ఎన్నికల ప్రణాళికలో మత్స్యకారుల సమస్యలు పొందుపర్చాలి

Fishermen's issues should be included in the election plan– సంక్షేమానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించి అమలు చేయాలి
– తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎన్నికల ప్రణాళికల్లో మత్స్యకారుల, కార్మికుల సమస్యలు పొందుపర్చాలనీ, వారి సంక్షేమానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించి ప్రణాళికా బద్దంగా ఖర్చు చేయాలని అఖిల భారత మత్స్యకారులు, మత్స్యకార్మిక సమాఖ్య జాతీయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహా డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లలోని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి ఎన్నికలకు ముందే ఎన్సీడీసీ ద్వారా రూ. 1000 కోట్లతో 64 రకాల సంక్షేమ పథకాలు అమలు చేసి మత్స్యకార కుటుంబాలని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రతి మత్స్య సొసైటీకి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం చేయాలన్నారు. మత్స్య మహిళా సొసైటీలకు రూ.5 లక్షలివ్వాలనీ, 5ం ఏండ్లు నిండిన ప్రతి మత్స్య కారుడికి రూ. 5 వేల వృద్ధాప్య పింఛ ను ఇవ్వాలని డిమాండ్‌ చేవారు. మత్స్య కారులకు ఎంతో మేలు చేస్తున్నట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందనీ, అదంతా ప్రచారమేనని విమర్శించారు. వాస్తవంగా క్షేత్ర స్థాయిలో మత్స్యకారుల పరిస్థితి కడు దీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో వారికి మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకుంటున్నారనీ, ఆ తర్వాత వారికిచ్చిన వాగ్దానాలు మరిచిపోతున్నారని విమర్శించారు. మత్స్యకారులు, కార్మికుల అభివృద్ధి జరగాలంటే మేము ప్రతిపాదిస్తున్న 15డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కమిషనర్‌ లచ్చిరాం భూక్యా, ఫెడరేషన్‌ చైర్మెన్‌ పిట్టల రవీందర్‌కు వినతి పత్రం సమర్పిం చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మురారి మోహన్‌, చనమోని శంకర్‌, రాష్ట్ర కార్యదర్శులు ఎం.రమేష్‌, గొడుగు వెంకట్‌, రాష్ట్ర నాయకులు సిహెచ్‌ వెంకన్న, బొడ్డు బాల సైదులు, బక్క బాలమణి, చంద్రి పుష్ప, కె లక్ష్మీ, ఎస్‌ మంగమ్మ, బోద్రమోని నర్సింహ్మా, రావణమోని రాజు, నీళ్ళ కృష్ణ, సాదు యాదయ్య, కె.నర్సింహ్మా తదితరులు పాల్గొన్నారు.