.
మూడు రోజుల సెలవు తీసుకుని ఆష్లే ఇంటికి వస్తాడు. అతన్ని కలవడానికి తన నల్ల దుస్తుల మీద రెట్ ఇచ్చిన టోపీని మొదటి సారి ధరించి వెళుతుంది స్కార్లెట్. ఆ భార్యాభర్తల కలయికను ఆష్లేపై ప్రెమతో, మెలనీపై అసూయతోనూ చూస్తుంది. సెలవు ముగించుకుని యుద్దానికి వెళుతున్నప్పుడు తనని కలిసిన స్కార్లెట్ కళ్ళల్లో తనపై ఉన్న ప్రేమను చూస్తాడు ఆష్లే. తాను లేని సమయంలో మెలనీని కనిపెట్టుకొమ్మని ఆమెను అభ్యర్ధిస్తాడు. ఆష్లే కోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్న స్కార్లెట్ మెలనీ ని తాను చూసుకుంటానని మాటిస్తుంది.
ఆ ఊరిలో ఓ వేశ్య ఉంటుంది. ఈమె రెట్ స్నేహితురాలు. ఆమె సైనికుల కోసం తన వంతుగా డబ్బు ఇవ్వబోతే ఆ నగరంలో ఎవ్వరూ తీసుకోరు.ఆమె మెలనీ మంచితనం గురించి వింటుంది. మెలనీని కలిసి తన డబ్బుఇస్తుంది. ఆమెలోని మంచితనాన్ని గమనించి మెలనీ ఆ డబ్బును గౌరవంగా తీసుకుంటుంది. దీనితో మెలనీ మంచి మనసు అందరిలోనూ చర్చనీయంశమవుతుంది. యుద్ధంలో గాయపడిన సైనికులు కుప్పలు తెప్పలుగా వస్తూ ఉంటారు. వీరందరికీ సేవ చేయగల డాక్టర్లు, నర్సులు ఉండరు. స్కార్లెట్ హాస్పిటల్‌లో పని చేస్తుంది. ఆమె ధైర్యాన్ని అందరూ పొగుడుతూ ఉన్నా ఆ జీవితం ఆమెకు నచ్చదు. అక్కడి నుండి పారిపోవాలని ఆమె అనుకుంటుంది. ఈ లోపు అట్లాంటా నగరాన్ని సైనికులు ముట్టడిస్తారు. టారా లో తమ ఇంటి నల్ల బానిసలు కూడా యుద్ధంలో చేరడానికి వెళూతుండగా స్కార్లెట్ చూస్తుంది. నగరంలోని అల్లర్ల మధ్య చిక్కుకున్న స్కార్లెట్ ను రెట్ తన గుర్రపు బండిలో వచ్చి రక్షిస్తాడు. ఆ యుద్దం వాతావరణం నుండి తనకు పారిపోవాలని ఉందని స్కార్లెట్ అతనితో చెబుతుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తనకు అర్ధం కావట్లేదని అంటుంది. జీవితాన్ని, చుట్టూ జరుగుతున్న వాటిని ఎవరి దృష్టిలో నించో కాకుండా తన మనసుతో గ్రహించాలనుకునే స్కార్లెట్ వ్యక్తిత్వంలో ఓ విశిష్టత ఉందని, అందుకే ఆమె అంటే తనకు ఇష్టమని చెబుతాడు రెట్. అతని మాటలను మరో సారి పెద్దగా పట్టించుకోనట్లే ప్రవర్తిస్తుంది ఆమె. ఇంటికి వచ్చిన స్కార్లెట్‌కు బంధువులందరూ ఆ ఊరు వదిలి వెళ్లిపోతున్నారని తెలుస్తుంది. మెలనీ నిండు నెలల మనిషి. ఆ సమయంలో అందరూ తమ దారి చూసుకోవడం స్కార్లెట్‌కు కోపాన్ని తెప్పిస్తుంది. డాక్టర్ మెలనీని ఇప్పుడు కదల్చలేమని చెబుతాడు. ఆ ఇంట్లో ఉన్న నల్ల జాతి పని పిల్ల తనకు పురుడు పోయడం వచ్చని చెబుతుంది. తనను ఆ ఇంటి నుండి వెళ్ళనివ్వకుండా ఆపుతున్న మెలనీకి పుట్టబోయే బిడ్డపట్ల కోపం కలుగుతుంది స్కార్లెట్‌కు. కాని అందరిలా వాళ్ళను వదిలి వెళ్లలేకపోతుంది.
