బిల్క్విస్ మీర్… కాశ్మీరీ వాటర్ స్పోర్ట్స్ అథ్లెట్. ఎన్నో పోరాటాలు చేసి గొప్ప అనుభవమున్న క్రీడాకారిణిగా, కోచ్ గుర్తింపు తెచ్చుకుంది. కాశ్మీర్ లోయ నుండి మొదటి మహిళా వాటర్ స్పోర్ట్స్ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకునేందుకు మరో పేజీని సిద్ధం చేసుకుంది. జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు పారిస్‌లో జరగనున్న సమ్మర్ ఒలింపిక్స్‌కు ఆమె జ్యూరీ మెంబర్‌గా ఎంపికయ్యారు. దాంతో ఈ ఒలింపిక్స్‌కు జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించే మొదటి భారతీయ మహిళగా నిలిచిన ఆమె పరిచయం నేటి మానవిలో…
‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఎంతో కష్టపడి ఇక్కడికి చేరుకున్నాను. ఇప్పుడు నేను పోషించబోయే పాత్ర అంత్యంత బాధ్యతతో కూడుకున్నది. పోటీల్లో నాయాన్యాయాలను బేరీజు వేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. అయితే నా దేశానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఓ అథ్లెట్‌గా ఒలింపిక్స్‌లో ఆడాలనే నా కలను నేను నెరవేర్చుకోలేకపోయాను. కానీ ఇప్పుడు న్యాయనిర్ణేతగా ఉండబోతున్నాను’ అంటూ మీర్ తన ఆనందాన్ని పంచుకుంది.
అపచారంగా భావించేవారు
పాఠశాల నుండి తడి బట్టలతో ఇంటికి తిరిగి వస్తుండగా చుట్టుపక్కల వారి నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. అప్పట్లో ఆడపిల్లలు క్రీడల్లో పాల్గొనడం అపచారంగా భావించే సమాజం వారిది. అందుకే తల్లిదండ్రులు ఆమెను తిట్టారు. అవేవీ ఆమె లెక్క చేయలేదు. వాటర్ స్పోర్ట్స్ క్లాసులకు హాజరు కావడానికి పాఠశాలను సైతం కోల్పోతుంది. తాను ఏం చేయాలనుకుంటుందో దానికే కట్టుబడి ఉంది. ఇక ఆమె ఆగలేదు. 1997లో దేశవాళీ టోర్నీలో పాల్గొని పతకం సాధించింది. ‘మహిళల పోరాటం వారి ఇంటి గుమ్మం నుండే ప్రారంభమవుతుంది. నా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు, కానీ చాలా కోపంగా ఉన్నారు’ ఆమె జతచేస్తుంది.
ప్రధాన కోచ్‌గా
2009లో హంగేరిలోని స్జెడ్‌లో కయాకింగ్, కానోయింగ్‌లో జరిగిన ఐసీఎఫ్ స్ప్రింట్ రేసింగ్ ప్రపంచ కప్‌లో పోటీ పడింది. 2007, 2008లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. 2007 నుండి ఇండియన్ క్యాంప్‌లో మీర్ కోచింగ్ ప్రారంభించింది. ఒక్క ఏడాదిలోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో కానోయింగ్, కయాకింగ్ శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆమె 2013 వరకు కోచింగ్‌లో కొనసాగింది. తర్వాత జమ్మూ-కాశ్మీర్‌కు తిరిగి వచ్చింది. 2011లో కయాకింగ్, కానోయింగ్ క్రీడాకారులతో కూడిన భారత మహిళల జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యింది.
మద్దతు ఇచ్చేందుకు
2020లో ఇండోనేషియాలో జరిగే 18వ ఆసియా క్రీడల కానో స్ప్రింట్‌కు మీర్‌ను ఏషియన్ కానో ఫెడరేషన్ న్యాయనిర్ణేతగా ఎంపిక చేసింది. సెప్టెంబర్ 2023లో చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడలకు ఆమె జ్యూరీ సభ్యురాలు. యువ క్రీడాకారులు తన కెరీర్‌లో తాను చూసిన సవాళ్లను ఎదుర్కోకూడదని మీర్ అభిప్రాయపడ్డారు. అందుకే కాశ్మీర్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆమె స్థానిక యువ క్రీడాకారులకు కయాకింగ్, కానోయింగ్ పాఠాలను అందించడం ప్రారంభించింది. ఆమె మార్గదర్శకత్వంలో దాదాపు 110 మంది విద్యార్థులు రాష్ట్రం నుండి జాతీయ పోటీలలో గెలుపొందారు. ‘ఒక ఆటగాడికి మార్గదర్శకత్వం, మద్దతు ఎంత ముఖ్యమో నేను గ్రహించాను. ప్రోత్సాహం, చేయూత ఇచ్చే వారి అవసరం ఉంటుంది. అటువంటి సహకారం నాకు అందలేదు. కాబట్టి అలాంటి మద్దతు నేను యువ క్రీడాకారులకు అందించాలనుకుంటున్నాను’ ఆమె జతచేస్తుంది.
