– ఇదొక నవల లాంటి సినీ చరిత్ర! : ప్రముఖ దర్శక – రచయిత, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్
– హైదరాబాద్ బుక్ఫెయిర్లో పుస్తకావిష్కరణ
నవతెలంగాణ-నవచిత్రం ప్రతినిధి
”ఒక రచయిత పీహెడ్డీ గ్రంథం రాస్తే ఎలా ఉంటుందో… ‘మన సినిమా – ఫస్ట్ రీల్’ పుస్తకం అలా ఉంది. నా దష్టిలో జయదేవ కాలమిస్ట్, జర్నలిస్ట్ మాత్రం కాదు. అంతకు మించిన వాడు. కచ్చితంగా రచయితకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నవాడు. ఒక విషయాన్ని చాలా ఆథెంటిక్గా చెప్పగలడు. ‘ఫస్ట్ రీల్’లో తెలుగు టాకీ తాలూకా కథ చెప్పాడు. ఇదొక నవల లాంటి పుస్తకం. సినిమా మీద ప్రేమ ఉన్న వ్యక్తి పుస్తకం రాస్తే ఎంత ప్రామాణికంగా ఉంటుందో ప్రూవ్ చేశాడు. జయదేవ సినిమా రచయిత అయ్యేలోపు మరిన్ని పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నాను” అని ప్రముఖ దర్శకుడు – రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు.
తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సరైన విడుదల తేదీని తన పరిశోధనలో వెలికి తీసిన ప్రముఖ జర్నలిస్టు – రచయిత, ఉత్తమ ‘సినీ విమర్శకుని’గా నంది పురస్కార గ్రహీత డాక్టర్ రెంటాల జయదేవ పాతికేళ్ల సినీ పరిశోధనకు అక్షర రూపం ‘మన సినిమా… ఫస్ట్ రీల్’. దక్షిణ భారత సినిమా చరిత్రను సమగ్రంగా పాఠకులకు అందిస్తున్న గ్రంథం ఇది. ఎమెస్కో పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ బుక్ ఫెయిర్లోని బోయి విజయ భారతి వేదికపై జరిగింది. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ గారు పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని ఐఆర్ఎస్ అధికారి కష్ణ కౌండిన్యకు, మలి ప్రతిని సభాధ్యక్షత వహించిన ‘ఎమెస్కో’ విజరు కుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాష – సాంస్కతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికష్ణ, జయదేవకు జర్నలిజంలో పాఠాలు చెప్పిన గురువు ఆచార్య డి. చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ కవి – విమర్శకులు అఫ్సర్, రచయిత్రి కల్పనా రెంటాల, దర్శకులు దశరథ్, సీనియర్ జర్నలిస్ట్ ఇందిరా పరిమి తదితరులు పాల్గొన్నారు. త్రివిక్రమ్ చేతుల మీదుగా ‘మన సినిమా… ఫస్ట్ రీల్’ పుస్తకం అందుకున్నారు.
నేను పోటీగా ఉండే ఏరియాలోకి ఎంటర్ అవ్వను : త్రివిక్రమ్ శ్రీనివాస్
”నేను సినిమాలకు రాస్తూ, దర్శకుడిని అయ్యే సన్నాహాల్లో ఉన్న రోజుల్లో మద్రాసులో రెంటాల జయదేవ పరిచయం అయ్యారు. ఆ టైంలో ఆయన ‘ఇండియా టుడే’ మ్యాగజైన్ లో పని చేసేవారు. అందులో ఆయన రాసే ప్రత్యేక సినిమా వ్యాసాలు, సమీక్షలు, ముఖచిత్ర కథనాలు, కాలమ్స్ చూసి ‘ఇతను ఎవరో బాగా రాస్తున్నారు’ అని ఇష్టం ఉండేది. కలిశాక మా మధ్య స్నేహం మొదలైంది. ఇన్నేళ్లుగా కొనసాగుతూ ఉంది. మా స్నేహానికి అతని సాహిత్యం గానీ, నా సినిమాలు గానీ అడ్డుకాలేదు. జయదేవ రాసిన ‘మన సినిమా… ఫస్ట్ రీల్’లో ఇప్పటికి 200 పేజీలు చదివా. కష్ణ కౌండిన్య, మామిడాల హరికష్ణ గారు మొత్తం చదివారని తెలిసి భయపడ్డా. ఇప్పుడు నేను పుస్తకంలో వివరాల జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే… నేను పోటీగా ఉండే ఏరియాలోకి ఎంటర్ అవ్వను. పోటీ లేని ఇంకో ఏరియాలోకి ఎంటర్ అవుతా (నవ్వుతూ…) అని పుస్తకావిష్కరణ అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు.