మెలనీ పురుటి సమయంలో సైనికుల సేవ మధ్య ఉన్న డాక్టర్ రాలేకపోతాడు. పని పిల్ల తనకు పిల్లల గురించి ఏం తెలియదని రాగం అందుకుంటుంది. అప్పుడు స్కార్లెట్ ఒక్కతే ధైర్యంగా ప్రసవం గురించి తనకేమీ తెలియకపోయినా మెలనీకి పురుడు పోస్తుంది. ఆ సమయంలో ఆమెకు రెట్ గుర్తుకు వస్తాడు. అతని దగ్గరున్న గుర్రపుబండిని తీసుకురమ్మని పని పిల్లతో కబురు పంపుతుంది స్కార్లెట్. రెట్ గుర్రపు బండితో వస్తాడు. అప్పటి దాకా ధైర్యాన్ని చూపించిన స్కార్లెట్ రెట్ ముందు తనలోని భయాన్ని, కోపాన్ని, ఆక్రోశాన్ని ప్రదర్శిస్తుంది. అతని సాంగత్యంలో సేద తీరుతుంది. ఆమెకు ధైర్యం చెప్పి రెట్ ఆమెను, మెలనీని, పుట్టిన బిడ్డతో పాటు గుర్రపు బండి ఎక్కిస్తాడు. నగరం బైటికి వారిని తీసుకువచ్చి తాను సైన్యంలో చేరబోతున్నానని, ఇప్పుడు ఓడిపోతున్న దేశానికి తన అవసరం ఉందని చెప్పి ఒంటరిగా స్కార్లెట్‌ను వదిలి వెళ్లిపోతాడు. వెళుతూ మళ్ళీ తాను తిరిగి వస్తానో రానో తెలియదని తాను ప్రేమించిన ఆమెతో తనకో మధురమైన గుర్తు ఉండాలని చెపుతూ ఆమెను మొదటిసారి ముద్దు పెట్తుకుంటాడు రెట్.
ఆ రాత్రి స్కార్లెట్ తగలబడిపోతున్న నగరం గుండా ఆ మంటల్లోనుంచి మెలనీ, ఆమె బిడ్డతో పాటు పారిపోయి టారా చేరుకుంటుంది. కాని అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. తల్లి చనిపోయి, మతి చలించిన తండ్రి, పనివారు లేని ఆ ఎస్టేట్ లో విషాదం తాండవిస్తుంది. ఇంట్లో తినడానికి ఏమీ ఉండదు. పొలంలో ఓ చోట తవ్వితే ఒ దుంప బైటకి వస్తుంది. దాన్ని పట్టుకుని స్కార్లెట్ ఓ ప్రతిజ్ఞ చేస్తుంది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురయినా, ఏం చేసి అయినా సరే తాను ఇక ఎప్పుడూ ఆకలితో ఉండను అని ఆమె ఆకాశం వైపుకు చూస్తూ పట్టుదలతో అంటునప్పుడు ఆమెలోని కసి ప్రేక్షకులను గగ్గుర్పాటుకు గురి చేస్తుంది.
