సంగారెడ్డిలో మొట్టమొదటి ‘మహిళా శక్తి’ పెట్రోల్‌ పంపు

సంగారెడ్డిలో మొట్టమొదటి 'మహిళా శక్తి' పెట్రోల్‌ పంపు– ప్రారంభించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ-సంగారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మహిళా శక్తి’ పథకంలో భాగంగా మొట్టమొదటి మహిళా పెట్రోల్‌ పంపును సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ప్రారంభించారు. అలాగే, సంగారెడ్డి పట్టణానికి మంచినీరు అందించడానికి రూ.44 కోట్లతో అమృత్‌ జలపథకం ప్రారంభించడంతో పాటు మహిళా షాపింగ్‌ కాంప్లెక్స్‌, స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మోడల్‌ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘మహిళా శక్తి’ పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఈ పథకం ద్వారా మహిళా క్యాంటీన్లు, పెట్రోల్‌ పంపు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు లాంటి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభ్యున్నతి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌, టీజీఐఐసీ చైర్మెన్‌ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్‌ క్రాంతి వల్లూరు తదితరులు పాల్గొన్నారు.