పోరాడుతూనే ఉంది
మీర్ క్రీడా ప్రయాణమంతా పోరాటాలతో నిండిపోయింది. ఓ కాశ్మీరీ అమ్మాయిగా క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడం ఆమె చేసిన అత్యంత సాహసవంతమైన పని. ‘ఆమె ఇతర అమ్మాయిలను చెడగొడుతుంది’, ‘నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఎలా ఆడగలవు?’ వంటి మాటలతో ఆమెను ఇబ్బంది పెట్టిన వ్యక్తులను ఆమె గుర్తుచేసుకుంది. అలాగే తను కోచ్‌గా మారిన తర్వాత పురుషుల జట్టుకు ఆమెను కేటాయించిన రోజును మీర్ ఇలా గుర్తు చేసుకుంది.. ‘నేను వారికి శిక్షణ ఇవ్వగలనా అని ప్రజలు ఎగతాళిగా నవ్వారు, సందేహించారు. కానీ మన గురించి మనకు తెలిస్తే చాలు. మనల్ని ఎవ్వరూ ఓడించలేరు అనేది నేను నమ్ముతున్నాను’. మీర్ తల్లి కూడా అనేక బాధలు భరించింది. ‘మీర్ కాశ్మీర్ పేరును చెడగొడుతుందని అందరూ అనేవారు. ఇలాంటి ఎన్నో మాటలు నేను వినాల్సి వచ్చింది’ అంటూ ఆమె తల్లి పంచుకుంది. ఇన్ని నిరుత్సాహపరిచే వ్యాఖ్యల మధ్య మీర్ పోరాటం చేస్తూనే ఉంది. కానీ ఆమె తల్లి ఆమెను విడిచిపెట్టకుండా ప్రోత్సహించింది.
దేశం గర్వించేలా…
తన కెరీర్‌ను ప్రారంభించినప్పుడు అవసరమైన వనరులు, మద్దతు, రోల్ మోడల్ అంటూ ఎవ్వరూ లేరని ఆమె నొక్కి చెప్పింది. ఇవన్నీ ఆమెను ఒలింపిక్స్‌కు చేరుకోకుండా నిరోధించాయని అంటున్నారు. ఇప్పుడు కాలం మారుతోంది. మహిళలు క్రీడల్లో ముందుకు వస్తున్నారు. వివిధ ఆటల్లో భారతదేశం గర్వించేలా చేస్తున్నారు. నిజానికి జ్యూరీ సభ్యురాలిగా పురుషాధిపత్య రంగంలో నిర్ణయం తీసుకునే పాత్రలలో పెరుగుతున్న మహిళా ప్రాతినిధ్యానికి ఇప్పుడు మీర్ ఓ నిదర్శనం. ‘మహిళలు తమ మనసును నిర్దేశిస్తే ఏదైనా చేయగలరు. అయితే ఉజ్వల భవిష్యత్తును సృష్టించుకోవడానికి వారు వదలకుండా పోరాడాలి. కంఫర్ట్ జోన్‌ల నుండి బయటపడాలి’ ఆమె చెప్పింది.
చిన్ననాటి కల
మీర్ తన చిన్నతనం నుండి బాక్సర్ కావాలనుకుంది. తన ఇంటి ముందరి చెట్టును ఎప్పుడూ గుద్దుతూ ఉండేదని ఆమె తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు. అయితే ఏడేండ్ల వయసులో ఆమె తన స్నేహితురాలితో కలిసి దాల్ లేక్‌లోని వాటర్ స్పోర్ట్స్ క్లాస్‌ని చూసేందుకు వెళ్ళింది. అంతే అంతా మారిపోయింది. కోచ్ ఆమెను సమీపంలోని పార్క్‌లో కూర్చోమని లేదా ఇతర విద్యార్థులతో పాటు ప్రాక్టీస్ చేయవల్సిందిగా కోరాడు. ఇక ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా విద్యార్థులతో చేరాలని నిర్ణయించుకుంది. ‘ఆ రోజు నా జీవితాన్ని మార్చేసింది. పడవను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా ఉన్నప్పటికీ మళ్లీ మళ్లీ ప్రయత్నించేందుకు నిర్ణయించుకున్నాను’ ఆమె పంచుకుంది.
అవగాహన లేకనే…
వాటర్ స్పోర్ట్స్ కోసం తల్లిదండ్రులను ఒప్పించేందుకు తనకు 15 రోజులు పట్టిందని ఆమె గుర్తుచేసుకుంది. ‘అప్పట్లో క్రీడల గురించి ఎటువంటి అవగాహన లేదు. కానోయింగ్, కయాకింగ్ తప్ప మహిళలు ఆడటం, క్రీడలను వృత్తిగా కొనసాగించడం అనేది లేదు. అందుకే నా తల్లిదండ్రులు అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. కానీ వారు చివరికి నా ఇష్టాన్ని అంగీకరించారు’ ఆమె చెబుతుంది. అతి తక్కువ కాలంలోనే ఆమె వివిధ కానోయింగ్ పోటీలలో పాల్గొనడం మొదలుపెట్టింది. మొత్తం 12 జాతీయ పోటీల్లో జమ్మూ కాశ్మీర్‌కు ప్రాతినిధ్యం వహించింది.