యుద్ధం ఆ దేశాన్ని నిర్వీర్యం చెస్తుంది. ఎందరో మరణిస్తారు. ఆకలి తాండవిస్తుంది. టారాలో స్కార్లెట్ పొలం పనిలో మునిగిపోయి ఉంటుంది. ఎవరు కూర్చొని ఉన్నా ఆమె సహించదు. ఆమెలోని ఆ క్రౌర్యం వెనుక ఆకలిని జయించాలనే తపన ఒక్క మెలనీ మాత్రమే అర్ధం చేసుకుంటుంది. కాని ఆమె పని చేయించే విధానాన్ని, అందులోని కసిని అందరూ అసహ్యించుకుంటారు. ఒక రోజు ఆ ఇంట్లోకి శత్రు సైనికుడు జొరపడతాడు. స్కార్లెట్ అతన్ని చంపేస్తుంది. ఇది మెలనీ చూస్తుంది. తమందరిని రక్షించడానికి ఒక హంతకిగా మారిన స్కార్లెట్‌లోని ధైర్యాన్ని ఆమె ప్రశంసిస్తుంది. ఇద్దరూ కలిసి శవాన్ని పాతేస్తారు. మెలనీ ఆ దారిలో ప్రయాణిస్తున్న సైనికులకు తిండి అందిస్తూ ఉంటుంది. ఇది స్కార్లెట్‌కు నచ్చదు. కాని వారి ద్వారా ఆష్లే సమాచారం తెలుస్తుందన్న మెలనీ జవాబుతో ఆమె మారు మాట్లాడదు.
ఆ ఊరిలో ఫ్రాంక్ అనే ఓ చిన్న వ్యాపారి స్కార్లెట్ చెల్లెలిని పెళ్ళి చేసుకుంటానని అడుగుతాడు. ఒకరి భాద్యత అన్నా తనమీద లేకుండా పోతుందని స్కార్లెట్ దీనికి ఒప్పుకుంటుంది. ఈ లోపు యుద్ధం ముగిసి ఆష్లే ఆ ఇంటికి వస్తాడు. యుద్ధం అతన్ని నిర్వీర్యుణ్ణి చేస్తుంది. పొలం పనిలో స్కార్లెట్‌కు ఏ విధంగానూ సహాయం చేయలేకపోతాడు. స్కార్లెట్ అతనిపై ప్రేమను మర్చిపోలేకపోతుంది. అతని బాధ్యతనూ స్వీకరిస్తుంది. ఈ సమయంలోనే స్కార్లెట్ తండ్రి ఓ ప్రమాదంలో చనిపోతాడు. పొలంపై మూడొందల పౌండ్లు పన్ను కట్టాలనే ఆర్డర్ వస్తుంది. చేతిలో చిల్లి గవ్వ లేని స్కార్లెట్ కు మళ్ళి రెట్ గుర్తుకు వస్తాడు. అతను జైలులో ఉన్నాడని ఆమెకు సమాచారం అందుతుంది. కాని పేదరాలిగా తాను వెళ్లి రెట్‌ను సహయం అడగాలంటే ఆమెకు అభిమానం అడ్డువస్తుంది. ఇంట్లో ఉన్న కర్టెన్లతో కొత్త గౌను కుట్టుకుని అందంగా తయారయి జైలులో ఉన్న రెట్‌ను ప్రేమతో బంధించి అతని దగ్గర డబ్బు తెచ్చుకోవాలని వెళ్తుంది. ఆమె అర చేతులను చూసిన వెంటనే రెట్ ఆమె జీవితం మునుపటిలా లేదని అర్ధం చేసుకుంటాడు. తనను మాటలతో మోసం చేయడానికి వచ్చిన ఆమెపై అతని కోపం వస్తుంది. పైగా తాను ఇప్పుడు జైలులో ఉన్నానని తన ఆస్థిపై తనకు హక్కు లేదని ఆమెకు సాయం చేయలేనని కోపంతో చెబుతాడు. ఏం చేయాలో తెలియక తిరిగుతున్న ఆమెకు చెల్లెలిని చేసుకోవాలనుకున్న ఫ్రాంక్ కెనడీ కనపడతాడు. అతను వ్యాపారంలో కొంత డబ్బు వెనకేశాడని ఆమెకు తెలుస్తుంది. అతను స్కార్లెట్ చెల్లెలిని పెళ్ళి చెసుకుని పట్నం వచ్చే ఆలోచనలో ఉన్నానని చెప్తాడు. తన మాటల మాయలో అతన్ని పడేసి, తన చెల్లెలు వేరే ఎవరినో పెళ్ళి చేసుకుంటుందని చెప్పి ఆమె అతన్ని అక్కడే వివాహం చెసుకుంటుంది. అతని డబ్బుతో టారాపై ఉన్న పన్నుని కట్టి ఆ పొలం సొంతం చేసుకుంటుంది.
