గిరి పుత్రుడికి తొలి యువపురస్కారం

గిరి పుత్రుడికి తొలి యువపురస్కారంపుట్టి పెరిగిన చెట్టూచేమే అతడి అక్షరానికి ఆయువు. తనవాళ్ల కలిమిలేములే అతని కవితలకు, కథలకు వస్తువులు. ఆ అనుభవ పాఠాలతో అల్లిన భావాలు ఉభయ రాష్ట్రాల్లో డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశాలయ్యాయి. అతడి సాహితీ సౌరభాలు ఎల్లలు దాటి పరిమళిస్తున్నాయి. ఈ ఇరవై ఆరేండ్ల యువ రచయితను నేడు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించింది. తెలుగులో ఆ పురస్కారం అందుకుంటున్న అత్యంత పిన్న వయస్కుడు, తొలి బంజారా యువకుడు రమేష్‌ కార్తీక్‌ నాయక్‌.
”ఒకప్పుడు అడవి బిడ్డలం. ఇప్పుడు అడవి వదిలేసిన బిడ్డలం. అడవి మీద హక్కులు పోయాయి. నిలబడ్డ నేల మీద కూడా హక్కులు లేకుండా పోయాయి. అందరి జీవితాల గురించి తెలీదు కానీ నా జీవితానికి, నా నేలకి, నా అనుభవాలకు నేను అతిథిని. ఇప్పుడు నా స్థితి ఖలీల్‌ జిబ్రాన్‌ ‘మాడ్‌ మ్యాన్‌’ కవితలా ఉంటుండేది. కలలో నాకో ప్రపంచం ఉంది. వాటి నుండి చాలా నేర్చుకుంటున్నాను. నా కవితలకు కథలకు వస్తువులు ఎక్కువ అక్కడే దొరుకుతుండేవి” ఓ ఇరవై ఆరేండ్ల పిల్లోడి నుండి ఇంతటి వేధనా భరితమైన, బాధ్యతా యుతమైన మాటలు వినడం ఓ విధంగా ఆశ్చర్యమే. సమాజం కోసం, తన జాతి కోసం తపిస్తూ అక్షరాలనే ఆయుధాలుగా మలుచుకుని సమాజంతో యుద్ధం చేస్తున్నాడు రమేశ్‌ కార్తీక్‌ నాయక్‌.
రమేశ్‌ది సన్నకారు రైతు కుటుంబం. తమలా మట్టి పిసుక్కోకూడదని పిల్లల్ని మంచి స్కూళ్లలో చేర్పించారు తల్లిదండ్రులు సేవంతాబాయి, నునావత్‌ మోజీరాంలు. ఆంగ్ల మాధ్యమంలో చేరినా.. గురువుల ప్రోత్సాహంతో తెలుగులో కవితలు, కథలు రాయటం ప్రారంభించాడు. సాహిత్యంపై మక్కువతో తరగతి పుస్తకాలకు బదులు కథలు, కవితల పుస్తకాలనే నేస్తాలుగా మలచుకునేవాడు. తర్వాత తను పాలిటెక్నిక్‌లో చేరడంతో మళ్లీ సాహిత్య సేద్యం మొదలైంది. డీఎడ్‌ చదివి ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ నుంచి స్పానిష్‌ భాషలో డిప్లొమాలో చేరాడు. రెండో ఏడాదికి ఉత్తీర్ణత సాధించినా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొనసాగించలేదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌లో ఎంఏ పూర్తి చేసిన అతడు, ప్రస్తుతం ఓయూలోనే ఎంఏ తెలుగు చదువుతున్నాడు. 2023లో ప్రయివేట్‌ కళాశాలలో ఇంగ్లిష్‌ అధ్యాపకుడిగా పని చేశాడు. ప్రస్తుతం దూరదర్శన్‌లో ‘అక్షరం’ అనే సాహిత్య కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
అతడి అక్షర ప్రయాణం ‘బల్దేర్‌ బండి’ ఎక్కి ‘ఢాల్లో తో ఢిల్లీ చేరింది. అతడి తొలి కవితా సంపుటిలో గిరిజనులు బతుకుదెరువు కోసం వలస వెళ్లే క్రమంలో వినియోగించే ఎడ్ల బండి నేపథ్యంగా ఈ కవితలు ఉంటాయి. ఈ మట్టి పరిమళాలు పాఠకులకు ఎంతగా నచ్చాయంటే.. ఇందులోని ‘జారేర్‌ బాటి’ కవిత కాకతీయ విశ్వవిద్యాలయ డిగ్రీ కోర్సు ఐదో సెమిస్టర్‌లో పాఠ్యాంశంగా చేర్చారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఎం.ఏ తెలుగు నాలుగో సెమిస్టర్‌లో పుస్తకం మొత్తాన్ని యూనిట్‌ పాఠ్యాంశంగా పెట్టారు. నూనూగు మీసాల వయసులో ఓ కుర్రాడు రాసిన కవితలు విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులకు పాఠ్యాంశంగా మారడం గొప్పే కదా! 2022లో ఆచార్య సూర్యధనుంజయతో కలిసి సహ సంపాదకీయంలో ‘కేసులా’ పేరుతో తొలి గోర్‌ బంజారా కథలు తీసుకువచ్చాడు. 2023లో ‘చక్మక్‌’ అనే ఆంగ్ల కవితా సంపుటి రచించాడు. నేడు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం, రావిశాస్త్రీ పురస్కారం అందుకున్న ‘ఢావ్లో – గోర్‌ బంజారా కతలు’ 2021లో వెలువడింది.