‘ఎమెస్కో’ విజయ్ కుమార్ మాట్లాడుతూ… ”ఇటువంటి కార్యక్రమం నేను చేయాల్సి వస్తే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని పిలిచేవాడిని. ఆయన నాకు అత్యంత ఆత్మీయ మిత్రులు. ఇవాళ త్రివిక్రమ్ గారిని చూస్తుంటే మా శాస్త్రి గారి పక్కన కూర్చున్నట్లు ఉంది. భాష పట్ల, సంస్కతి పట్ల తాను ఉన్న చట్రంలో తనను తాను ఇముడ్చుకుంటూ తన వ్యక్తీకరణలో ఒక స్థాయిని తీసుకొచ్చిన వ్యక్తి త్రివిక్రమ్. ఒక్కమాటలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి తాలూకా గద్య రూపం త్రివిక్రమ్ అని చెప్పవచ్చు. జయదేవను ఈ పుస్తకం రాయమని అడిగా. తక్కువ సమయంలో మంచి బుక్ తీసుకొచ్చారు” అని అన్నారు.
ఐఆర్ఎస్ ఆఫీసర్ కష్ణ కౌండిన్య మాట్లాడుతూ… ”చరిత్రను తిరగరాసే రీసెర్చ్ జయదేవ గారు చేశారు. ఇప్పటి వరకు తెలుగు టాకీల్లో ఫస్ట్ సినిమా ఏది? అని ప్రశ్నిస్తే ‘భక్త ప్రహ్లాద’ (1932) అని చెప్పుకొంటున్నాం గానీ దాని కంటే ముందు 1931లో ‘కాళిదాస్’ అని ఓ సినిమా తీశారు. దాని కంటే ముందు భారతదేశంలో మొదటి టాకీ ‘ఆలం ఆరా’ వచ్చింది. అదే సంవత్సరం, అదే ‘ఆలం ఆరా’ సెట్లో ఇంకో సినిమా తీశారు హెచ్ఎం రెడ్డి గారు. అది ‘కాళిదాస్’ అని జయదేవ గారి పుస్తకం ‘ఫస్ట్ రీల్’ చదివిన తర్వాత తెలిసింది. ‘భక్త ప్రహ్లాద’ (1932 ఫిబ్రవరి 6) కన్నా ముందే ఆ ‘కాళిదాస్’ (1931 అక్టోబర్ 31) టాకీలో వెండితెరపై తొలిసారిగా మన తెలుగు మాట, పాట వినిపించాయి. కానీ, ఆ సంగతిని తెలుగువాళ్ళం విస్మరిస్తూ వస్తున్నాం. ఫలితంగా, ‘కాళిదాస్’ ను తమిళం వాళ్ళు వాళ్ళ సినిమాగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో ఆలోచింపజేసే, పరిశోధనాత్మక అంశాలు ఈ ‘ఫస్ట్ రీల్’ పుస్తకంలో రెంటాల జయదేవ వెలికితీశారు. ఈ పుస్తకంలో ఇంకో గొప్ప విషయం ఏమిటంటే… కేవలం తెలుగు సినిమా మీద కాకుండా దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్ర పరిశ్రమ ఎలా అభివద్ధి అయ్యిందనేది స్పష్టంగా రాశారు. జయదేవ గారి పాతికేళ్ల సుదీర్ఘ సాధన, పరిశోధన ఫలితం ఈ పుస్తకం. సినిమాపై ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కొని చదవాల్సింది, పదిలంగా దాచుకోవాల్సింది” అని అన్నారు.
రచయిత, నంది పురస్కార గ్రహీత ప్రముఖ జర్నలిస్టు డాక్టర్ రెంటాల జయదేవ మాట్లాడుతూ… ”అమ్మ తర్వాత అమ్మలా నన్ను సాకినటువంటి మా మూడో అక్క కల్పన, మా మూడో అన్నయ్య రెంటాల రామచంద్ర ఈ పుస్తకం రావడంలో నా వెన్ను తట్టి ప్రోత్సహించారు. మూడున్నర దశాబ్దాల పైగా సినిమాల గురించి నేను రాస్తున్నా, ఇదే నా తొలి సినిమా పుస్తకం. సినిమాలపై నేను పుస్తకం రాయకపోతే నాతో మాట్లాడానని మా అక్క నాతో చెప్పింది. మా అక్క చెప్పిన గడువు దాటినా, సంవత్సన్నర ఆలస్యంగా అక్కకు ఇచ్చిన మాట చెల్లించుకున్నాను. నాకు అక్షరం నేర్పిన గురువులు ఎంతో మంది ఉన్నారు. అందులో మా చంద్రశేఖర్ రెడ్డి మాస్టర్ ఇవాళ ఇక్కడ ఉండటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆత్మీయులు త్రివిక్రమ్ గారు ఇవాళ ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో…ఎమెస్కో ప్రచురణల సంపాదకులు ఆచార్య డి. చంద్రశేఖర్ రెడ్డి, తెలంగాణ భాష – సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ తదితరులు మాట్లాడారు.