కెనెడీ కలప వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆష్లే సొంతంగా మరో చోటకి మెలనీతో పాటు వెళ్ళిపోవాలనుకుంటాడు. కాని తనకు ఇప్పుడు నమకస్తుడైన మనిషి అవసరం ఉందని, ఇలాంటి సమయంలో అతను వెళ్లిపోవడం తప్పని మెలనీ దగ్గర వాపోతుంది స్కార్లెట్. మెలనీ ఆమె మాటలకు పడిపోతుంది. ఇప్పుడు స్కార్లెట్‌కు తమ అవసరం ఉందని చెప్పి భర్తను టారా దాటనివ్వదు. ఆష్లే తన చుట్టుపక్కన ఉంటే చాలనే భావంతో ఉన్న స్కార్లెట్ దీనికి సంతోషిస్తుంది. కెనడీ భార్యను ప్రేమిస్తాడు. కాని స్కార్లెట్ ఓ పక్కా వ్యాపారస్తురాలిగానే అతనితో గడుపుతుంది. డబ్బు సంపాదించడమే ఇప్పుడు ఆమె జీవితం అవుతుంది. ఆ సమయంలోనే కొందరు ఆమెపై దాడి చేస్తారు. దానికి బదులుగా వారిపై దాడికి ఫ్రాంక్, ఆష్లేలు వెళ్తారు. ఫ్రాంక్ ఈ గొడవలల్లో మరణిస్తాడు. రెట్, అతని స్నేహితురాలైన వేశ్య సహాయంతో ఆష్లే ప్రాణాలు కాపాడుకుంటాడు. ఫ్రాంక్ మరణం తరువాత మరోసారి వితంతువు అవుతుంది స్కార్లెట్.
ఫ్రాంక్ చనిపోయిన తరువాత స్కార్లెట్‌ను వివాహం చేసుకోదలిచానని చెప్తాడు రెట్. ఆమె దానికి ఒప్పుకుంటుంది. రెట్‌తో జీవితం ఆమెకు ఎంతో బావుంటుంది. ఆమె కావల్సినవన్నీ అడగకుండానే ఆమె చెంతకు చేరుతూ ఉంటాయి. రాత్రిళ్లు ఆమెను భయభ్రాంతులు చేసే పీడకలల నుండి రెట్ సాహచర్యం ఆమెకు ధైర్యాన్నిస్తుంది. కాని ఆమె మనసులో ఇంకా అష్లే ముద్ర పోదు. ఒక బిడ్డ పుట్టిన తరువాత తన అందం చెడిపోతుందని రెట్‌తో దూరం జరుగుతుంది స్కార్లెట్. రెట్ దీన్ని భరిస్తాడు. బిడ్డే తన జీవితం అంటూ బతకడానికి అలవాటుపడతాడు. కాని ఆష్లేపై స్కార్లెట్ మనసులో ఉన్న కోరిక అతన్ని అన్నిటికన్నా బాధిస్తుంది.