”మా బంజారాల జీవితంలో తెలుగుకు ప్రత్యేక అనుబంధం ఉంది. మేము తెలుగు భాషను వాడినంతగా బంజారా భాష వాడటం తక్కువే. నాకు తెలిసిన చిన్నచిన్న విషయాలను సజీవపరచడానికి ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాను. లంబాడీలనగానే, వారు వేసుకునే బట్టలు, బొక్క గాజులు, పత్రికల్లో వచ్చే ఆడపిల్లల్ని అమ్ముకునే వార్తలు తప్పించి ఏమీ తెలియని ప్రపంచంలో మావాళ్లు బతుకుతున్నారు. లంబాడీలు తెలుగు మాట్లాడడానికి ఎప్పుడూ సిగ్గుపడలేదు. కానీ వారి చుట్టూ ఉన్న సమాజం, తమ సొంత భాష గోర్‌ బోలి మాట్లాడితే, అది తప్పు అన్న స్పహను తీసుకువచ్చింది. ఇలాంటి సమయాల్లోనే కదా ఏదో ఒక అద్భుతం జరగాలి.
మా వాళ్ల జీవితాల్లో చావు, బతుకు, పెళ్లి, పేరంటం ఇలా అన్నీ కూడా నెమ్మదిగా సాగుతూ ఉంటాయి. గోర్‌ బంజారాలది హడావిడి తెలియని జీవితం. అందుకేనేమో నా కథల్లో నరేషన్‌ నెమ్మదిగా ఉంది. నా కథకి ఎంత వైశాల్యం కావాలో అంతా ఇచ్చే స్వేచ్ఛను నా హక్కు అనుకున్నాను, అదే నమ్ముతున్నాను. తెలుగులో గిరిజన ఆదివాసీ సాహిత్యం విస్తతంగా రావాల్సిన అవసరం ఉంది. కనీసం ఇలా లిఖిత పూర్వకం అయితే, పాఠకులు బంజారా భాషతో పాటు, వారికి తెలియని తండావాసులనూ పరిచయం చేసుకుంటారు. వారి మీద సానుభూతి చూపించకుండా, ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు. లేదంటే వారిమీద ఉన్న అపోహలు నిజమైపోయి, అవే ప్రచారమౌతాయి. అందుకే మాకులాగే ఉన్న గిరిజన ఆదివాసీ జీవితాలను రికార్డు చేసే పనిలో ఉన్నాను. దానికోసం ప్రొఫెసర్‌ సూర్యాధనంజరు గారితో కలిసి కథలు సేకరిస్తున్నాను. త్వరలో ఆ కథా సంపుటి కూడా రానుంది” అని స్వయంగా వివరించాడు.
”గిరిజనులతో ఏమవుతుందిలే అనుకున్న వారికి ఈ అవార్డుతో సమాధానం దొరుకుతుంది. నేను పుట్టి పెరిగిన వాతావరణం, మా గిరిజనుల శ్రమైక జీవనం ఆధారంగా నేను రచించన కవితలు, కథలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. చిన్నప్పటి నుంచి కండ్లెదుట కనిపించిన వాస్తవిక ఘటనలను నా రచనల్లో పొందుపర్చాను. సమాజంలో అందరికీ ఉపయోగపడే సాహిత్యాన్ని అందించి మనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడమే నా లక్ష్యం” అని అంటున్నాడు.
మోహన్‌కృష్ణ, 8897765417