– నేడు ఫైనల్లో ఢిల్లీ, బెంగళూర్ ఢొ మహిళల ప్రీమియర్ లీగ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు కొత్త చాంపియన్ ఖాయమే. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ నేడు టైటిల్ పోరులో అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది రెండో ఫైనల్స్ కాగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కు ఇదే తొలి టైటిల్ పోరు. గత సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్‌గా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూర్.. ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. బెంగళూర్, ఢిల్లీలలో ఎవరు నెగ్గినా డబ్ల్యూపీఎల్‌కు కొత్త చాంపియన్ రానుంది. డబ్ల్యూపీఎల్ ఫైనల్ నేడు రాత్రి 7.30 నుంచి ఆరంభం కానుంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ నాలుగు మ్యాచుల్లో తలపడగా.. నాలుగింటా ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించటం గమనార్హం. ఈ గణాంకాలను బెంగళూర్ అమ్మాయిలు నేడు టైటిల్ పోరులో సరి చేస్తారేమో చూడాలి.
ఎవరు నెగ్గినా చరిత్రే! :
మహిళల ప్రీమియర్ లీగ్‌లోనే కాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ప్రాంఛైజీలకు టైటిల్ విజయం లేదు. డబ్ల్యూపీఎల్‌లో టైటిల్ నెగ్గితే ఐపీఎల్‌లో మెన్స్ జట్టుకు ఈ విజయం గొప్ప ప్రేరణగా నిలువనుంది. దీంతో ఇరు జట్లు ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దిగ్గజ సారథి మెగ్ లానింగ్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను నడిపించటం ఆ జట్టుకు అదనపు అనుకూలత. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా మెగ్ లానింగ్ గొప్పగా రాణిస్తుంది. కెప్టెన్‌గా పదునైన వ్యూహలు, బ్యాట్‌తో విలువైన పరుగులు సాధిస్తుంది. మెగ్ లానింగ్‌కు యువ బ్యాటర్ షెఫాలీ వర్మ తోడవటంతో పవర్‌ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసం చెప్పనవసరం లేదు. రాధ యాదవ్, జెస్ జొనాసెన్‌లు బంతితో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలకంగా ఉన్నారు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కు కెప్టెన్ స్మృతీ మంధాన సహా ఆల్‌రౌండర్ ఎలిసీ పెర్రీ ప్రధానం. పెర్రీ వరుస మ్యాచుల్లో స్ఫూర్తిదాయక ప్రదర్శనలు చేసింది. ఓటమి ఖాయం అనుకున్న మ్యాచుల్లో గొప్పగా పుంజుకుని విజయాలు సాధించటం బెంగళూర్ జట్టుకు అదనపు బలం. టైటిల్ పోరులోనూ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆ జట్టు అవకాశాలను అప్పుడే కొట్టిపారేయలేం. ఆషా శోభన, శ్రేయాంక పాటిల్‌లు బంతితో ఆర్‌సీబీకి కీలకంగా ఉన్నారు.