రెట్‌ని మామీ ముందు చాలా అసహ్యించుకుంటుంది. కాని క్రమంగా అతని ప్రేమలోని నిజాయితీని ఆమె గుర్తిస్తుంది. అతన్ని గౌరవిస్తుంది. రెట్ ప్రతి ఒక్కరికీ దగ్గరవుతాడు. కాని ఆష్లేపై ప్రేమతో కళ్ళు మూసుకుపోయిన స్కార్లెట్, అతను తనని ఎంత ప్రేమిస్తున్నాడో, తన సుఖం కోసం ఎంతగా తపన పడుతున్నాడో అర్ధం చేసుకోలేకపోతుంది. ఒకసారి ఆమె చాటుగా ఆష్లేను కలుస్తుంది. వారిద్దరినీ చూసిన ఆష్లే చెల్లెలు ఊరంతా ఈ సంగతి చాటింపు వేస్తుంది. వారి మధ్య శారీరిక సంబంధం ఉండే ప్రసక్తే లేదని నమ్మిన రెట్ స్కార్లెట్ ను బలవంతంగా పార్టీకి తయారు చేసి పంపిస్తాడు. కానీ అతని ప్రేమను స్కార్లెట్ గమనించే స్థితిలో ఉండదు. పార్టీలో స్కార్లెట్ పై పుకారులు మెలనీ కూడా ఆమెను గౌరవీంచడంతో ఊరి జనం నోర్లు మూతపడతాయి. ఒకసారి స్కార్లెట్ పై ప్రేమను చంపుకోలేక ఆమెను బలవంతంగా పొందుతాడు రెట్. కాని స్కార్లెట్ కు ఎందుకో ఈసారి రెట్‌పై కోపం రాదు. అయినా తాను రెట్‌ని ప్రేమిస్తున్నానని ఒప్పుకోదు. మరుసటి రోజు రెట్ కూతురితో స్కార్లెట్‌కు దూరంగా వెళ్లిపోతాడు. కాని కూతురు తల్లి కోసం ఏడుస్తుంటే మళ్ళీ అతనికి ఇంటికి రాక తప్పదు. అప్పుడే భార్య మరోసారి గర్భవతి అని అతనికి తెలుసుంది. కాని వారిద్దరి మధ్య గొడవ జరిగి మెట్లపై జారిపడి స్కార్లెట్ గర్భాన్ని పోగొట్టుకుంటుంది. కూతురు కూడా గుర్రంపై నుండి పడి చనిపోతుంది. ఆ దు:ఖం నుండి కుటుంబం కోలుకుంటున్న సమయంలోనే మెలనీ మరోసారి తల్లి అవబోయే ప్రయత్నంలో చనిపోతుంది. ఆఖరి సమయంలో తన బిడ్డను స్కార్లెట్‌కు ఆమె అప్పగిస్తుంది. కాని ఆ సమయంలో కూడా తన దగ్గరకు రాకుండా ఆష్లే సాంగత్యాన్ని స్కార్లెట్ కోరుకోవడాన్ని చూసిన రెట్ భరించలేకపోతాడు. అతని మనసు విరిగిపోతుంది.
ఇంటికి వచ్చిన స్కార్లెట్‌కు రెట్ తననీ, ఆ ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్లిపోతున్నాడని తెలుస్తుంది. రెట్ లేని తన జీవితాన్ని ఊహించుకున్న ఆమెకు అప్పుడు తాను రెట్ ని ప్రేమిస్తున్నానని తెలుస్తుంది. ఆష్లే పై తనకున్నది ప్రేమ కాదని అది కేవలం తన పట్టుదల మాత్రమే అని, రెట్ లేని జీవితం తాను ఊహించలేనని అర్ధం అవుతుంది. కాని మనసు విరిగిన రెట్ తిరిగి చూడకుండా వెళ్లిపోతాడు. ఇక తన భవిష్యత్తేమిటని ఆలోచిస్తున్న స్కార్లెట్ కు తనకు టారా ఉందని అక్కడకే తాను తిరిగి వెళ్లాలని ఏదో ఒక రోజు రెట్ మళ్ళీ తన జీవితంలోకి తిరిగి వస్తాడన్న ఆశ జనియిస్తుంది. ఆమె ఒంటరి ప్రయాణం మళ్ళీ మొదలవుతుంది.
