చేపలు మృత్యువాత

– మత్స్యకారులకు రూ.10లక్షల నష్టం
– ఉన్న చేపలను తక్కువ ధరకు విక్రయిస్తున్న వైనం
– రోడ్డున పడిన 150కుటుంబాలు
– ప్రభుత్వం ఆదుకోవాలని వినతి
– పోల్కంపల్లి నాగులమ్మ చెరువును సందర్శించిన రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ
నవతెలంగాణ-రంగారెడ్ది ప్రతినిధి
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లి నాగులమ్మ చెరువులో ఆ గ్రామానికి చెందిన మత్స్యకారులు ఆంధ్ర నుంచి సుమారు రూ.3 లక్షల విలువ చేసే వివిధ రకాల చేపలను తెచ్చి వదిలారు. గత సంవత్సరం విస్తారంగా వర్షాలు కురవడం వల్ల చెరువు నీళ్లతో కలకలలాడింది. సుమారు 150 కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. చెరువులోకి నీళ్లు సమద్ధిగా రావడంతో మత్స్యకారుల ఆశలు రేకెత్తించాయి. దాంతో వేసిన చేపలు గ్రామంలో ప్రతి రోజూ పడుతూ అక్కడే విక్రయాలు జరుపుతూ ఉపాధి పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం వర్షాకాలంలో వర్షాలు పూర్తిగా వెనకంజ వేశాయి. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరుగుతుంది. చెరువులోని ఉన్న కొద్దిపాటి నీరు ఎండుముఖం అడుగంటడం మొదలు పెట్టింది. సుమారు మూడు లక్షల రూపాయల విలువ చేసే చేపలను చెరువులో వదలడంతో నీళ్లు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మత్స్య సంపదకు అనుకూలంగా లేకుండ పోయింది. చేపలు ఉత్పత్తి పెరగడంతో చెరువులో చేపలు తిరిగేందుకు అణువుగా చెరువు లేకుండా పోయింది. దాంతో చెరువులో అధిక ఒత్తిడికి గురై ఒక్క రోజులోనే సుమారు రూ.10 లక్షల విలువ చేసే చేపలు మత్యువాత పడ్డాయి. చెరువు అంత మతి చెందిన చేపలతో నిండిపోయింది.
ఉన్న చేపలను తక్కువ ధరకు విక్రయిస్తూ…
రోజురోజుకు చెరువులో అధిక ఒత్తిడికి గురై మృత్యువాత పడుతున్న చేపల సంఖ్య పెరుగుతుండడంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే హైదరాబాద్‌కు చెందిన చేపల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. లేకుంటే ఆ చేపలు కూడా మత్యువాత పడి మరింత ఆర్థిక నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. మృత్యువాత పడిన చేపలను సమీపంలోనే జెసిబితో పెద్ద గోతి తీసి అందులో వేసి కప్పేస్తున్నారు. ఒక్క రోజులోనే గ్రామంలో దుర్వాసన వెదజల్లడంతో గ్రామస్తులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మత్స్య కార్మికులు చనిపోయే చేపలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.
మత్స్యకారుల కుటుంబాలకు తీవ్రమైన నష్టం…
ఒకసారిగా చేపలు మత్యువాత పడటంతో మత్స్యకారుల కుటుంబాలకు పెద్ద ఎత్తున్న నష్టాన్ని మిగిల్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయగా అవి అనుకున్న స్థాయిలో పెరగలేకపోయాయి. నీళ్లు సమద్ధిగా ఉండడంతో రెండు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి వెళ్లి ప్రత్యేకంగా పిల్లలను తీసుకొచ్చి వదిలారు సుమారు మూడు లక్షల విలువచేసి చేపలను వదలడంతో మత్స్య సంపద అధికంగా పెరిగింది. ప్రతి రోజు చేపలను పడుతూ విక్రయించి ఉపాధి పొందుతున్నారు. ఒక్కసారిగా చేపలు మతిచెందడంతో సుమారు పది లక్షల విలువ చేసే మత్స్య సంపద పూర్తిగా నష్టాన్ని మిగిల్చింది. దాంతో చేసేది లేక మత్స్య కార్మికులు అతి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. పైగా చేపలకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం లేకపోవడంతో మత్స్య కార్మికులు మరింత నష్టపోవాల్సి పరిస్థితి ఏర్పడింది.
మత్స్య కారులను ఆదుకోవాలి
నీటి కొరత కారణంగా మృత్యువాత పడిన చేపల చెరువును మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ముఠా విజరు కుమార్‌, మత్స్యకారులతో కలిసి సందర్శించారు. మృత్యువాత పడిన చేపలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోల్కంపల్లిలో నాగులమ్మ చెరువులో రూ.10 లక్షల విలువ చేసే మత్స్య సంపద రసాయన పదార్థాలు కలిసి మృత్యువాత పడ్డాయా లేక ప్రకృతి వైపరీత్యాల వల్ల మృత్యువాత పడ్డాయా అర్థం కావడం లేదన్నారు. చెరువులోని నీటిని ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయించాలన్నారు. ఈ చెరువుపై నమ్ముకున్న 150 ముదిరాజ్‌ మత్స్యకారుల కుటుంబాలకు తీవ్రమైన నష్టం వాటిల్లిందన్నారు. నష్టపోయిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా ప్రభుత్వం మృత్యువాతపడుతున్న పశువులు, గెదెలు, కుక్కలు, గోర్రెల మేకలకు ఇన్సూరెన్స్‌ క్లేయిము చేసి ఇస్తున్నారని చేపలకు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వాటి మాదిరిగా చేపలకు ఇన్సూరెన్స్‌ చేయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పోల్కంపల్లి సోసైటి అధ్యక్షులు కావాలి లక్ష్మయ్య, కార్యదర్శి పూల శ్రీనివాస్‌, మాజీ అధ్యక్షులు కట్టెల బిక్షపతి, ఉపాధ్యక్షులు బెత్తం బిక్షపతి, మాజీ కార్యదర్శి కావాలి నర్సింహ్మా, కట్టెల ఆనంద్‌, కె శంకరయ్య, పాల్గొన్నారు.