ఈ సినిమాలో స్కార్లెట్, రెట్ ఇద్దరూ ఒకటే రకమైన మనస్థత్వం ఉన్నవారు. కాని ఆష్లే తనను కాదన్నాడన్న పట్టుదలతో అతనిపట్ల ఇష్టాన్ని స్కార్లెట్ వదులుకోలేకపోతుంది. అతనే ఆమె జీవితానికి కేంద్రబిందువు అవుతాడు. కాని ఆష్లే బలహీనుడు. స్కార్లెట్ కు తనపై ఉన్న ఇష్టానికి లొంగాలి లేదా వద్దని గట్టిగా చెప్పాలి. అతను ఈ రెండూ చేయడు. ఒకానొక సమయంలో ఆమెపై తనకిష్టం ఉందని ఒప్పుకుంటాడు కూడా. అతనిలోని ఈ ద్వంద్వం మధ్య స్కార్లెట్ ఉండిపోతుంది. ఆష్లే కళ్ళల్లో తనపై ప్రేమ, ఆరాధన, కొన్ని సార్లు మెప్పు ఆమె మనసు గ్రహిస్తుంది. అతనిపై కోపంతోనే ఆమె చార్ల్స్‌ని, తరువాత ఆకలితో పోరాడుతూ ఫ్రాంక్‌ని పెళ్లి చేసుకుంటుంది. వీళ్లిద్దరూ ఆమె కాళ్ళ దగ్గర పడి ఉండే బలహీనులు. వాళ్లను ఆమె గౌరవించలేకపోతుంది. కాని రెట్ ఆమెను పిచ్చిగా ప్రేమిస్తున్నా ఆమెను పూర్తిగా చదవగలడు. మనుషుల మనస్థత్వం తెలిసిన పెద్ద వ్యాపారస్తుడు. అతను ఆమెలోని నిజాయితీని, నిర్భీతిని, పట్టుదలతో పాటు ఆమెలోని చిన్న పిల్ల మనస్థత్వాన్ని కూడా ప్రేమిస్తాడు. అందుకే ఆమె అతని సంరక్షణలోనే సురక్షితంగా ఊంటుంది. ఇది ఆమె అర్ధం చేసుకోలేకపోతుంది. ఆమెలోని పట్టుదల, ఓటమిని అంగీకరించని మనస్థత్వమే కొన్ని సందర్భాలలో ఆ కుటుంబాన్ని, నమ్ముకున్న పనివారినీ కూడా రక్షిస్తుంది. కాని ఆ పట్టుదలే రెట్ ని ఆమెకు దూరం చేస్తుంది. ఆష్లే ఆమెకు ఏ సహయమూ చేయలేకపోతాడు. ఆమెకు ఎటువంటి భద్రతా ఇవ్వలేకపోతాడు. కాని అతనిపై ఇష్టం తన పట్టుదల మాత్రమే అన్న విషయం స్కార్లెట్ కు అర్ధం కాదు. రెట్ తనను వదిలి వెళ్లిపోతున్నప్పుడే ఆమెకు ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు మెలనీ జీవించి లేదు. ఆమె మరణం తరువాత ఆష్లేని స్కార్లెట్ సొంతం చేసుకోవచ్చు. కాని అప్పుడు ఆష్లే గురించి కాక రెట్ గురించి ఆలోచిస్తుంది. ఒంటరిగా టారా వెళ్లిపోవడానికి సిద్ధపడుతుంది.
తెలుగులో ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా’ అనే ఆత్రేయగారి ఓ పాట ఉంది, అందులోని వాక్యాలు స్కార్లెట్ జీవితానికి సరిగ్గా సరిపోతాయి. ” చీకటి గుహ నీవు చింతల చెలి నీవు, నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే, ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో, ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో, మౌనమే నీ భాష ఓ మూగ మనసా కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు,ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే, లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు”.
తాను చేసిన పొరపాటుకు వేదన అనుభవిస్తూ స్కార్లెట్ ఒంటరిగా ఉండిపోతుంది. కాని ఇప్పుడు కూడా ఆమెలో ఆ ఓటమి ఒప్పుకోని మనస్థత్వమే కనిపిస్తుంది. ఈ సినిమాలో రెండు డైలాగులు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రేమ చచ్చిపోయిన రెట్‌తో స్కార్లెట్ ‘నువ్వు వెళ్లిపోతే నేనెలా బతకగలను’ అని తాను ఎన్నో రోజుల నుండి వినాలనుకుంటున్న మాటను తన గర్వం అహం వదిలి అంటుంటే ”మై డియర్ ఐ కేర్ ఏ డామ్న్” (అది నాకు అనవసరం) అని రెట్ అనడం. ఈ మాట అంటున్నప్పుడు రెట్ మొహంలోని భావాలను, ప్రేమ చచ్చిపోయిన విరక్తి, నిశ్చింత కలగలపి క్లార్క్ గేబుల్ తన మొహంలో పలికించడాన్ని మర్చిపోలేం.
అలాగే కష్టాలు వచ్చిన ప్రతిసారి రేపటి గురించి ఆలోచించను ‘టుమారో ఈస్ ఎనదర్ డే’ (రేపన్నది మరో రోజు) అంటూ ఇప్పుడు నా దగ్గర ఉన్నదేంటి అని మాత్రమే ఆలోచించే స్కార్లెట్ వ్యక్తిత్వం కూడా ఆకర్షిస్తుంది. రెట్ తనను వదిలి వెళ్లిన తరువాత కూడా ఆమె ఇదే మాటతో భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తుంది. వీరిద్దరివీ అద్భుతమైన పాత్రలు. మనిషిలోని మంచి చెడులతో పాటు జీవితం చేతిలో రాటుదేలి, జీవితాన్ని గెలవాలనుకునే పట్టుదలతో ప్రయాణించే ఈ రెండు పాత్రలు విడిపోవడం బాధకలిగించినా ఆ రెండు వ్యక్తిత్వాలకు ఆకర్షితులవకుండా ఉండలేరు ప్రేక్షకులు.
ఈ సినిమాలో మెలనీ పాత్రలో నటించిన ఓలీవియా దీ హావిలాండ్ నటన కూడా చాలా బావుంటుంది. కాని ఈమెను దాటుకుని మామీ పాత్రలో నటించిన హాటీ మెక్డానియల్ ని ఆస్కార్ వరించింది. మెలనీ అతి మంచి స్త్రీ. దైవత్వం ఉన్న వ్యక్తి. ఆమెను అందరూ ఇష్టపడతారు. కాని ఆమెని అన్ని సందర్భాలలో ఆదుకున్నది స్కార్లెట్‌లోని పట్టుదలే. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే స్కార్లెట్ మొండితనం కావాలి. అది అందరం ఒప్పుకుంటాం. కాని ఆ మొండితనం మాటున స్కార్లెట్‌లో సున్నితత్వం చచ్చిపోతుంది. అందుకే మరణిస్తున్న ఆఖరి ఘడియల్లో మెలనీ స్కార్లెట్‌కు రెట్ ప్రేమను తెలియజేస్తుంది. అప్పుడు కాని స్కార్లెట్‌కు రెట్‌తో పాటు తన మనసూ అర్ధం కాదు.
సినిమాలో పాత్రలన్నీ అసంపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్నవే. కాని నిజ జివితంలో మనుషులను గమనిస్తే ఈ పాత్రలు జీవితానికి అతి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి. అందుకే ఈ కథ, కథనం, సినిమా అందరికీ నచ్చుతుంది. మంచి చెడుల నడుమ సాగే మానవ జీవన ప్రయాణంలో విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కూడా తమ బలహీనతలతో చేసే పోరాటమే ”గాన్ విత్ ది విండ్”. అతి పెద్ద ఆస్కార్ ఉత్తమ చిత్రంగానూ దీనికి రికార్డు ఉంది. ఈ సినిమాను చూడడం, ఈ పుస్తకాన్ని చదవడం ఓ గొప్ప అనుభవం. వెయ్యి పేజీలకన్నా ఎక్కువున్న ఈ పుస్తకాన్ని అంతే గొప్పగా సినిమాగా మలచిన దర్శకులు విక్టర్ ఫ్లెమింగ్ దర్శకత్వ ప్రతిభకు ఉత్తమ దర్శకుడుగానూ ఆస్కార్ అందించిన చిత్రం ఇది.
– పి.జ్యోతి,
98853 84740